Prashanth Neel Movies: మొన్న‘సలార్’, నిన్న ‘NTR 32’, నేడు ‘KGF3’- ప్రశాంత్ నీల్ యూనివర్స్ చూడబోతున్నామా?
దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ తో ‘సలార్’ తెరకెక్కించగా, ఎన్టీఆర్ హీరోగా ‘NTR 31’ తెరకెక్కించబోతున్నారు. తాజాగా ‘KGF3’ కూడా కన్ఫార్మ్ అయ్యింది.
‘KGF’ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు. ప్రభాస్‌తో ‘సలార్’ మూవీని పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న ఆయన, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘NTR 31’ తెరకెక్కించబోతున్నారు. ‘KGF 2’ విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ‘KGF 3’ని అధికారికంగా ప్రకటించింది. ‘KGF’, ‘KGF2’తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన ప్రశాంత్ నీల్, ‘KGF 3’ని సైతం ఊహకందని రీతిలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు చిత్రాలతో ప్రశాంత్ నీల్ యూనివర్స్ చూడబోతున్నాం.
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సలార్’- సెప్టెంబర్ లో విడుదల
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'సలార్'ను ప్రశాంత్ నీల్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన, శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. 'కేజీఎఫ్' సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సినిమాను విడుదల కానుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా.. భువన గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. రూ.150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా, తెలంగాణలోని బొగ్గు గనుల్లో కూడా చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో విలన్ గా మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘KGF 3’ చిత్రాన్ని కన్ఫార్మ్ చేసిన హొంబలే ఫిల్మ్స్
కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్' సినిమా సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' సెన్సేషన్ క్రియేట్ చేసింది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో వసూళ్ళ వర్షాన్ని కురిపించింది. బాలీవుడ్‌లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ఈ సినిమా విడుదలైన ఏడాది పూర్తైన సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పెషల్ వీడియో విడుదల చేసింది. ఈ సినిమా సాధించిన ఘన విజయాన్ని గుర్తు చేసింది. చివర లో వాగ్దానం నిలనెబెట్టుకుంటున్నామంటూ ‘కేజీఎఫ్’ చాప్టర్-3 గురించి అనౌన్స్ చేసింది. ఈ వీడియో చూసి అభిమానులు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రతిష్టాత్మక చిత్రం
అటు ‘RRR’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడూ స్టార్ట్ చేసేదీ చెప్పేశారు ప్రశాంత్ నీల్. ఈ వేసవిలోనే ‘NTR 32’ (మొదట్లో NTR31, వార్-2 ప్రకటనతో NTR32గా మారింది) చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకు వెళతామని తెలిపారు. 'సలార్' విడుదల కంటే ముందే, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మూడు పాన్ ఇండియన్ సినిమాలతో ప్రశాంత్ నీల్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుకోబోతున్నారు. ‘KGF’కు మించిన విజయాలు సాధిచాలనే దీమాతో దూసుకెళ్తున్నారు.
Read Also: ‘కేజీఎఫ్’ అభిమానులకు గుడ్ న్యూస్ - సీక్వెల్‌పై వీడియో వదిలిన నిర్మాణ సంస్థ