Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?
నట సింహం నందమూరి బాలకృష్ణ ఓ చిన్న సినిమాకు అండగా నిలిచారు. 'ఐక్యూ' ట్రైలర్ విడుదల చేశారు.
సాయి చరణ్, పల్లవి జంటగా నటించిన చిత్రం 'ఐక్యూ' (IQ Telugu Movie). 'పవర్ ఆఫ్ ద స్టూడెంట్'... అనేది ఉప శీర్షిక. ఈ చిత్రానికి జిఎల్‌బి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కె.ఎల్.పి మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి నిర్మించారు. ఈ శుక్రవారం (జూన్ 2న) ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ అండగా నిలిచారు. సినిమా ట్రైలర్ విడుదల చేసిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.
హీరోయిన్ ముందుకు రావాలి - బాలకృష్ణ!
తెలుగు దేశం పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న బాలకృష్ణను తమ సినిమా ట్రైలర్ విడుదల చేయాల్సిందిగా 'ఐక్యూ' చిత్ర బృందం కోరింది. అందుకు ఆయన పెద్ద మనసుతో అంగీకరించారు. ట్రైలర్ విడుదల సమయంలో కొంచెం దూరంగా ఉన్న కథానాయిక పల్లవిని ముందుకు పిలిచారు. ''హీరోయిన్ ముందుకు రావాలి. మా కుటుంబంలో, పార్టీలో మహిళలకు ఎంతో గౌరవం ఉంటుంది. నాన్నగారి నుంచి మాకు వచ్చిన సంస్కారం అది'' అని బాలకృష్ణ చెప్పారు.
చక్కని సందేశంతో తెరకెక్కిన ఈ 'ఐక్యూ' చిత్రం విజయవంతం కావాలని, అంతే కాకుండా నిర్మాతకు మంచి పేరు, లాభాలు తీసుకు రావాలని నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. విద్యార్థుల శక్తి ఏమిటో చాటి చెప్పే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ట్రైలర్ చూస్తే పిన్న వయసులో డిగ్రీ కంప్లీట్ చేసిన అమ్మాయిగా హీరోయిన్ రోల్ ఉంటుందని అర్థమైంది. బాలకృష్ణ డైలాగ్ గీతా సింగ్ చెప్పడం విశేషం. కథానాయికను ఎవరో కిడ్నాప్ చేయడం, విద్యార్థులు ధర్నా చేయడం వంటివి కాన్సెప్ట్ అని అర్థమవుతోంది.
Also Read : ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?
నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ ''బాలకృష్ణ గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఆయనకు మా చిత్ర బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు కూడా మాకు ఆయన ఎంతో సహాయం చేశారు. బాలకృష్ణ గారు ట్రైలర్ విడుదల చేయడం వల్ల ప్రేక్షకులకు సినిమా చేరువైంది'' అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాధ్ రెడ్డి, రాయల్ మురళీ మోహన్, రచయిత ఘటికాచలం, దండు శ్రీనివాసులు, శ్రీధర్, లక్ష్మీ నరసింహ వెంకటప్ప, అంబిక లక్ష్మీనారాయణ వడ్డే గోకుల్ లోకనాథ్ తదితరులతో పాటు చిత్ర బృందం కూడా పాల్గొన్నారు.
Also Read : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!
సినిమా కథాంశం గురించి నిర్మాత మాట్లాడుతూ ''విద్యార్థులు తలచుకుంటే ఏమైనా చేయగలరనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. కథానాయిక పల్లవి పోషించిన పాత్ర చాలా బావుంటుంది. ఇది సందేశాత్మక సినిమా అయినా సరే దర్శకుడు కథ, కథనాలు చక్కగా నడిపించారు. ఇందులో మంచి ప్రేమకథ కూడా ఉంది. జూన్ 2న తెలుగు రాష్ట్రాల్లో చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తాం'' అని చెప్పారు. సాయి చరణ్, పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో లేఖ ప్రజాపతి, ట్రాన్సీ, సుమన్, బెనర్జీ, సత్య ప్రకాష్, పి. రఘునాథ్ రెడ్డి, కె. లక్ష్మీపతి, సూర్య, గీతా సింగ్, 'షేకింగ్' శేషు, సత్తిపండు, సమీర్ దత్తా ఇతర తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : శివ శర్వాణి, ఛాయాగ్రహణం : టి. సురేందర్ రెడ్డి, సంగీతం : పోలూర్ ఘటికాచలం, నిర్మాత : కాయగూరల లక్ష్మీపతి, దర్శకత్వం : జిఎల్‌బి శ్రీనివాస్