AS Ravi Kumar Chowdary Passed Away - బ్రేకింగ్ న్యూస్: కార్డియాక్ అరెస్టుతో దర్శకుడు ఏఎస్ రవి కుమార్ చౌదరి మృతి
AS Ravi Kumar Chowdary Death News: దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందినట్లు ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణతో పాటు యువ హీరోలు నితిన్, సాయి దుర్గా తేజ్, రాజ్ తరుణ్ తదితరులతో సినిమాలు చేసిన దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి ఇక లేరు. గత రాత్రి (జూన్ 10వ తేదీ) కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కొన్నాళ్లుగా కుటుంబానికి దూరంగా!
ఏఎస్ రవికుమార్ చౌదరి కొన్ని రోజులగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారని తెలిసింది. దర్శకుడిగా ఆయన చేసిన చివరి సినిమాలు పరాజయాల పాలు కావడం వల్ల మానసికంగా ఒత్తిడికి లోనయ్యారని, మరోవైపు ఇండస్ట్రీలో సన్నిహితులు దూరం కావడం కూడా ఆయన మీద ప్రభావం చూపించిందని సమాచారం.
'యజ్ఞం' సినిమాతో దర్శకుడిగా...
ఆ వెంటనే బాలకృష్ణతో సినిమా!
గోపీచంద్ కథానాయకుడిగా ఈ తరం ఫిలిమ్స్ పతాకం మీద పోకూరి బాబురావు నిర్మించిన 'యజ్ఞం'తో రవికుమార్ చౌదరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా విజయం సాధించింది. ఆ తరువాత బాలకృష్ణతో 'వీరభద్ర' సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. నితిన్ హీరోగా చేసిన 'ఆటాడిస్తా' కూడా డిజాస్టర్ అయ్యింది. ఆ తరువాత 'ఏం పిల్లో ఏం పిల్లడో ' కాస్త ఊరట ఇచ్చింది.
సుప్రీం స్టార్, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా 'పిల్లా నువ్వు లేని జీవితం'తో మళ్లీ రవికుమార్ చౌదరి భారీ విజయం అందుకున్నారు. ఆ తర్వాత తన తొలి సినిమా హీరో గోపీచంద్‌తో మరో సినిమా చేశారు. అదే 'సౌఖ్యం'. అది కూడా ఆశించిన విజయం సాధించలేదు. ఫ్లాప్ అయ్యింది. ఇటీవల రాజ్ తరుణ్ హీరోగా 'తిరగబడరా సామి' సినిమాకు రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో మద్యానికి బానిస అయినట్టు సన్నిహితుల నుంచి అందుతోన్న సమాచారం.
Also Read: ఒక్క లుక్కుతో చంపేశాడు... 'అఖండ 2' టీజర్‌లో ఆది పినిశెట్టి - అదీ బాలయ్య సినిమాలో విలన్ ఇంపాక్ట్
'తిరగబడరా సామి' ప్రారంభోత్సవంలో హీరోయిన్ మన్నారా చోప్రాను ఏఎస్ రవి కుమార్ చౌదరి ముద్దు పెట్టుకోవడం వివాదానికి దారి తీసింది. ఆయన ప్రవర్తన వార్తల్లో నిలిచింది. సీనియర్ దర్శకులు సాగర్ దగ్గర వీవీ వినాయక్, శ్రీను వైట్లతో పాటు ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వ శాఖలో పని చేశారు.
Also Read: షాక్ ఇచ్చిన 'కుబేర' సెన్సార్ రిపోర్ట్... ఇప్పుడు భారం అంతా ధనుష్, నాగార్జున పైనే




















