Dhurandhar - Fake Currency: కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన 'ధురంధర్'... దొంగ నోట్ల పాపం వాళ్ళదేనా!?
Political Scene In Dhurandhar: రణవీర్ సింగ్ 'ధురంధర్'కు రివ్యూస్ బావున్నాయి. కలెక్షన్స్ బావున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని అంశాలు కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టేలా ఉన్నాయి.

దాయాది దేశం పాకిస్తాన్‌లో అండర్ వరల్డ్, మాఫియా, బలూచిస్తాన్ ఉద్యమకారుల అణచివేత, రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ బరిలో మంచి వసూళ్లు వస్తున్నాయి. టెర్రరిజాన్ని కూకటివేళ్లతో పెకలించడానికి దాయాది దేశంలోకి ఇండియన్ ఇంటిలిజెన్స్ బ్యూరో ఒకరిని పంపిస్తుంది. అక్కడ అతను ఏం చేశాడు? పాక్ మాఫియా, రాజకీయాలు ఎలా ఉన్నాయి? అనేది చూపించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ అయినా సరే ఇందులో కాంగ్రెస్ పార్టీపై సెటైర్స్ పడ్డాయి.
దొంగ నోట్ల పాపం ఎవరిది?
'ధురంధర్'లో భారత రాజకీయాల కంటే పాక్ రాజకీయాల ప్రస్తావన ఎక్కువ. మన దేశ నాయకులను చూపించలేదు. కానీ... సినిమాలో రెండు మూడు సందర్భాల్లో స్పేస్ తీసుకుని మరీ కాంగ్రెస్ పార్టీపై పంచ్ డైలాగ్స్ వేశారు దర్శకుడు ఆదిత్య ధర్. ముఖ్యంగా దేశంలో ఫేక్ కరెన్సీకి కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా వ్యవహరించిన ఓ వ్యక్తి అని స్పష్టంగా 'ధురంధర్'లో ఓ డైలాగ్ ఉంది.
'ధురంధర్' సినిమాలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్ అజయ్ సాన్యల్ పాత్రలో ఆర్ మాధవన్ నటించారు. ఆయన లుక్ చూస్తే అజిత్ దోవల్ గుర్తుకు వస్తారు. ఆ లుక్కు మాత్రమే కాదు... క్యారెక్టర్ కూడా ఆయనదే అన్నట్టు తీశారు దర్శకుడు ఆదిత్య ధర్.
Also Read: Akhanda 2 Vs Veeramallu: అఖండ 2 vs వీరమల్లు... బాలయ్య vs పవన్... ఎందుకీ రచ్చ? ఏమిటీ డిస్కషన్??
ఇండియాలో ఫేక్ కరెన్సీ పాకిస్తాన్ నుంచి వచ్చిందని సినిమాలో ఓ సన్నివేశం ఉంటుంది. ఫేక్ కరెన్సీ పట్ల భారత ఇంటెలిజెన్స్ బ్యూరోకి ముందుగా సమాచారం వస్తుంది. ఐబీ చీఫ్, మరొక అధికారి మధ్య సంభాషణలో భారత కరెన్సీ నమూనాలు ఓ మంత్రి ద్వారా పాక్ ఐఎస్ఐ చేతికి చిక్కాయని చెబుతారు. దీనిపై మనం చర్యలు తీసుకుందామా? అని అడిగితే... ''ఇప్పుడు వద్దు. తర్వాత మన ప్రభుత్వం వస్తుంది'' అని అజయ్ సాన్యల్ (ఆర్ మాధవన్) చెబుతారు. అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుందామని ఆయన ముందుగా నిర్ణయం తీసుకున్నారని అనుకోవాలి. 'ధురంధర్'లో రెండు మూడు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్లు చూపిస్తారు. సినిమా చూసినప్పుడు దొంగ నోట్ల పాపం కాంగ్రెస్ పార్టీదే అన్నట్టు ఉంటుంది.
దేశంలో ఫేక్ కరెన్సీ ఎలిమినేట్ చేయడానికి, పాక్ మీద దెబ్బ కొట్టడానికి 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేశారని ప్రేక్షకులు భావించేలా 'ధురంధర్'లో సన్నివేశాలు ఉన్నాయి. ఒక విధంగా డీమానిటైజేషన్ పట్ల విమర్శలు చేసిన వాళ్ళకు ఆ సీన్ సమాధానం చెబుతుంది. తీవ్రవాదులపై పోరుకు సైతం కాంగ్రెస్ నుంచి సరైన మద్దతు లభించలేదన్నట్టు అధికారుల సంభాషణలు సాగాయి. 'ధురంధర్ 2' వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది. అందులో ఎటువంటి రాజకీయ సన్నివేశాలు ఉంటాయో చూడాలి.
Also Read: 'అఖండ 2' వాయిదాకు కారణాలు... మద్రాస్ హైకోర్టులో, ల్యాబ్ దగ్గర ఏం జరిగింది?





















