Actress Hema: 18 ఏళ్లకే ఇంట్లో తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్, ఇప్పటికీ గంజి అన్నం తింటాం - హేమ
Actress Hema: తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాపులారిటీని సంపాదించుకున్నారు హేమ. తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
Actress Hema about her Personal Life: టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో హేమ కూడా ఒకరు. మూడు దశాబ్దాలకుపైగా తెలుగులో సినిమాలు చేస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా లేడీ కమెడియన్‌గా కూడా పలు చిత్రాల్లో అలరించారు హేమ. నటిగా తను ఎవరో చాలామందికి తెలిసినా.. తన పర్సనల్ లైఫ్ గురించి, పెళ్లి పిల్లల గురించి చాలా తక్కువమందికే తెలుసు. తాజాగా అసలు తన పెళ్లి ఏ పరిస్థితిలో జరిగిపోయింది, ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల తను ఎదుర్కున్న కష్టాలేంటి అనే విషయాలను బయటపెట్టారు హేమ.
మొదటి మీటింగ్‌లోనే పెళ్లి ప్రస్తావన..
ముందుగా దూరదర్శన్ ఛానెల్‌తో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. అదే సమయంలో అక్కడ కెమెరామ్యాన్‌గా పనిచేస్తున్న సయ్యద్ జాన్ అహ్మద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అసలు వారి పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది అనే విషయాన్ని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో హేమ రివీల్ చేశారు. ‘‘ఒకసారి అందరం కలిసి ఎగ్జిబిషన్‌కు వెళ్లినప్పుడు ఆయన కూడా వచ్చారు. నేరుగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని అన్నారు. అది మా ఫస్ట్ మీటింగ్. నేనేమీ ఆయన వెనకపడలేదు. ఆయన నా వెనకపడలేదు. లవ్ అంటే మోసం చేస్తారేమో అని రాసిపెట్టుకున్నాం కానీ ఇతను పెళ్లి చేసుకుంటా అన్నాడు. మోసం చేసే క్యారెక్టర్ కాదు అనిపించింది. అలా మాట్లాడుకోవడం మొదలుపెట్టాం’’ అంటూ తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు హేమ.
18 ఏళ్లకే పెళ్లి..
‘‘ఆ తర్వాత జాన్ వాళ్ల అన్నయ్య వచ్చి మా అమ్మతో మా గురించి చెప్పారు. ఆయన చెప్పి వెళ్లిపోయిన తర్వాత మా అమ్మ చేయి విరగ్గొట్టింది. అప్పుడు నా కెరీర్ పీక్‌లో ఉంది. క్షణక్షణం తర్వాత మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు వచ్చింది. పెళ్లికి ముందు కూడా చాలా బిజీగా ఉన్నాను. ఊరి నుంచి వచ్చి సంపాదించాలి, సాధించాలి అని అమ్మకు ఉంది. అవన్నీ పక్కన పెట్టేసి పెళ్లి అనేసరికి 18 ఏళ్లకే ఏంటిది అని అమ్మ విపరీతంగా కొట్టింది. అప్పుడు అమ్మకు చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. 19 ఏళ్లు వచ్చిన తర్వాత ఇళ్లల్లో పెళ్లి గురించి చెప్పాం. ఆ తర్వాత గెట్ టుగెథర్ ఏర్పాటు చేసి ఇండస్ట్రీ వాళ్లను పిలుచుకొని పెళ్లి గురించి అనౌన్స్ చేశాం. వాళ్లు ముస్లింలు కాబట్టి నాకు తలాక్ చెప్పి వేరే వాళ్ల దగ్గరకు వెళ్తాడేమో అని భయంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. అలా అయితే ఇంకొక పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు అని తెలివిగా ఆలోచించాను’’ అంటూ తను పెళ్లి చేసుకున్న పరిస్థితి గురించి రివీల్ చేశారు హేమ.
హ్యాపీగా బ్రతికేశాం..
ఆర్థికంగా కూడా అన్ని ఆలోచించే పెళ్లి చేసుకున్నానని హేమ తెలిపారు. ‘‘ఇప్పుడంతా లక్షల్లో ఆలోచిస్తున్నారు కానీ అప్పుడు వేలల్లోనే ఆలోచించేవారు. ఇప్పుడు అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. పెళ్లయ్యాక సినిమాలకు వెళ్లేవాళ్లం, బైక్ కొనుక్కున్నాం, లైఫ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేశాం. నేను ఎక్కడ ఉన్నా హ్యాపీగా బ్రతికేస్తా. ఇప్పటికీ గంజి అన్నం తింటా. నేను, నా కూతురు కలిసి దానికి సూప్ రైస్ అని పేరుపెట్టుకున్నాం. టెన్షన్స్ అనేవి ఏమీ లేవు’’ అంటూ తన లైఫ్‌స్టైల్ గురించి బయటపెట్టారు హేమ. ఇప్పటికీ తెలుగులో సక్సెస్‌ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న హేమకు ఈషా అనే కూతురు ఉంది. ప్రస్తుతం తను ఫారిన్‌లో చదువుకుంటోంది.
Also Read: దైవభక్తిని చాటుకున్న హీరో - అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజే పిల్లలకు నామకరణం