(Source: ECI/ABP News/ABP Majha)
2023లో అధిక లాభాలు, భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు - ఆ రెండూ 'మెగా' ఖాతాలోనే!
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను అందుకున్నారు. ఒకటి మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా నిలిస్తే, మరొకటి బిగ్గెస్ట్ లాస్ వెంచర్ చిత్రంగా మిగిలింది.
మెగా ఫ్యామిలీలో ఎక్కువ మంది హీరోలు ఉన్నారు కాబట్టి, సహజంగానే ఏడాదిలో వారి సినిమాలే ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. 2023లో ఇప్పటి వరకు మెగా హీరోల నుంచి నాలుగు చిత్రాలు వచ్చాయి.. మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ ఏడున్నర నెలల బాక్సాఫీస్ లెక్కల ప్రకారం.. 'వాల్తేరు వీరయ్య' & 'విరూపాక్ష' మూవీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిస్తే, 'బ్రో' 'భోళా శంకర్' చిత్రాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈ ఏడాది అధిక లాభాలు రాబట్టిన చిత్రం మరియు భారీ నష్టాలు మిగిల్చిన మూవీ రెండూ 'మెగాస్టార్' ఖాతాలోనే ఉన్నాయి.
చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. కొల్లు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా ₹225.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ ప్రాజెక్ట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు దాదాపు 46 కోట్ల ప్రాఫిట్స్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది 2023లో అత్యంత లాభదాయకమైన ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఈ సినిమా విజయంలో మరో హీరో రవితేజ వాటా కూడా ఉన్నప్పటికీ, మేజర్ క్రెడిట్ మాత్రం చిరుకే దక్కుంతుందనడంలో సందేహం లేదు.
'వాల్తేరు వీరయ్య' సక్సెస్ జోష్ లో చిరంజీవి ఇటీవల 'భోళా శంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. తొలి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం జీరో షేర్ తో రన్ అవుతుందంటే ఈ సినిమా ఇక కోలుకునే అవకాశమే లేదనేది అర్థమవుతుంది. ఈ వారాంతంతో ఫైనల్ రన్ ముగుస్తుంది. ఇది టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్టులో చేరుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో 'భోళా శంకర్' సినిమాని నిర్మించారు. అయితే ఈ చిత్రం ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 27 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది. చూస్తుంటే ఈ మూవీ నిర్మాతకు 50 - 52 కోట్ల వరకూ నష్టాలు మిగిల్చేలా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు. దీన్ని బట్టి ఈ ఏడాదిలో మోస్ట్ ప్రాఫిటల్ మూవీ 'వాల్తేరు వీరయ్య' ను అందించిన చిరంజీవి, ఇప్పుడు 'భోళా శంకర్' లాస్ వెంచర్ ను చవిచూశారని అనుకోవాలి.
2023లో టాలీవుడ్‌లో అతిపెద్ద నష్టాలు మిగిల్చిన మిగతా సినిమాల విషయానికొస్తే, ప్రభాస్ 'ఆది పురుష్' - సమంత 'శాకుంతలం' చిత్రాలు చెరో 50 కోట్ల వరకూ నష్టపోయాయి. పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' మూవీకి 31 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. అఖిల్ అక్కినేని 'ఏజెంట్' నష్టం కూడా 30 కోట్ల వరకూ ఉండొచ్చని అంటున్నారు. ఇక మంచి లాభాలు రాబట్టిన సినిమాలు చూసుకుంటే.. 'వాల్తేరు వీరయ్య' - 46 కోట్లు, 'బేబీ' - 35 కోట్లు, 'సార్' - 27 కోట్లు, 'విరూపాక్ష' - 25 కోట్లు, 'దసరా' - 14 కోట్లు, 'సామజవరగమన' - 12+ కోట్లు, 'బలగం' - 11+ కోట్ల ప్రాఫిట్స్ లో ఉన్నాయి.
సో మెగా హీరోలు ఒరిగినల్ కథలతో చేసిన 'వాల్తేరు వీరయ్య' & 'విరూపాక్ష' సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిస్తే, 'భోళా శంకర్' 'బ్రో' వంటి రీమేక్ మూవీస్ మాత్రం పరాజయం పాలయ్యాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ఒరిజినల్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి వస్తారేమో చూడాలి.
Also Read: హోస్ట్ అవతారమెత్తిన మాస్ కా దాస్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial