OG Movie: పవన్ కళ్యాణ్ విలన్‌కు డెంగ్యూ... ముంబైలో ఆగిన 'ఓజీ' షూటింగ్
Emraan Hashmi: పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ' సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన డెంగ్యూ బారిన పడ్డారు.

Pawan Kalyan's OG Movie Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న గ్యాంగ్‌స్టర్ సినిమా 'ఓజీ' (The Call Him OG). ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఇటీవల మొదలైన తాజా షెడ్యూల్‌లో ఆయన జాయిన్ అయ్యారు. అయితే డెంగ్యూ అని తెలియడంతో షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయని తెలిసింది.
వారం విశ్రాంతి తీసుకోవాల్సిందే
ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలోని ఆరే కాలనీలో ఓజీ కొత్త షెడ్యూల్ మొదలు అయింది. చిత్రీకరణకు వచ్చిన తర్వాత ఇమ్రాన్ హష్మీ కాస్త ఇబ్బంది పడ్డారట. అనారోగ్యం బారిన పడినట్లు అర్థం అవుతూ ఉండడంతో పాటు సింప్‌టంప్స్ బయట పడడంతో మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. ఆయనకు డెంగ్యూ అని తెలిసిందట.
డెంగ్యూ అని తెలిసిన వెంటనే 'ఓజీ' దర్శక నిర్మాతలకు ఇమ్రాన్ హష్మీ తన ఆరోగ్యం గురించి సమాచారం ఇచ్చారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తన పరిస్థితి వివరించడంతో పాటు వారం పాటు వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సుజీత్, డీవీవీ దానయ్యలకు ఇమ్రాన్ హష్మీ తెలిపారట. డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ చిత్రీకరణకు హాజరు అవుతానని వివరించారట. ప్రస్తుతానికి ఇమ్రాన్ హష్మీ ముంబైలోని తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన మళ్లీ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారనేది క్లారిటీ లేదు.
సెప్టెంబర్ 25న థియేటర్లలోకి 'ఓజీ'
OG Movie Release Date: పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు' జూన్ 12న థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 25న 'ఓజీ' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు రానున్నట్లు ఇటీవల అనౌన్స్ చేశారు. వీరమల్లు చిత్రీకరణ పూర్తి చేసిన పవన్... ఈ మధ్య హైదరాబాద్ సిటీలో జరిగిన ఓజీ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. అలాగే ముంబై షెడ్యూల్ కోసం పవన్ ముంబై వెళ్లారు. ఇమ్రాన్ హష్మీకి డెంగ్యూ రావడంతో ఆయన అవసరం లేని, పవన్ కళ్యాణ్ మీద తీయాల్సిన సన్నివేశాలు తీస్తారేమో చూడాలి.
పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్న 'ఓజీ' సినిమాలో శ్రియా రెడ్డి ఒక కీలక పాత్ర చేస్తున్నారు. 'సాహో' తర్వాత సుజీత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన 'హంగ్రీ చితా' పాటతో పాటు ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మీద అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' చేస్తున్నారు.





















