AP FDC Chairman: తెలంగాణలో 'దిల్' రాజు... ఏపీలో ఆ కుర్చీ రేసులో డీఎస్ రావు?
DS Rao as AP FDC Chairman?: తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడి పదవిలో 'దిల్' రాజు ఉన్నారు ఏపీలో ఎఫ్.డి.సి. అధ్యక్షుడి రేసులో ప్రముఖ నిర్మాత డిఎస్ రావు ఉన్నట్లు తెలిసింది.

తెలంగాణ ఫిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీ ఎఫ్.డి.సి.) అధ్యక్ష పదవిలో అగ్ర నిర్మాత 'దిల్' రాజు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి, ఏపీలో? గత సార్వత్రిక ఎన్నికలకు ముందు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నటుడు, దర్శక రచయిత పోసాని కృష్ణ మురళి ఆ పదవిలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎఫ్.డి.సి. చైర్మన్ పదవిలో ఎవరిని నియమించలేదు. ఇప్పుడు ఆ పదవిని భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఏపీ ఎఫ్.డి.సి. చైర్మన్ రేసులో డీఎస్ రావు!
నిర్మాత దమ్మాలపాటి శ్రీనివాసరావు... ఈ పేరు చెబితే ప్రేక్షకులు గుర్తు పట్టడం కాస్త కష్టం కావచ్చు. డీఎస్ రావు అంటే... టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా వెంటనే గుర్తుపడతారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయనది పాతికేళ్ల ప్రయాణం, అనుబంధం. నేచురల్ స్టార్ నాని 'పిల్ల జమిందార్', మంచు మనోజ్ 'మిస్టర్ నూకయ్య' సహా 20కు పైగా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో డీఎస్ రావు ఉన్నట్లు తెలిసింది. నటుడిగానూ కొన్ని సినిమాలు చేసిన ఆయనకు... ఎగ్జిబిటర్ సెక్టార్‌లోనూ అనుభవం ఉంది. అలాగే ప్రముఖ టీవీ ఛానల్ అధినేత ఆశీస్సులు కూడా ఉండడంతో డీఎస్ రావు ఎఫ్.డి.సి. చైర్మన్ కావడం లాంచనమే అని ఇండస్ట్రీ జనాల నుంచి అందుతున్న సమాచారం.





















