Sridevi Vijaykumar: ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ ఏంటో అప్పుడే నాకు తెలిసింది - నటి శ్రీదేవి
Sridevi Vijaykumar: 'ఈశ్వర్' సినిమాతో ప్రభాస్ - శ్రీదేవి విజయ్ కుమార్ లు హీరోహీరోయిన్లుగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. శ్రీదేవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ హీరో గురించి మాట్లాడింది.
Sridevi Vijaykumar: రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా 'ఈశ్వర్' సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా సీనియర్ నటులు మంజుల - విజయ్ కుమార్‌ల కూతురు శ్రీదేవి విజయ్ కుమార్ కూడా హీరోయిన్ గా పరిచయమైంది. తాజాగా శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ హీరో గురించి మాట్లాడింది. ప్రభాస్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారని చెప్పింది.
"మేమిద్దరం ఒకేసారి తెరంగేట్రం చేశాం. ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారినందుకు ఎంతో హ్యాపీగా వుంది. అతను దీనికి అర్హుడు. గొప్ప స్థాయికి వెళ్తావని 'ఈశ్వర్' టైంలోనే మేమంతా ఆయనకు చెప్పే వాళ్ళం. మేము అనుకున్న దాని కన్నా ఇంకా పెద్ద లెవల్ కు వెళ్లినందుకు సంతోషంగా వుంది. అతను చాలా మంచి మనిషి. ఆరోజు ఎలా ఉన్నారో ఈరోజు అలానే ఉన్నారు. అదే ఇన్నోసెన్స్, చిన్న పిల్లల బిహేవియర్ కొంచం కూడా మారలేదు. ఇద్దరం కలిసి సినిమా చేయటం వల్ల మాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. మా ఇద్దరికీ ఫస్ట్ సినిమా కావడంతో అందరిలాగే మాకూ కాస్త టెన్షన్ ఉండేది" అని శ్రీదేవి తెలిపింది.
"ఈశ్వర్ సినిమా రిలీజైన తర్వాత కొన్ని రూరల్ ఏరియాలకు సక్సెస్ టూర్ కి వెళ్ళాం. ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ ఏంటనేది అప్పుడే తెలిసిపోయింది. ఫస్ట్ మూవీకే ఒక హీరోకి ఇలాంటి రీచ్ వుంటుందని నేను అనుకోలేదు. థియేటర్లోకి ఆయన వస్తే అదొక సెలబ్రేషన్ లాగా అయిపోయేది. అది చూసి అతను చాలా అదృష్టవంతుడు అని డైరక్టర్ జయంత్, నాతో పాటుగా అందరూ అనుకున్నాం. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే రాబోయే రోజుల్లో ఎంతో ఎత్తుకు ఎదుగుతారని భావించాం. అలానే జరిగినందుకు చాలా హ్యాపీ. అతన్ని చూస్తే నిజంగా చాలా గర్వంగా ఉంది" అని శ్రీదేవి చెప్పుకొచ్చింది.
నిజానికి చైల్డ్ ఆర్టిస్టుగాగా కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి విజయ్ కుమార్.. 'రుక్మిణీ' సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసి, తొలిసారిగా తెలుగు తెర మీదకు వచ్చింది. ఆ తర్వాత 15 ఏళ్ల వయసులో 'ఈశ్వర్' మూవీలో ప్రభాస్ కు హీరోయిన్ గా నటించింది. నటుడు అశోక్ కుమార్ నిర్మాణంలో 2002 జూలై 28న రామానాయుడు స్టూడియోస్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 2002 నవంబర్ 11న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీసు దగ్గర పెద్దగా విజయం సాధించకపోయినా, హీరో హీరోయిన్లకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత 'నిన్నే ఇష్టపడ్డాను', 'నిరీక్షణ', 'ఆదిలక్ష్మి', 'పెళ్ళికాని ప్రసాద్', 'మంజీరా', 'సెల్ ఫోన్' 'వీర' వంటి తెలుగు సినిమాల్లో శ్రీదేవి నటించింది. ప్రస్తుతం పలు టెలివిజన్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
మరోవైపు 'బాహుబలి' సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన 'కల్కి 2898 AD' మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. దీని తర్వాత 'రాజా సాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.
Also Read: వరదరాజ మన్నార్ కు 'సలార్' ప్రశంసలు - ‘ది గోట్ లైఫ్’ ట్రైలర్ పై ప్రభాస్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్!