Dear Uma Teaser: మెడికల్ మాఫియా మీద 'డియర్ ఉమ'... డాక్టర్ కోసం రాక్ స్టార్ యుద్ధం చేస్తే?
Dear Uma Movie Release Date: ఏప్రిల్ 18న థియేటర్లలోకి వస్తున్న తెలుగు సినిమా 'డియర్ ఉమ'. తెలుగమ్మాయి సమయా రెడ్డి నిర్మాతగా, కథానాయికగా చేసిన ఈ సినిమాలో మెడికల్ మాఫియా గురించి డిస్కస్ చేశారు.

'పేషెంట్లకు, డాక్టర్లకు మధ్య మీ లాంటి కమిషన్ ఏజెన్సీ, బ్రోకర్లు ఉండకూడదు సార్... దీని కోసం నేను ఎంత దూరమైనా వెళతాను' - ఇదీ 'డియర్ ఉమ' టీజర్‌లో హీరోయిన్ చెప్పే డైలాగ్. దీన్ని బట్టి కథలో మెయిన్ పాయింట్ ఏమిటనేది అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. మెడికల్ మాఫియా మీద రూపొందిన చిత్రమిది.
డాక్టర్ కోసం రాక్ స్టార్ యుద్ధం చేస్తే?
తెలుగమ్మాయి సుమయా రెడ్డి (Sumaya Reddy) కథానాయికగా నటించడంతో పాటు నిర్మాణ, రచన బాధ్యతలు నిర్వర్తించిన సినిమా 'డియర్ ఉమ'. ఇందులో పృథ్వీ అంబర్ హీరో. ఏప్రిల్ 18న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించిన ఈ సినిమా ట్రైలర్ ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ చేతుల మీదుగా విడుదలైంది.
'డియర్ ఉమ' టీజర్ రిలీజ్ చేసిన శివ నిర్వాణ... ఆ తర్వాత చిత్ర బృందాన్ని అభినందించారు. టీజర్ ఎంతో బాగుందని, ప్రేమతో పాటుగా అంతర్లీనంగా మంచి సందేశాన్ని ఇచ్చినట్టు అర్థం అవుతోందని, ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌లా ఉండబోతోందని ఆయన అన్నారు. టీజర్ గమనిస్తే... 'గుడిలో దేవుని వద్ద చేసే ప్రార్థనల కన్నా.. హాస్పిటల్‌లో నాలుగు గోడల మధ్య చేసే ప్రార్థనలే ఎక్కువ' అని హీరోయిన్ చెప్పే మాటతో ప్రారంభించారు. ఆమెది డాక్టర్ రోల్ అని అర్థం అవుతోంది. హీరో పృథ్వీ అంబర్ రాక్ స్టార్ (సింగర్) రోల్ చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత 'రెండు జీవితాలు... రెండు ప్రపంచాలు... రెండు భావోద్వేగాలు... ఇద్దరి ప్రేమలు... ఒక హృదయం... ఒక యుద్దం' అంటూ కథను క్లుప్తంగా చెప్పారు. మెడికల్ మాఫియాకు ఎదురు తిరిగిన హీరోయిన్ కోసం రాక్ స్టార్ చేసిన యుద్ధం కథలో కీలకమైన అంశం అనుకోవచ్చు. ప్రేమతో పాటు చక్కటి సందేశంతో సినిమా తీశామని చిత్ర బృందం చెబుతోంది.
Also Read: టాలీవుడ్‌లో విషాదం... అనారోగ్యంతో కన్ను మూసిన తల్లి... సప్తగిరి ఎమోషనల్ పోస్ట్
సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించిన ఈ సినిమాలో కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, సీనియర్ హీరోయిన్ ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, 'బలగం' రూపలక్ష్మీ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: సుమ చిత్ర ఆర్ట్స్, కూర్పు: సత్య గిడుతూరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నితిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: నగేష్ యూ.జీ, ఛాయాగ్రహణం: రాజ్ తోట, సంగీతం: రధన్, నిర్మాత : సుమయ రెడ్డి, దర్శకుడు: సాయి రాజేష్ మహాదేవ్.





















