Sasivadane: ఏమిటో ఏమిటో... ఈ మెలోడీ ఇంత బావుందేమిటో, మళ్లీ మళ్లీ వినేలా!
Sasivadane movie songs: రక్షిత్ అట్లూరి, కోమలి జంటగా నటించిన 'శశివదనే'లో కొత్త పాట 'ఏమిటో ఏమిటో...'ను ఇవాళ విడుదల చేశారు.
'ఏమిటో ఏమిటో...
జాలి లేని దేవుడేమో గుండెకే
వేశాడు పిల్ల బాణం
ఎందుకో ఎందుకో
ఊపిరాడనట్టి చేప పిల్ల లా
కొట్టేసుకుంది ప్రాణం'
అంటూ పాట పడుతున్నారు రక్షిత్ అట్లూరి. ఆ పాట కోమలి కోసమే!
'పలాస 1978'తో యువ హీరో రక్షిత్ అట్లూరి మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన కొత్త సినిమా 'శశివదనే'. కోమలి (Komalee Prasad) కథానాయిక. శ్రీమతి గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్ స్టూడియోస్ ప్రై లి సంస్థలపై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల ప్రొడ్యూస్ చేస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో 'ఏమిటో ఏమిటో...' పాటను ఈ రోజు విడుదల చేశారు.
గోదావరి అంత అందమైన మెలోడీ... బావుందమ్మా!
అమ్మాయి మీద అబ్బాయి మనసు పడిన తర్వాత తన హృదయంలో భావాలను ఈ పాట రూపంలో వ్యక్తం చేసినట్టు అర్థం అవుతోంది. ఈ పాట ఏ సందర్భంలో వస్తుందో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు ఆగాలని దర్శక నిర్మాతలు చెప్పారు.
'ఏమిటో ఏమిటో...' పాటను కరుణాకర్ అడిగర్ల రాశారు. శరవణ వాసుదేవన్ బాణీ అందించగా... పి.వి.ఎన్.ఎస్. రోహిత్ పాడారు. వినసొంపైన బాణీలో అచ్చ తెలుగు పదాలతో పాట రాయడం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది.
'ఆ... కనుల కాటుక ఏమో ఘాటుగా
నా... మనసు మీద వాలే మత్తుగా
పెదవిపై పూసిన నవ్వులేమో
బదులుగా ఎదనిలా తొలిచనేమో' సాగిందీ గీతం!
Also Read: ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ: వరుణ్ తేజ్ దేశభక్తి సినిమా హిట్టా? ఫట్టా?
ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు 'శశివదనే'!
Sasivadane Telugu Movie Release Date: గోదావరి జిల్లాల నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన ప్రేమ కథలకు భిన్నంగా సరికొత్త ప్రేమ కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది. ఏప్రిల్ 5న థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 'మనసులో పుట్టే ప్రేమ మచ్చ లేనిదైతే... ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే' అంటూ విడుదల తేదీ వెల్లడించిన సందర్భంగా పేర్కొన్న మూవీ డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచింది.
Also Read: భూతద్దం భాస్కర్ నారాయణ రివ్యూ: సైకో సీరియల్ కిల్లర్ ఎవరు? శివ కందుకూరి సినిమా ఎలా ఉందంటే?
''గోదావరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న తొలి యాక్షన్ అండ్ లవ్ డ్రామా ఇది. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది'' అని నిర్మాత అహితేజ బెల్లంకొండ తెలిపారు. హీరో హీరోయిన్లు రక్షిత్, కోమలి అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు చేశారని ఆయన చెప్పారు. 'డీజే పిల్ల...' అంటూ సాగే గీతంతో పాటు టైటిల్ సాంగ్ కూడా కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఆ రెండు పాటలతో పాటు టీజర్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుందని, ప్రచార చిత్రాలకు లభించిన స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని దర్శక నిర్మాతలు తెలిపారు.
'శశివదనే' సినిమాలో సంగీత దర్శకుడు - నటుడిగా మారిన రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, 'రంగస్థలం' మహేష్ (ఆచంట) , ప్రవీణ్ యండమూరి, 'జబర్దస్త్' బాబీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎడిటర్ : గ్యారీ బీహెచ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి, ఛాయాగ్రహణం : సాయికుమార్ దార, సాహిత్యం : కిట్టూ విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల, సంగీతం : శరవణ వాసుదేవన్.