'విక్రమార్కుడు 2' స్క్రిప్ట్ రెడీగా ఉంది, కానీ అసలు సమస్య ఆయనతోనే - సీక్వెల్ పై నిర్మాత క్లారిటీ
KK Radhamohan : 'భీమా' సినిమా నిర్మాత కేకే రాధా మోహన్ 'విక్రమార్కుడు' సీక్వెల్ పై తాజా ఇంటర్వ్యూలో స్పందించారు.
Vikramarkudu sequel : మాస్ మహారాజా రవితేజ - రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'విక్రమార్కుడు' సినిమా అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోగా రవితేజ క్రేజ్ ని, దర్శకుడిగా రాజమౌళి స్థాయిని పెంచిన సినిమా ఇది. రవితేజ ఆల్ టైం ఫేవరెట్ మూవీస్ లో 'విక్రమార్కుడు' ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు. 2006లో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ రోల్స్ లో నటించి అదరగొట్టేసారు. ఆ రెండు పాత్రలను రాజమౌళి నెక్స్ట్ లెవెల్ లో ఆవిష్కరించారు. కాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఎట్టకేలకు నిర్మాత కేకే రాధా మోహన్ 'విక్రమార్కుడు' సీక్వెల్ పై స్పందించారు.
'విక్రమార్కుడు' సీక్వెల్ కి కథ రెడీ.. కానీ?
నిర్మాత కేకే రాధ మోహన్ నిర్మాణంలో తెరకెక్కిన 'భీమా' సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధా మోహన్ 'విక్రమార్కుడు' సీక్వెల్ గురించి స్పందిస్తూ.." 'విక్రమార్కుడు 2' స్క్రిప్ట్ రెడీగా ఉంది. కొన్నేళ్ల క్రితమే టైటిల్ కూడా రిజిస్టర్ చేశాం. కానీ అసలు సమస్య ఆర్టిస్టుల గురించే. ఎందుకంటే రవితేజ గారు ఈ ప్రాజెక్టు పై మొదట్లో పెద్దగా ఆసక్తి చూపించలేదు. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. రవితేజ గారిని ఎలాగైనా ఒప్పించాలి. కానీ చివరికి ఏం జరుగుతుందనేది నాకు తెలియదు. ఈ సీక్వెల్ కి సంపత్ నంది దర్శకత్వం వహించాలని అనుకున్నాం. సంపత్, విజయేంద్ర ప్రసాద్ గారు, నేను ఈ సీక్వెల్ కాన్సెప్ట్ పై చాలా రోజులు వర్క్ చేసాం. ప్రస్తుతం సంపత్ నంది తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే 'విక్రమార్కుడు 2' సెట్స్ పైకి వెళ్తుంది. సరైన కాంబినేషన్ లేకపోతే నేను ఈ సీక్వెల్ ని నిర్మించను" అని అన్నారు.
రాజమౌళికి నో ఛాన్స్
'విక్రమార్కుడు' సినిమాకి సీక్వెల్ ఉన్నప్పటికీ దీనికి రాజమౌళి దర్శకత్వం వహించే ఛాన్స్ లేదని తెలుస్తోంది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే 'విక్రమార్కుడు' సీక్వెల్ కి సంబంధించి కథను పూర్తి చేశారు. అయితే సంపత్ నంది దర్శకత్వంలో ఈ సీక్వెల్ తెరకెక్కనున్నట్లు తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ తో అర్థమవుతుంది. అయితే రాజమౌళి లాగా సంపత్ నంది సీక్వెల్ ని హ్యాండిల్ చేస్తారా? అనేది మరో ప్రశ్న. అయితే రాజమౌళి మేకింగ్ కి ఏ మాత్రం తగ్గకుండా సీక్వెల్ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఎలాగూ విజయేంద్రప్రసాద్ సీక్వెల్ కి సంబంధించిన కథను అందిస్తున్నారు కాబట్టి ఎవరు డైరెక్ట్ చేసినా కచ్చితంగా హిట్ అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
మార్చ్ 8 న రాబోతున్న 'భీమా'
టాలీవుడ్ లో కొన్ని సక్సెస్ఫుల్ సినిమాలను నిర్మించిన నిర్మాత కేకే రాధా మోహన్ మళ్లీ చాలా గ్యాప్ తర్వాత గోపీచంద్ 'భీమా' సినిమాని నిర్మించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై పొందిన ఈ చిత్రాన్ని కన్నడ దర్శకుడు ఏ. హర్ష తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మహాశివరాత్రి కానుకగా మార్చి 8న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది.
Also Read : ‘ఆయ్’ ఫస్ట్ లుక్ : గోదారోళ్ల అల్లరి మామూలుగా ఉండదండోయ్!