![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Dasari Narayana Rao: దాసరి నారాయణరావు పేరు మీద దర్శకరత్న డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్... ఇకపై ప్రతి ఏడాదీ!
Darsaka Ratna DNR Film Awards: దాసరి నారాయణరావు పేరు మీద 'దర్శకరత్న డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్' ఇవ్వడానికి ఏర్పాట్లు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. మే5న శిల్పకళావేదికలో దాసరి జయంతి వేడుకలు చేస్తున్నారు.
![Dasari Narayana Rao: దాసరి నారాయణరావు పేరు మీద దర్శకరత్న డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్... ఇకపై ప్రతి ఏడాదీ! Darshaka Ratna DNR Film Awards Dasari Narayana Rao birth anniversary celebrations to be held on May 5th Dasari Narayana Rao: దాసరి నారాయణరావు పేరు మీద దర్శకరత్న డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్... ఇకపై ప్రతి ఏడాదీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/12/b047ceecb8c9a7ebb706380aeaff82181712885936775313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
''దాసరి నారాయణ రావు గారు కేవలం దర్శకత్వానికి మాత్రమే పరిమితం కాలేదు. చిత్ర పరిశ్రమలో దశాధిక రంగాల్లో రాణించారు. ఆయన పేరు మీద ప్రతి ఏడాదీ 'దర్శకరత్న డిఎన్ఆర్ అవార్డ్స్' ఇవ్వాలని సంకల్పించిన సూర్యనారాయణ గారిని అభినందిస్తున్నా'' అని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. మే 4వ తేదీన దాసరి నారాయణ రావు జయంతి. ఆ రోజున దర్శకుల దినోత్సవంగా తెలుగు దర్శకుల సంఘం ప్రకటించింది. కార్యక్రమాలు చేస్తోంది. ఆ మరుసటి రోజు... మే 5న హైదరాబాద్ శిల్పకళా వేదికలో దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలు, అవార్డుల కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
నేటి తరంలో స్ఫూర్తి నింపేలా... వివిధ రంగాల్లో అవార్డులు!
శతాధిక చిత్ర దర్శకుడిగా, దశాధిక రంగాల్లో అసాధారణ స్థాయిలో రాణించిన గొప్ప దర్శకుడు దాసరి నారాయణ రావు. దాసరి బహుముఖ ప్రతిభను ఈ తరానికి గుర్తు చేస్తూ, వారికి మరింత తెలియజేసేలా, వారిలో స్ఫూర్తి నింపేలా... 'దర్శకరత్న డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్' ఇవ్వనున్నామని బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ తెలిపారు. శిల్పకళా వేదికలో అత్యంత వైభవంగా మే 5న వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు.
'దర్శకరత్న డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్' అవార్డుల వేడుక కమిటీకి దాసరితో సుదీర్ఘ అనుబంధం కలిగిన దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, నిర్మాత సి. కళ్యాణ్ అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్నారు. దాసరితో ప్రత్యేక అనుబంధం కలిగిన బిఎస్ఎన్ సూర్యనారాయణ ఆడిటర్ & ఆర్థిక సలహాదారుగా, ప్రముఖ జర్నలిస్టులు ప్రభు, ధీరజ అప్పాజీ సభ్యులుగా ఉన్నారు. అవార్డు వేడుక వివరాలు వెల్లడించేందుకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.
Also Read: శర్వానంద్ 38వ సినిమా ఫిక్స్ - డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్!?
తమ్మారెడ్డి మాట్లాడుతూ... "అభినవ దర్శకరత్న, అభినయ రత్న, నిర్మాణ రత్న, పంపిణీ రత్న, ప్రదర్శనా రత్న, కథా రత్న, సంభాషణా రత్న, గీత రత్న, పాత్రికేయ రత్న, సేవా రత్న... వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ఇవ్వనున్నాం. స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాలకూ కొన్ని అవార్డులు ఇవ్వనున్నాం'' అని చెప్పారు.
దాసరి శిష్యుడు, దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ... "దాసరి లేని లోటు ఎప్పటికీ తీరనిది. అత్యంత పారదర్శకంగా, ప్రామాణికంగా అవార్డు విజేతల ఎంపిక ఉండేలా జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. దాసరి గారు మనకు భౌతికంగా దూరమై ఏడేళ్లు కావస్తున్నా... ఆయనపై ప్రేమాభిమానాలతో ఈ వేడుకలు చేస్తున్న బిఎస్ఎన్ సూర్యనారాయణకు అభినందనలు" అని అన్నారు. "దాసరి ప్రథమ జయంతి ఘనంగా నిర్వహించినా... ఆ తర్వాత కరోనా కారణంగా కంటిన్యూ చేయడం వీలు కాలేదు. ఇకపై ప్రతి ఏడాదీ వేడుకలు నిర్వహిస్తాం" అని బిఎస్ఎన్ సూర్యనారాయణ తెలిపారు.
Also Read: ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో విరాట్ రాజ్... గణేష్ మాస్టర్ డైరెక్షన్ డెబ్యూ
''రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డుల విషయంలో చిత్రసీమను చిన్న చూపు చూస్తున్న తరుణంలో బిఎస్ఎన్ సూర్యనారాయణ గారు చొరవ తీసుకుని దాసరి పేరిట పురస్కారాలు ఇస్తుండటం అభినందనీయం" అని టి. ప్రసన్న కుమార్ అన్నారు. దర్శకరత్న డాక్టర్ దాసరి స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ పురస్కారాల వేడుకకు చిత్ర పరిశ్రమలో వ్యక్తులందరూ సహకరించాల్సిందిగా జర్నలిస్ట్ ప్రభు విజ్ఞప్తి చేశారు. అవార్డ్స్ కమిటీలో తాను చోటు దక్కించుకోవడం తనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం లాంటిదని ధీరజ అప్పాజీ సంతోషం వ్యక్తం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)