(Source: ECI/ABP News/ABP Majha)
Bhoothaddam Bhaskar Narayana Review - భూతద్దం భాస్కర్ నారాయణ రివ్యూ: సైకో సీరియల్ కిల్లర్ ఎవరు? శివ కందుకూరి సినిమా ఎలా ఉందంటే?
Bhoothaddam Bhaskar Narayana review in Telugu: శివ కందుకూరి, రాశి సింగ్ జంటగా నటించిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' నేడు విడుదలైంది. డిటెక్టిక్ జానర్‌లో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?
పురుషోత్తం రాజ్
శివ కందుకూరి, రాశి సింగ్, దేవి ప్రసాద్, అరుణ్, శివ కుమార్, షఫీ తదితరులు
Shiva Kandukuri's Bhoothaddam Bhaskar Narayana movie review in Telugu: న్యూ ఏజ్ ఫిల్మ్స్, కాన్సెప్ట్ బేస్డ్ - కొత్త జానర్ కథలు తెలుగులోనూ పెరిగాయి. యువ హీరోలు, దర్శకులు కొత్త సినిమాలు అందించడానికి కృషి చేస్తున్నారు. ఆ కోవలో శివ కందుకూరి 'భూతద్దం భాస్కర్ నారాయణ' ఉంటుందని చెప్పవచ్చు. చిరంజీవి 'చంటబ్బాయ్', నవీన్ పోలిశెట్టి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తరహాలో డిటెక్టివ్ జానర్ & మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సీరియల్ కిల్లింగ్స్ మిక్స్ చేసి తీసిన చిత్రమిది. ప్రచార చిత్రాల్లో పురాణాల ప్రస్తావన సినిమాపై ఆసక్తి పెంచింది. మరి, డిటెక్టివ్ భాస్కర్ పాత్రలో శివ కందుకూరి ఎలా నటించారు? సినిమా బావుందా? అనేది రివ్యూలో చూద్దాం.
కథ (Bhoothaddam Bhaskar Narayana Story): ఏపీ, కర్ణాటక సరిహద్దులోని చించోళీ ప్రాంతంలో ఓ సీరియల్ కిల్లర్ 18 ఏళ్లలో 17 మంది మహిళల్ని చంపాడు. తల నరికి తీసుకు వెళ్లడంతో పాటు చంపిన తర్వాత డెడ్ బాడీలను అడవికి తీసుకువెళ్లి తూర్పు దిక్కు వైపు పెడతాడు. తలల స్థానంలో చెక్కతో చేసిన దిష్టి బొమ్మల్ని ఉంచుతాడు. దాంతో పోలీసులు దిష్టి బొమ్మ హత్యలుగా పేర్కొంటారు. ఈ కేసును ఎలాగైనా చేధించాలని లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు.
ఒక్క క్లూ కూడా వదలకుండా పక్కా ప్రణాళికతో వరుస హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ ఆటను భాస్కర్ నారాయణ ఎలా క్లోజ్ చేశాడు? అవి హత్యలు కాదని, నర బలులు అని అతడికి ఎందుకు అనుమానం వచ్చింది? భాస్కర్ నారాయణకు, ఈ కేసుకు ఉన్న సంబంధం ఏమిటి? అతని అన్న ఎవరు? రిపోర్టర్ లక్ష్మి (రాశి సింగ్) పాత్ర ఏమిటి? సీరియల్ కిల్లర్ ఎవరు? హత్యలు / నర బలులు ఎందుకు చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Bhoothaddam Bhaskar Narayana Review): సీరియల్ కిల్లర్ సినిమాలు తీసే మెజారిటీ దర్శకులు ఫాలో అయ్యే ఫార్ములా ఒక్కటే... చివరి వరకు సస్పెన్స్ మైంటైన్ చేయడం! 'భూతద్దం భాస్కర్ నారాయణ' దర్శకుడు పురుషోత్తం రాజ్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. అయితే... స్టార్టింగ్ స్లోగా తీసుకువెళ్లారు.
దర్శకుడిగా కంటే రచయితగా పురుషోత్తం రాజ్ ఎక్కువ సక్సెస్ అయ్యారు. డిటెక్టివ్ హీరో, పురాణాలు, సీరియల్ కిల్లింగ్స్, రాక్షసులు వంటివి మేళవించి మంచి కథ రాశారు. కథలోకి వెళ్లడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు. అందువల్ల, మొదట సోసోగా ఉంటుంది. అక్కడ గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ లేవు. ఇంటర్వెల్ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆసక్తిగా ఉంటుంది. ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్ ఇస్తుంది. దర్శకుడు సూపర్బ్ కమాండ్ చూపించారు. కిల్లర్ గురించి ఎక్కువ క్లూస్ ఇవ్వకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను ముందుకు నడిపించారు. గౌతమ్ కెమెరా వర్క్, శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం బాగున్నాయి.
భాస్కర్ నారాయణగా శివ కందుకూరి చక్కగా సూటయ్యారు. నటనలో కాన్ఫిడెన్స్ కనిపించింది. ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే మంచి కమాండ్ చూపించారు. హ్యాండ్సమ్ లుక్స్, యాక్టింగ్ వేరియన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. జర్నలిస్ట్ లక్ష్మీగా రాశి సింగ్ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. హీరో తండ్రిగా శివన్నారాయణ, పోలీసుగా శివ కుమార్, కీలక పాత్రలో షఫీ తదితరులు చక్కగా నటించారు. కీలక పాత్రలో దేవి ప్రసాద్ నటన థియేటర్ల నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులకు గుర్తు ఉంటుంది. నటుడిగా ఆయన్ను మరింత ఉన్నతంగా నిలబెట్టే చిత్రమిది.
Also Read: ఆపరేషన్ వాలెంటైన్ రివ్యూ: వరుణ్ తేజ్ దేశభక్తి సినిమా హిట్టా? ఫట్టా?
రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన చిత్రమిది. ఇండియన్ మైథాలజీ (పురాణాల్ని), క్రైమ్ ఎలిమెంట్స్ ముడిపెట్టిన తీరు బావుంది. ఫస్టాఫ్ కొంత స్లోగా సాగినా ఎంగేజ్ చేస్తుంది. సెకండాఫ్ బాగా వర్కవుట్ అయ్యింది. మరీ ముఖ్యంగా ట్విస్టులు పేలాయి. థ్రిల్ ఇచ్చాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ప్రామిసింగ్ థ్రిల్లర్ 'భూతద్దం భాస్కర్ నారాయణ'. ఈ జానర్ సినిమాలు నచ్చే ప్రేక్షకులను మెప్పిస్తుంది.
Also Read: చారి 111 రివ్యూ: 'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?