Bobbili Simham Movie: బొబ్బిలి సింహానికి 30 ఏళ్ళు... వారసుడు వచ్చిన తర్వాత బాలకృష్ణ తొలి సూపర్ హిట్
బాలకృష్ణ 'బొబ్బిలి సింహం' సినిమా విడుదలై నేటికి 30 ఏళ్లు. అబ్బాయి మోక్షజ్ఞ జన్మించిన తర్వాత బాలయ్యకు తొలి హిట్టు ఇది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. ఈ సినిమా విశేషాలు...
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'బొబ్బిలి సింహం' నేటితో 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మాస్ సినిమాను సెంటిమెంట్‌తో ఎలా మేళవించి ఎలా తీయవచ్చో రుజువు చేసిన సినిమా ఇది. బాలయ్య సరసన రోజా, మీనా కథానాయికలుగా నటించిన ఈ సినిమాకు ఎ. కోదండరామిరెడ్డి దర్శకుడు కాగా... త్రివిక్రమ రావు నిర్మాత. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన 'బొబ్బిలి సింహం' పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం తీసుకువచ్చిన దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.
రెండుసార్లు ప్రారంభోత్సవం చేసుకున్న మూవీ
'రౌడీ ఇనస్పెక్టర్' సూపర్ హిట్ అయ్యాక వేరే కథతో బి గోపాల్ దర్శకుడిగా 'బొబ్బిలి సంహాం' ప్రారంభోత్సవం చేసుకుంది. ఆ తర్వాత ఏమైందో గానీ... మధ్యలో కథ మారిపోయింది. డైరెక్టర్ సీటులోకి ఎ. కోదండరామిరెడ్డి వచ్చారు. మూవీ ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. అప్పట్లో ఈ సినిమా నైజం హక్కులను మెగా నిర్మాత అల్లు అరవింద్ తీసుకోవడం విశేషం. 30 ఏళ్ల క్రితం అంటే సెప్టెంబర్ 23, 1994న రిలీజ్ అయిన 'బొబ్బిలి సింహం' సూపర్ డూపర్ హిట్ అయింది.
మాస్ కథకు సెంటిమెంట్ అద్దిన చిత్రం
ఈ సినిమా టైటిల్ పూర్తిగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నా సినిమా సెకండ్ హాఫ్ అంతా సెంటిమెంట్ తో ఉంటుంది. అక్కినేని - దాసరిల 'ప్రేమాభిషేకం' ఈ కథకు స్ఫూర్తి అంటారు రచయిత విజయేంద్ర ప్రసాద్. అందులో హీరో తనకు క్యాన్సర్ అనే విషయం దాచి హీరోయిన్ మరో పెళ్లి చేసుకునేలా చేస్తే... 'బొబ్బిలి సింహం'లో హీరోయిన్ రోజా తనకు క్యాన్సర్ అనే విషయం దాచి హీరో బాలకృష్ణ మరో హీరోయిన్ మీనాను పెళ్లి చేసుకునేలా చేస్తుంది. ఈ సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ కావడంతో మాస్ ప్రేక్షకులు 'బొబ్బిలి సింహం'కు బ్రహ్మరథం పట్టారు. బొబ్బిలి సంస్థాన వారసుడిగా బాలకృష్ణ గెటప్ ఆయన ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. హీరోయిన్స్ మీనా గ్లామర్, రోజా నటనకు తోడు సీనియర్ నటులు శారద, శరత్ బాబు, జగ్గయ్య, సత్యనారాయణ, కోట శ్రీనివాసరావుల నటన ఈ మూవీ విజయానికి హెల్ప్ అయ్యాయి.
మోక్షజ్ఞ పుట్టాక బాలయ్య తొలి సూపర్ హిట్!
'బొబ్బిలి సింహం' విడుదలకు ముందు సెప్టెంబర్ 6న నందమూరి బాలకృష్ణకు కుమారుడు పుట్టాడు. నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ జన్మించిన సంబరాల్లో ఉన్న బాలయ్య అభిమానులకు ఆ వెంటనే 'బొబ్బిలి సింహం' బ్లాక్ బస్టర్ కావడంతో డబుల్ బొనాంజా తగిలినట్టయింది. ఇప్పటికి బాలయ్య ఫ్యాన్సులో 'బొబ్బిలి సింహం' సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
Also Read: నందమూరి వారసుడొచ్చాడు... బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా అనౌన్స్ చేశారోచ్