Thug Life Review - 'థగ్ లైఫ్' రివ్యూ: కమల్‌ను శింబు డామినేట్ చేశారా? 'నాయకుడు'ను మర్చిపోయేలా మణిరత్నం సినిమా ఉందా?
Thug Life Review In Telugu: మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, శింబు నటించిన 'థగ్ లైఫ్' థియేటర్లలోకి వచ్చింది. గ్యాంగ్‌స్టర్, మాఫియా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే?
మణిరత్నం
కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి, నాజర్, జోజు జార్జ్ తదితరులు
Kamal Haasan's Thug Life Review In Telugu: కమల్ హాసన్ కథానాయకుడిగా 38 ఏళ్ల క్రితం మణిరత్నం దర్శకత్వం వహించిన 'నాయకుడు' ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. 'థగ్ లైఫ్' చూశాక ఆ సినిమాను మర్చిపోతారని విడుదలకు ముందు ప్రెస్‌మీట్స్, ఇంటర్వ్యూలలో కమల్ చెప్పారు. శింబు మరో హీరోగా... కమల్ భార్యగా అభిరామి, ప్రేయసిగా త్రిష నటించిన 'థగ్ లైఫ్' ఎలా ఉంది? 'నాయకుడు' మర్చిపోయేలా మణి ఈ చిత్రాన్ని తీశారా? కమల్, శింబు ఎలా నటించారు?
కథ (Thug Life Story): ఢిల్లీలో రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) డాన్. పోలీసులు రౌండప్ చేసినప్పుడు అతని మనుషులు చేసిన కాల్పుల్లో అనుకోకుండా పేపర్ వేసే ఒకతను మరణిస్తాడు. మరణించిన వ్యక్తి కుమారుడు అమర్ (శింబు)ను సొంత తమ్ముడిలా పెంచుతాడు శక్తి రాజు.
నేర సామ్రాజ్యంలో శక్తి రాజుకు అమర్ కుడి భుజంలా ఉంటాడు. ఓ కేసులో జైలుకు వెళ్లే ముందు అనుచరులు అందరికీ తన స్థానంలో అమర్ అన్ని బాధ్యతలు చూసుకుంటాడని చెప్పి మరీ వెళతాడు శక్తి రాజు. అటువంటిది జైలు నుంచి వచ్చిన తర్వాత ఎటాక్ జరిగితే... అమర్ మీద అనుమానం వ్యక్తం చేస్తాడు.
శక్తి రాజులో మొదలైన అనుమానం, అమర్‌లో ఎటువంటి మార్పు తీసుకుని వచ్చింది? ఇద్దరి మధ్య గొడవకు ఇంద్రాణి (త్రిష) కారణమా? వాళ్ల జీవితాలలో శక్తి రాజు భార్య లక్ష్మి (అభిరామి), అన్నయ్య మాణిక్యం (నాజర్) ఎటువంటి మార్పులకు కారణం అయ్యారు? శక్తి రాజు నేపాల్ వెళ్ళినప్పుడు ఏం జరిగింది? పోలీస్ ఆఫీసర్ జై కుమార్ (అశోక్ సెల్వన్) ఏం చేశాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Thug Life Review Telugu): మాఫియా, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలలో 'నాయకుడు' ఒక ట్రెండ్ సెట్టర్. అటువంటి సినిమా తర్వాత కమల్, మణి కలయికలో సినిమా అంటే అభిమానులలో అంచనాలు ఏర్పడ్డాయి. గ్యాంగ్‌స్టర్, మాఫియా నేపథ్యంలో కుటుంబంలో కలహాలను తీసుకుని 'నవాబ్' చేశారు మణి. అందులో ట్విస్టుల ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యేలా చేశాయి. అందుకని 'థగ్ లైఫ్' మీద మరిన్ని అంచనాల పెరిగాయి. కట్ చేస్తే... 'నవాబ్' బాగుందనేలా తీశారు మణి. అంతే కాదు... 'నవాబ్'లో క్యారెక్టర్లు కాస్త అటు ఇటు మార్చి 'థగ్ లైఫ్' తీశారన్నట్లు ఉంటుంది.
'థగ్ లైఫ్' స్టార్టింగ్ బాగుంటుంది. కథతో పాటు క్యారెక్టర్లపై క్యూరియాసిటీ పెరుగుతుంది. వాట్ నెక్స్ట్? ఎవరేంటి? అని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అయితే... ఆ అంచనాలు కిందకు రావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇదొక రెగ్యులర్ రొటీన్ రివేంజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని అరగంటకు ప్రేక్షకులందరికీ క్లారిటీ వస్తుంది. కానీ, నటీనటులతో పాటు రెహమాన్ సినిమాను నిలబెట్టారు.
సాధారణ కథను తీసుకొని అసాధారణంగా చెప్పగల ప్రతిభ మణిరత్నం సొంతం. ఆయన సినిమాలలో క్యారెక్టరైజేషన్లు బావుంటాయి. ఒక వ్యక్తి ఆలోచనలను తెరపై ఆవిష్కరించడంలో ఆయన స్టైల్ సపరేట్. అటువంటి మణిరత్నం నుంచి ఇంత వీక్ క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్లు రావడం ఆశ్చర్యం కలుగుతుంది.
తండ్రిని చంపడానికి వచ్చిన వ్యక్తి ముందు అమ్మాయి (అభిరామి పోషించిన లక్ష్మీ క్యారెక్టర్) చూపించిన తెగువ నచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నానని శక్తి రాజు చెబుతాడు. అటువంటిది వేరొక మహిళను పట్ల ఆకర్షితులు కావడానికి కారణం ఏమిటనేది చెప్పడు. శక్తి రాజును అన్నయ్య అని పిలిచే అమర్... ఇంద్రాణి పట్ల ఆకర్షితులు కావడానికి కారణం కూడా సరిగా చూపించలేదు. తండ్రి మరణం తర్వాత అన్నీ తానై పెంచిన శక్తి రాజు పట్ల అమర్ ఆలోచించే విధానం కూడా సరిగా అనిపించదు. ఒక్క మాటతో శక్తి రాజు మీద ద్వేషం ఎలా పెంచుకున్నాడు? ఎలా మార్పు వస్తుంది? అనేది అర్థం కాదు.
స్క్రీన్ ప్లే పరంగా కొంచెం కూడా ఈ సినిమా ఎగ్జైట్ చేయదు. మణిరత్నం అండ్ రైటింగ్ టీం ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయింది. దానికి తోడు ప్రతి సన్నివేశంలోనూ నిడివి పెరుగుతూ వచ్చింది. ఇంటర్వెల్ వరకు సోసోగా ముందుకు కదిలిన సినిమా అప్పటినుంచి మరింత ప్రెడిక్టబల్‌గా మారింది. కొంతలో కొంత యాక్షన్స్ సీన్స్ కంపోజిషన్ బాగుంది.
రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ మ్యూజిక్ నుంచి ఏర్ రెహమాన్ బయటకు వచ్చి చాలా రోజులైంది. కొత్త తరహా సంగీతాన్ని ప్రతి ఫ్రేమ్‌లో వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. కథ, సన్నివేశాల నుంచి ఆయనకు సపోర్ట్ లభిస్తే ఇంకా బాగా చేసేవారు ఏమో!? చాలా సీన్లలో ఆయన మ్యూజిక్ సాధారణంగా అనిపించినా... యాక్షన్స్ సన్నివేశాలలో తన మార్క్ చూపించారు రెహమాన్. నేపథ్య సంగీతంలో ఒక్కటే సౌండ్ వినిపించాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఫ్యూజన్ కూడా వినిపించారు. ఈ సినిమాకు పర్ఫెక్ట్‌గా డ్యూటీ చేస్తుంది రెహమాన్ ఒక్కరే. కొన్నిచోట్ల సినిమాను ఆర్ఆర్ నిలబెట్టింది. పాటలు బావున్నాయి. అయితే... 'అచ్చవన్నె పువ్వా' పదేపదే నేపథ్యంలో వినిపించడంలో విసుగు వస్తుంది.
రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ బావుంది. డ్రోన్ షాట్స్, పలు సన్నివేశాలలో విజువల్స్, ఫ్రేమింగ్స్ బావుంటాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ విషయానికి వస్తే... నిడివి తగ్గించడంలో ఆయన కృషి చేయాల్సింది. లెంత్ ఎక్కువైన ఫీలింగ్ చాలా చోట్ల కలుగుతుంది. నిర్మాణ విషయంలో రాజీ పడలేదని తెలుస్తుంది.
కమల్ హాసన్‌కు సవాల్ విసిరే క్యారెక్టర్ ఏం ఉంటుంది? నటుడిగా తనను తాను ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. శక్తి రాజు పాత్రలో ఆయనను చూసినప్పుడు కొత్తగా ఏం అనిపించదు. కానీ, ఆ పాత్రకు న్యాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది. 'మేడం... ఐ యామ్ యువర్ ఆడమ్' సీన్ అవాయిడ్ చేయాల్సింది. మర్మ కళ లాంటి విద్యలను తెరపై చూపించాలనే కోరికను కమల్ పక్కన పెడితే బాగుంటుంది. లేదంటే ప్రతి సినిమాలో ఆయన ఒకే తరహా ఫైట్స్ చేస్తున్నట్లు ఫాన్స్ కూడా బోర్ ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. శింబు స్టైలింగ్ బాగుంది. లుక్స్ పరంగా, యాటిట్యూడ్ మైంటైన్ చేస్తూ కనిపించడంలో తన మార్క్ చూపించారు. కమల్ లాంటి నటుడు ముందు శింబు ధీటుగా నిలబడ్డారు. పాత్ర పరిధి మేరకు నాజర్ నటించారు. మహేష్ మంజ్రేకర్, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, అలీ ఫజల్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు సినిమాలు ఉన్నారు. తమ పాత్రలకు తగ్గట్టు చేశారు.
సినిమాలో హీరోయిన్లకు పెద్దగా స్కోప్ లేదు. మెజారిటీ గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో మహిళల పాత్రలు అలంకారప్రాయంగా ఉంటాయి. ఈ 'థగ్ లైఫ్'లో కూడా అంతే! బార్ డాన్సర్‌గా పరిచయమైన త్రిష... ఆ తర్వాత ఒక పాట, మూడు నాలుగు సన్నివేశాలలో మాత్రమే కనిపిస్తారు. ఆమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యం లేదు. కమల్ భార్యగా అభిరామి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది. అయితే... కథలో ఆవిడ క్యారెక్టర్ కూడా కరివేపాకు లాంటిది. పోలీస్ ఆఫీసర్‌కు విడాకులు ఇచ్చిన మహిళ పాత్రలో ఐశ్వర్య లక్ష్మి కనిపించారు. క్లైమాక్స్‌లో ఆమె పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. అంతకుముందు అంతంత మాత్రమే.
'థగ్ లైఫ్'... కథ పరంగా ఎగ్జైట్ చేయలేదు. కథ,సినిమాలో 'నవాబ్' ఛాయలు కనిపిస్తాయి. ఈ సినిమా 'నాయకుడు'ను అయితే మరిపించేలా లేదు. అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. కానీ, కమల్ హాసన్ & శింబు తమ పాత్రలకు న్యాయం చేశారు. వాళ్లిద్దరి నటనతో పాటు ఏఆర్ రెహమాన్ సంగీతం మెప్పిస్తుంది. మణిరత్నం డిజప్పాయింట్ చేసినా... కమల్, శింబు, రెహమాన్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. అంచనాలు పెట్టుకోకుండా వెళితే కొంత వరకు శాటిస్‌ఫై కావచ్చు.
Also Read: వీరమల్లుకు ఒక్క రూపాయి వద్దు... అడ్వాన్స్ వెనక్కి ఇస్తున్న పవర్ స్టార్





















