Asian Cinemas: మహేష్, బన్నీ బాటలో శివ కార్తికేయన్ - అక్కడ వర్కవుట్ అవుతుందా?
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ ఏషియన్ గ్రూప్ తో కలసి మల్టిప్లెక్స్ వ్యాపారంలోకి ప్రవేశించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ కోవలోకి మరో తమిళ హీరో వచ్చి చేరనున్నాడు.
Asian Cinemas: ప్రస్తుతం ఎక్కడ చూసినా మల్టిప్లెక్స్ ల హవా నడుస్తోంది. సింగిల్ థియేటర్లతో పాటు ఈ మల్టీప్లెక్స్ లు కూడా బాగానే రన్ అవుతున్నాయి. అందుకే కొంతమంది హీరోలు ఈ థియేటర్ల బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ ఏషియన్ గ్రూప్ తో కలసి మల్టిప్లెక్స్ వ్యాపారంలోకి ప్రవేశించి సక్సెస్ అయ్యారు. అదే ఏషియన్ గ్రూప్ తో కలసి అల్లు అర్జున్ కూడా ఓన్ థియేటర్ ను రన్ చేయనున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో వార్త హల్చల్ చేస్తుంది. ఏషియన్ మూవీస్ సంస్థ వ్యాపార విస్తరణలో భాగంగా తమిళ హీరో శివ కార్తికేయన్ తో కలసి చెన్నైలో మల్టిప్లెక్స్ ను నిర్మించనున్నట్లు సంస్థ తెలిపింది.
ఏషియన్ గ్రూప్ తో టాలీవుడ్ హీరోలు..
తెలుగు ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలు ఈ థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పటికే మహేష్ ఏషియన్ సినిమాస్ తో కలిసి ఏఎంబి అనే మల్టీప్టెక్స్ మొదలు పెట్టాడు. ఏఎంబీ సినిమాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటిగా ఎదిగింది. మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా థియేటర్ బిజినెస్ లోకి ఎంటరైపోయాడు. ఏషియన్ సినిమాస్ తో కలిసి తన సొంత ఊరు మహబూబ్ నగర్ లో ఏవిడి సినిమాస్ పేరుతో మల్టిప్లెక్స్ ను నిర్మించాడు. ఈ బిజినెస్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికే ప్రభాస్, వెంకటేష్, బాలకృష్ణ లాంటి హీరోలు కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నారు. వీరి కోవలోకే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వచ్చి చేరాడు. అదే ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏఏఏ సినిమాస్ ను మొదలుపెట్టాడు అల్లు అర్జున్. దీనికోసం హైదరాబాద్ అమీర్ పేటలోని సత్యం థియేటర్ ఉన్న స్థలం లోనే ఈ మల్టిప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్ 16 న విడుదల అవుతున్న ‘ఆదిపురుష్’ సినిమాను ఇందులో మొదటగా స్క్రీనింగ్ చేయనున్నారట.
ఏషియన్ గ్రూప్ తో హీరో శివ కార్తికేయన్..
ఏషియన్ సినిమాస్ తమ వ్యాపారాన్ని విస్తరణలో భాగంగా చెన్నైలో మల్లిప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తో కలసి చెన్నైలో మల్టిప్లెక్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిథి సునీల్ నారంగ్ ఇటీవలే తెలిపారు. ఏషియన్ సినిమాస్ తో ఆయా హీరోలకు ఉన్న బంధం వల్లే ఇన్ని మల్టిప్లెక్స్ లను నిర్మించగలుతున్నామని ఆయన చెప్పారు. అంతే కాదు సునీల్ నారంగ్ ఇటీవల విడుదల అయిన శివకార్తికేయన్ సినిమా ‘ప్రిన్స్’ నిర్మాతలలో ఒకరు కూడా. వీటితో పాటు హైదరాబాద్ లోని జీఎంఆర్ విమానాశ్రయంలో కూడా ఓపెన్ ఎయిర్ థియేటర్ ను నిర్మించనున్నట్లు తెలిపారు సునీల్. అలాగే హీరో శివకార్తికేయన్ ఇటీవల నటించిన ‘మహావీరుడు’ సినిమా తెలుగు రైట్స్ ను ఏషియన్ సినిమాస్ సొంతం చేసుకుంది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ ద్వారా విడుదల చేయనున్నారు. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 14 న విడుదల కానుంది.