Chiranjeevi Godfather Update: ఇది విన్నారా? చిరంజీవి సినిమాకు సల్మాన్ డబ్బులు తీసుకోవడం లేదట!
హిందీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. అయితే... ఆయన 'గాడ్ ఫాదర్' కోసం రూపాయి కూడా తీసుకోవడం లేదట.
హిందీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఆయన 'ఎస్' అంటే కోట్లకు కోట్ల రూపాయలు ఇవ్వడానికి చాలా మంది నిర్మాతలు రెడీగా ఉన్నారు. అటువంటి హీరో రూపాయి తీసుకోకుండా చిరంజీవి సినిమా చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. స్నేహం కంటే ఏదీ ముఖ్యం కాదని ఆయన చెప్పారట. చిరంజీవి కోసం ఫ్రీగా సినిమా చేస్తున్నారట.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న సినిమా 'గాడ్ ఫాదర్'. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగుతోంది. మలయాళ హిట్ 'లూసిఫర్'కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్ ఖాన్ చేస్తున్నారు. మోహన్ లాల్ పాత్రను తెలుగులో చిరంజీవి చేస్తున్నారు. కథ ప్రకారం ముంబైలో సల్మాన్ ఎంట్రీ ఉంటుంది. ఆ సన్నివేశాలు ఇప్పుడు తీస్తున్నారు.
సల్మాన్ ఖాన్ వల్ల ఉత్తరాదిలో 'గాడ్ ఫాదర్'కు క్రేజ్ వస్తుంది. సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. అందువల్ల, నిర్మాతలు సల్మాన్‌కు భారీ మొత్తం ఇవ్వాలని అనుకున్నారట. అదే విషయం ఆయనకు చెబితే... ''నేను సినిమా చేస్తా. మీరు డబ్బులు ఇవ్వనని చెబితేనే'' అని సల్మాన్ అన్నారట. షారుఖ్ ఖాన్ 'పఠాన్'లో కూడా సల్మాన్ అతిథి పాత్ర చేస్తున్నారు. పదిహేను నిమిషాల పాత్ర కోసం రూ. 50 ఇవ్వడానికి నిర్మాత ఆదిత్య చోప్రా రెడీ అయితే వద్దని చెప్పారట.
స్నేహం కోసం సల్మాన్ ఖాన్ నిలబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయనకు, మెగా ఫ్యామిలీకి మధ్య మంచి అనుబంధం ఉంది. రామ్ చరణ్ హిందీలో సినిమా చేసినప్పుడు చాలా సపోర్ట్ చేశారు. చిరంజీవి సినిమాకు డబ్బులు వద్దని సల్మాన్ చెప్పడంలో ఇండస్ట్రీ జనాలకు ఆశ్చర్యం ఏమీ కలగలేదు.
'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతార కూడా నటిస్తున్నారు. చిరంజీవి సోదరి పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ఆయన ట్యూన్స్ కంపోజ్ చేయడం స్టార్ట్ చేశారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ మీద ఓ పాటను తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. ఆ పాటకు స్పెషల్ ట్యూన్ రెడీ చేస్తున్నారట. మోహన్ రాజా దర్శకత్వంలో... కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.