Operation Sindoor: 'ఆపరేషన్ సింధూర్'.. ఈ టైటిల్ కోసం అంత పోటీనా?
Operation Sindoor Title: 'ఆపరేషన్ సింధూర్'.. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన సైనిక చర్య. ఇప్పుడు దీన్ని భవిష్యత్తులో మూవీగా తెరకెక్కించే ఛాన్సెస్ ఉన్నాయి.

Big Competiton In Bollywood For Operation Sindoor Title: ప్రస్తుతం ఎవరి నోట విన్నా.. అటు సోషల్ మీడియాలోనూ ఒకటే పేరు ట్రెండ్ అవుతోంది. అదే 'ఆపరేషన్ సింధూర్'. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 9 ఉగ్ర స్థావరాలను గుర్తించి దాదాపు 80 మంది ఉగ్రవాదులను మట్టి కరిపించింది మన భారత సైన్యం. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ సైనిక చర్యను ప్రతీ భారతీయుడు మనస్ఫూర్తిగా స్వాగతించాడు.
టైటిల్ కోసం పోటీ
ఇప్పుడు ఈ 'ఆపరేషన్ సింధూర్'ను (Operation Sindoor) భవిష్యత్తులో మూవీగా తెరకెక్కించే అవకాశాలు సైతం లేకపోలేదు. ఇందులో భాగంగానే పలు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 15 నిర్మాణ సంస్థలు ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకున్నాయి. ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్‌లో పలువురు నిర్మాతలు దరఖాస్తు చేసినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాల్లో పేర్కొంది. టీ సిరీస్, జీ స్టూడియోస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా ఈ టైటిల్ కోసం అప్లై చేశాయి.
ఈ టైటిల్ రేసులో మహావీర్ జైన్ ఫిల్మ్స్ ముందంజలో ఉందని తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ కూడా ఈ టైటిల్ రిజిస్టర్ కోసం అప్లై చేశారని తెలుస్తోంది. గతంలోనూ ఉగ్రవాదులపై భారత్ సైనిక చర్యలు జరగ్గా.. వీటి ఆధారంగా బాలీవుడ్‌లో మూవీస్ తెరకెక్కాయి. సర్జికల్ స్ట్రైక్స్, ఉరీ మూవీస్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు కూడా 'ఆపరేషన్ సింధూర్'ను సైతం తెరకెక్కించేందుకు సన్నాహాలు ప్రారంభం అవుతున్నాయనే చెప్పాలి.
Also Read: 'మహా భారతం'లో ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం - డ్రీమ్ ప్రాజెక్ట్‌పై ఆమిర్ ఖాన్ ఏమన్నారంటే?
మరోవైపు.. ఇప్పటికే పాక్ యాక్టర్స్, మూవీస్‌పై బ్యాన్ విధించగా.. 'ఆపరేషన్ సింధూర్'కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పాక్ యాక్టర్స్ మహీరా ఖాన్ (Mahira Khan), హనియా అమీర్ (Hania Aamir), ఫవాద్ ఖాన్ (Fawad Khan), అలీ జాఫర్‌లను బ్యాన్ చేయాలని.. తాజాగా ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. కళల పేరుతో 'ఆపరేషన్ సింధూర్'కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఇలాంటి వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వొద్దని కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేసింది. పాక్ యాక్టర్ ఫవాద్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ 'అబిర్ గులాల్'పై నిషేధం విధించారు. అటు, పాక్ యాక్టర్స్ సోషల్ మీడియా అకౌంట్స్, యూట్యూబ్ ఛానళ్లను కూడా నిషేధించారు.
నేరుగా ఓటీటీలోకి ఆ మూవీ..
అటు.. 'ఆపరేషన్ సింధూర్' తర్వాత దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఓ బాలీవుడ్ మూవీ నేరుగా ఓటీటీలోకే రానుంది. ఈ మేరకు మూవీ టీం కీలక ప్రకటన చేసింది. బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'భూల్ చుక్ మాఫ్'. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రావాల్సి ఉండగా.. దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 16 నుంచి నేరుగా 'అమెజాన్ ప్రైమ్' వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. 'దేశవ్యాప్తంగా పెరిగిన భద్రతా పరిస్థితుల దృష్ట్యా మేం ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ మూవీని థియేటర్లలో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకున్నాం. కానీ.. దేశ స్ఫూర్తికి మా మొదటి ప్రాధాన్యం ఇస్తాం. జైహింద్.' అంటూ మేకర్స్ తెలిపారు.






















