Kartikeya - Bhola Shankar : భోళా శంకర్ హిట్ అనలేను కానీ చిరంజీవి ఎవరెస్ట్ - మెగా ట్రోలింగ్‌పై కార్తికేయ
మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానుల్లో కార్తికేయ ఒకరు. ఆయన నటించిన 'బెదురులంక 2012' ఆగస్టు 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ABP Desamకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'భోళా శంకర్', ట్రోలింగ్ గురించి మాట్లాడారు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన సినిమా 'భోళా శంకర్' (Bhola Shankar). అది తమిళ్ సినిమా 'వేదాళం'కి రీమేక్. తెలుగులో మిక్స్డ్ టాక్ అందుకుంది. మెగాస్టార్ రేంజ్ నటన కాదని కొందరు విమర్శిస్తే... మరికొందరు దర్శకుడు మెహర్ రమేష్ (Meher Ramesh)ను సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకున్నారు. 'భోళా శంకర్' కంటే ఒక్క రోజు ముందు విడుదలైన రజనీకాంత్ 'జైలర్'కు హిట్ టాక్ రావటంతో చిరంజీవి టార్గెట్ గా ట్రోలింగ్ మొదలైంది. అయితే ఈ ట్రోలింగ్ గురించి యంగ్ హీరో కార్తికేయ (Kartikeya Gummakonda) స్పందించారు .
ప్రస్తుతం కార్తికేయ హీరోగా నటించిన 'బెదురులంక 2012' (Bedurulanka 2012 Movie) విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 25న థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో కార్తికేయ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఏబీపీ దేశానికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు కార్తికేయ. అందులో తనకు చిరంజీవి అంటే ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన 'రామ్మా చిలకమ్మా పాట చూసి ఇన్ స్పైర్ అయ్యి తొలుత డ్యాన్సర్ గా తర్వాత నటుడిగా మారానన్నారు కార్తికేయ. చిరంజీవిపై ఉన్న పిచ్చి అభిమానంతో ఆయనలా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకోవాలనే హీరోగా చేస్తున్న టైమ్ లోనే విలన్ పాత్రలు కూడా వేస్తూ నటుడిగా తనను తను ప్రూవ్ చేసుకుంటున్నానని చెప్పారు. అయితే తనలో అంతటి స్ఫూర్తి నింపిన చిరంజీవిపై 'భోళా శంకర్' విడుదల తర్వాత వస్తున్న ట్రోలింగ్ పైనా కార్తికేయ మాట్లాడారు.
ఓ నటుడిగా ఎలాంటి పాత్రను ఎంచుకోవాలనేది చిరంజీవి ఛాయిస్ అని కార్తికేయ అన్నారు. వందల సినిమాలు చేసిన అనుభవంతో స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తగా ఉంటారని, ఎలాంటి పాత్రలో నటించాలో ఆయనకు చెప్పే స్థాయి మనలో ఎవరికీ లేదన్నారు. ఓ సినిమా బాగోకపోతే విమర్శించే హక్కు ప్రతీ ప్రేక్షకుడికీ ఉంటుందన్న కార్తికేయ... అయితే ఆ విమర్శ సినిమా వరకే ఉండాలే తప్ప వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిత్వ హననానికి వెళ్లకూడాదన్నారు. చిరంజీవి విషయంలో ఓ బ్యాచ్ కావాలనే నెగటివ్ ప్రచారం మొదలుపెట్టిందని... ఎవరెస్ట్ శిఖరంతో సమానమైన చిరంజీవి తన కెరీర్ లో ఇలాంటి ఘటనలను ఎన్నో ఎదుర్కొనే ఇక్కడిదాకా వచ్చారనన్నారు.
Also Read : 'ప్రేమ్ కుమార్' రివ్యూ : పీటల మీద పెళ్లి ఆగితే? ఈసారైనా సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?
'భోళా శంకర్' హిట్ అని తాను చెప్పడం లేదన్న కార్తికేయ... అయితే ఆ సినిమా ఎందుకు చేశారో? ఎందుకు చేయాల్సి వచ్చిందో? చిరంజీవికి తెలిస్తే చాలన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అందరినీ అలరిస్తున్న చిరంజీవిని ఇలాంటి చిన్నవిషయాలకు దూషించటం సరికాదని తన నిజమైన అభిమాననిని, తన అభిమానాన్ని చాటుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన బెదురు లంక చిత్రం ఈ నెల 25న థియేటర్లలో విడుదలవుతుందని చెప్పారు. పదకొండేళ్ల క్రితం రేగిన యుగాంతం పుకార్లు ఆధారంగా చేసుకుని తీసిన ఈ సినిమా సెటైరికల్ గా ఉండటంతో పాటు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుందని... ప్రేక్షకులు ఆదరించాలని ఏబీపీ దేశానికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కోరారు.
Also Read : మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ: సొహెల్ ‘పురుష గర్భం’ ప్రయోగం ఎలా ఉంది? డెలివరీ హిట్టా? ఫట్టా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial