Allu Arjun: అల్లు అర్జున్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్... బాలయ్య, ప్రభాస్, తారక్ కూడా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌తో శనివారం ఉదయం విడుదలై ఇంటికి చేరుకున్న అనంతరం.. ఆయన ఇల్లు సెలబ్రిటీలతో సందడి సందడిగా మారింది. ఇంటికి రాలేని వారు ఫోన్ చేసి మరీ బన్నీకి సంఘీభావం తెలిపారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో శుక్రవారం అరస్టై, ఒక రాత్రి జైలులో గడిపి, శనివారం ఉదయం విడుదలయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుండి, మళ్లీ ఆయన ఇంటికి తిరికి వచ్చే వరకు, తిరిగి వచ్చిన తర్వాత.. ఆయన ఇల్లు సినీ ప్రముఖుల మయమైంది. అరెస్ట్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు మొదలుకుని ఎంతో మంది సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లారు. ట్విట్టర్ వేదికగా సెలబ్రిటీలు అల్లు అర్జున్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. ఇక బెయిల్ విషయంలో జరిగిన నాటకీయతతో అల్లు అర్జున్ శుక్రవారం రాత్రంతా చంచల్ గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్ లోపాలు సరి చేసిన అనంతరం ఉదయం 6.30 గంటలకు అల్లు అర్జున్ విడుదలై.. ముందు గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఆయన ఇంటికి చేరుకున్నారు.
అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నప్పటి నుండి ఆ ఇంటిలో సందడి వాతావరణం నెలకొంది. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మొదలుకుని.. విజయ్ దేవరకొండ, కొరటాల శివ, శ్రీకాంత్, సుధీర్ బాబు, నాగ చైతన్య, అఖిల్, వెంకటేష్, అడవి శేష్, బోయపాటి శ్రీను, మారుతి, శర్వానంద్ ఇలా ఒక్కరేమిటి? కన్నడ నుండి స్టార్ హీరో ఉపేంద్ర కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి, ఆయనను పరామర్శించి వెళ్లారు. షూటింగ్స్‌లో ఉన్నవారు మినహా.. దాదాపు టాలీవుడ్ మొత్తం అల్లు అర్జున్ ఇంట్లోనే ఉంది. అంత ఓదార్పును టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ ఐకానిక్ స్టార్‌కి ఇచ్చింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలిసిన వెంటనే షూటింగ్ ఆపుకుని మరీ... వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. అల్లు అర్జున్ విడుదలైన తర్వాత మాత్రం కనిపించలేదు. బహుశా ఆయన షూటింగ్‌లో బిజీగా ఉండి ఉండవచ్చు. చిరంజీవి సంగతి అటుంచితే.. మిగతా మెగా హీరోలెవరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
Also Read: 50 షోలు వేస్తే 5000 టికెట్లు కూడా తెగలేదు... సిద్ధూను దెబ్బ కొట్టిన అల్లు అర్జున్ అరెస్ట్
మరోవైపు అల్లు అర్జున్‌కు అందుబాటులో లేని స్టార్ హీరోలందరూ.. ఫోన్ చేసి పరామర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం అల్లు అర్జున్‌కు కాల్ చేసి, ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక స్టార్ హీరోలైన బాలయ్య, ప్రభాస్, తారక్‌లు అల్లు అర్జున్‌కు కాల్ చేసి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు అల్లు అరవింద్‌కి కాల్ చేసి ధైర్యం చెప్పిన బాలయ్య.. విడుదల తర్వాత నేరుగా బన్నీకే కాల్ చేశారు. బాలయ్య నుండి కాల్ రావడంతో.. సినీ ప్రముఖులతో మాట్లాడుతున్న అల్లు అర్జున్ వెంటనే లేచి పక్కకెళ్లి మాట్లాడారు. అంతేకాదు, ఫోన్ చేసినందుకు బన్నీ థ్యాంక్స్ కూడా చెప్పారు. బాలయ్యే కాదు... రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా బన్నీకి కాల్ చేసి అరెస్ట్ పట్ల సంఘీభావం తెలిపారు. ఇలా.. శనివారం అంతా అల్లు అర్జున్ ఇల్లు సెలబ్రిటీల సందడితో నిండిపోయింది. తన ఇంటికి వచ్చిన సెలబ్రిటీలందరినీ ..తిరిగి వెళ్లేటప్పుడు కారు వద్దకు వెళ్లి మరీ అల్లు అర్జున్ సాగనంపడం విశేషం. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: నేను ఎక్కడికీ పారిపోలేదు... పుకార్లకు మోహన్ బాబు చెక్ - ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారంటే?