Anushka Shetty Birthday Special: అరుంధతిగా భయపెట్టి, భాగమతిగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మిస్ శెట్టి!
టాలీవుడ్ బొమ్మాళీ అనుష్క శెట్టి పుట్టినరోజు ఈరోజు. 'సూపర్' తో ఎంట్రీ ఇచ్చి, మైలురాయి గోల్డెన్ జూబ్లీ సినిమాకు చేరువైన ఆమె సినీ జర్నీలోని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
Anushka Shetty Birthday Special: దక్షిణాది అగ్ర కథానాయిక అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోల రేంజ్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం ఆమెకే సాధ్యమైంది. అరుంధతిగా భయపెట్టి, భాగమతిగా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. బాహుబలిలో దేవసేనగా పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించింది. గత 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తోన్న అనుష్క పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమె సినీ జర్నీని ఇప్పుడు చూద్దాం.
1981 నవంబర్ 7న కర్ణాటకలోని తుళు కుటుంబంలో జన్మించింది అనుష్క. 2005లో వచ్చిన ‘సూపర్’ సినిమాతో హీరోయిన్ గా సూపర్ ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లోకి రాకముందు ఆమె యోగ టీచర్ గా వర్క్ చేసింది. ఆమె అసలు పేరు స్వీటీ శెట్టి. కింగ్ అక్కినేని నాగార్జున, దర్శకుడు పూరీ జగన్నాథ్ లు ఆమెను 'అనుష్క' అనే స్క్రీన్ నేమ్ తో పరిచయం చేసారు. తొలి సినిమా సూపర్ హిట్ అవ్వకున్నా అమ్మడికి మంచి అవకాశాలే తెచ్చిపెట్టింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన 'విక్రమార్కుడు' చిత్రం ఆమెను టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మార్చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ జోడీగా నటించింది అనుష్క. తన ఫస్ట్ హీరో నాగ్ తో ఎక్కువ సినిమాల్లో జత కట్టిన ఈ బ్యూటీ.. తక్కువ కాలంలోనే టాప్ పొజిషిన్ కు చేరుకుంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నిలిచింది. తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషల్లో కూడా నటిస్తూ బిజీగా మారిపోయింది. అయితే ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా 2009లో వచ్చిన ‘అరుంధతి’ అని చెప్పాలి. జేజమ్మగా రాజసం చూపిస్తూనే, అరుంధతిగా భయపడుతూ తాను ఎలాంటి పాత్ర అయినా చేయగలనని నిరూపించింది. దీంతో తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో టాలీవుడ్ కు చూపించింది. ఆ వెంటనే 'బిల్లా'లో బికినీ ధరించి అందరికీ షాక్ ఇచ్చిందీ బొమ్మాళి.
Also Read: Happy Birthday Trivikram: 'మాటల మాంత్రికుడు' త్రివిక్రముడి సినీ ప్రస్థానంలోని విశేషాలు!
మాములుగా గ్లామరస్ హీరోయిన్లు ఎవరైనా వేశ్య పాత్రలు చేయడానికి ఆలోచిస్తుంటారు. కానీ అనుష్క మాత్రం 'వేదం' సినిమాలో అలాంటి ఛాలెంజింగ్ రోల్ లో నటించి ఆడియన్స్ ను మెప్పించింది. ఇదే క్రమంలో ఆమె నటించిన 'పంచాక్షరీ', 'నాగవల్లి', 'రగడ', 'ఢమరుకం', 'సింగం', 'మిర్చి' చిత్రాలు కూడా అలరించాయి. ఇక 'బాహుబలి' సినిమాలతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి నుంచి కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చిన అనుష్క.. కథా బలమున్న సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇందులో భాగంగా 'సైజ్ జీరో' సినిమా కోసం బరువు పెరగడానికి కూడా వెనకాడలేదు.
'రుద్రమదేవి', 'భాగమతి' వంటి మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలు అనుష్కకు బ్లాక్ బస్టర్ విజయాలు అందించాయి. ఆమె మూగమ్మాయి పాత్రలో నటించిన 'నిశబ్దం' మూవీ కరోనా లాక్ డౌన్ లో నేరుగా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించింది. దీని తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న స్వీటీ.. ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం 'కధన్ - ది వైల్డ్ సోర్సెరర్' అనే మలయాళ పీరియాడిక్ యాక్షన్ మూవీలో నటిస్తోంది. తన కెరీర్ లో మైల్ స్టోన్ 50వ చిత్రంగా ‘భాగమతి’కి సీక్వెల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: 'ఆరేళ్ళ ప్రాయంలోనే రాష్ట్రపతి అవార్డ్.. విశ్వనటుడి సినీ ప్రయాణంలోని ఆసక్తికరమైన విషయాలు!