Solo Boy: 'సోలో బాయ్' ట్రైలర్ లాంచ్ చేసిన 'అపరేషన్ సింధూర్' మురళీ నాయక్ పేరెంట్స్... వాళ్లకు గౌతమ్ కృష్ణ లక్ష సాయం
Solo Boy Trailer Launch: 'బిగ్ బాస్' ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా 'సోలో బాయ్' ట్రైలర్‌ను 'ఆపరేషన్ సింధూర్'లో మరణించిన మురళి నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదుగా చేశారు.

'బిగ్ బాస్ 7'లో పార్టిసిపేట్ చేసిన, 'బిగ్ బాస్ 8'లో రన్నరప్‌గా నిలిచిన తెలుగు యువకుడు గౌతమ్ కృష్ణ. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'సోలో బాయ్'. నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు. సెవెన్ హిల్స్ పతాకం మీద వేణుదారి బేబీ నేహశ్రీ సమర్పణలో 'సెవెన్ హిల్స్' సతీష్ నిర్మించారు. రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లు. జూలై 4న థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేశారు.
'సోలో బాయ్' స్టేజిపై లక్ష సహాయం...
మురళీ నాయక్ పేరెంట్స్ మీదుగా ట్రైలర్!
Solo Boy Trailer Launch: 'ఆపరేషన్ సింధూర్'లో అమరుడైన తెలుగు జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు ముదావత్ శ్రీరామ్ నాయక్, జ్యోతి బాయి చేతుల మీదుగా 'సోలో బాయ్' ట్రైలర్ లాంచ్ చేశారు. ఆ కార్యక్రమంలో వాళ్లకు హీరో గౌతమ్ కృష్ణ లక్ష రూపాయలు సాయంగా అందించారు. అలాగే, వాళ్లను 'సోలో బాయ్' చిత్ర బృందం ఎంత గౌరవంగా సత్కరించారు.
ప్రేమ... బ్రేకప్... ఫాదర్ మోటివేషన్...
మిడిల్ క్లాస్ కుర్రాడి కథతో 'సోలో బాయ్'!
'ప్రతి సంవత్సరం కాలేజీకి ఎంతో మంది కొత్త స్టూడెంట్స్ వస్తుంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే తమకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలుగుతారు' అని కాలేజీ ఫ్యాకల్టీ చెబుతుంటే... స్క్రీన్ మీద హీరో గౌతమ్ కృష్ణను పరిచయం చేశారు. అతను కాలేజీలో చేసిన హంగామా, ఫైట్స్ చూపించారు.
కాలేజీలో హీరోతో ప్రేమలో పడిన అమ్మాయిగా ఓ హీరోయిన్ రమ్య పసుపులేటి, ఆఫీసులో ప్రేయసిగా మరో హీరోయిన్ శ్వేతా అవస్థి కనిపించారు. ఇద్దరిలో హీరో ఎవరిని ప్రేమించాడు? ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 'నమ్ముకున్నది మోసం చేయవచ్చు. ప్రేమించిన వాడిని కాదనుకుని వెళ్లిపోవచ్చు. అప్పుడే నిలబడాలిరా. అప్పుడే నిలదొక్కుకోవాలి' అంటూ హీరోకి తండ్రి పాత్రలో పోసాని కృష్ణ మురళి చెప్పిన డైలాగ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మిడిల్ క్లాస్ ఎమోషన్స్ బాగా చూపించారని అర్థం అవుతోంది. హీరోకి నటుడు షఫీ రెండు కోట్లు ఎందుకు ఇచ్చారు? హీరో జైలుకు ఎందుకు వెళ్లారు? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.
తమ కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించడం ఎంతో గౌరవంగా ఉందని, ఈ క్షణం నుంచి గౌతమ్ కృష్ణ రూపంలో తమకు మరో కొడుకు దొరికాడని మురళి నాయక్ తల్లిదండ్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దామోదర్ ప్రసాద్, 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ సుధాకర్, 'రజాకార్' దర్శకుడు యాట సత్యనారాయణ, దర్శకుడు నవీన్ కుమార్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పాల్గొన్నారు. హీరో గౌతమ్ కృష్ణ రెమ్యూనరేషన్ తీసుకోలేదని, పైగా నిర్మాణానికి డబ్బులు తక్కువైన సమయంలో కొంత డబ్బులు ఇచ్చారని చిత్ర నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ తెలిపారు. సినిమా విజయం సాధించిన తర్వాత డబ్బులు తీసుకుంటానని హీరో చెప్పారట. సమవర్తి అనే ట్రస్టు స్థాపించిన గౌతమ్ కృష్ణ, తనకు వచ్చే సంపాదనలో సగం ఆ ట్రస్టుకు అందజేసి ఇతరులకు సాయం చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి హీరో హీరోయిన్లుగా నటించిన పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజనీ వర్మ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్: రిషిక - వీణాధరి, ఛాయాగ్రహణం: త్రిలోక్ సిద్ధు, సాహిత్యం: శ్యామ్ కాసర్ల - పూర్ణాచారి - చైతన్య ప్రసాద్ - కళ్యాణ్ చక్రవర్తి, నృత్య దర్శకత్వం: 'ఆట' సందీప్, సంగీతం: జుడా సాండీ, నిర్మాణ సంస్థ: సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్, నిర్మాత: 'సెవెన్ హిల్స్' సతీష్ కుమార్, దర్శకత్వం: పి. నవీన్ కుమార్.





















