ఎట్టకేలకు రిలీజ్ కానున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ - ఎప్పుడు రానుందంటే?
'జాతి రత్నాలు' ఫేమ్ నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కలయికలో వస్తోన్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. తాజాగా ఈ మూవీ కొత్త విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేసారు.
అగ్ర కథానాయిక అనుష్క శెట్టి, యువ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన స్పెషల్ పోస్టర్లు, సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సరైన రిలీజ్ డేట్ మాత్రం దొరకలేదు. అయితే ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎట్టకేలకు ఈ చిత్రానికి ఒక మంచి విడుదల తేదీ దొరికింది. తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు.
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాని ముందుగా ఆగస్టు 4న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాతలు గతంలో ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో విడుదల వాయిదా వేసుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం కారణంగానే సినిమాని పోస్ట్ పోన్ చేసినట్లు టాక్ వచ్చింది. రానున్న రోజుల్లో ప్రతీ వారం పలు క్రేజీ చిత్రాల రిలీజులు ఉండటంతో, అనుష్క చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 2023 సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
''మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి జన్మాష్టమి నాడు మిమ్మల్ని వెన్నతో ముస్తాబు చేసేందుకు రెడీగా ఉన్నారు! సెప్టెంబర్ 7 నుండి థియేటర్లలో మీ అందరినీ అలరించడానికి సిద్ధంగా ఉన్నారు!'' అని మేకర్స్ పేర్కొన్నారు. తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టిలకు సంబంధించిన ఓ న్యూ పోస్టర్ ను సోషల్ మీడియాలో వదిలారు. అలానే నవీన్ - మహేశ్ ఆచంటలతో చేసిన ఓ ఫన్నీ వీడియోని పంచుకున్నారు.
'కోవిడ్ లో రెండు వేరియంట్లు దాటుకుని, పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ దాటుకొని, మాన్ సూన్ లు, వర్షాల అడ్డంకులు దాటుకుని ఫైనల్ గా క్రిష్ణాష్టమికి థియేటర్లోకి రాబోతోంది' అంటూ జాతిరత్నం తనదైన శైలిలో విడుదల తేదీ అనౌన్స్ చేసారు. ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి గురువారం వస్తోంది. అంటే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రానికి 4 రోజుల లాంగ్ వీకెండ్ దొరుకుంటుంది. టాక్ బాగుంటే వసూళ్లకు ఏమాత్రం డోకా ఉండదు. ఇవన్నీ ఆలోచించే ప్రొడ్యూసర్స్ ఆ డేట్ ను ఫిక్స్ చేసినట్లు అర్థమవుతోంది.
Get ready for an entertainment blast on September 7th! 🤩💯
— UV Creations (@UV_Creations) August 14, 2023
Just like #NaveenPolishetty’s chase for the release date, your quest for entertainment ends with #MissShettyMrPolishetty 🥁 🕺 #MSMPonSep7th @MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah… pic.twitter.com/c4lyMTfU1w
కాగా, 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలో అన్విత రవళి శెట్టి అనే చెఫ్ పాత్రలో అనుష్క కనిపించనుంది. సిద్ధు శెట్టి అనే స్టాండప్ కమెడియన్ పాత్రలో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నారు. ఇందులో జయసుధ, నాజర్, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తి, అభినవ్ గోమటం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వంశీ - ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రధన్ సంగీతం సమకూరుస్తున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.
‘Miss. శెట్టి Mr. పోలిశెట్టి’ అనేది అనుష్క కెరీర్ లో 48వ చిత్రం. 'నిశ్శబ్దం' తర్వాత ఆమె నటించిన సినిమా ఇది. మరోవైపు 'జాతిరత్నాలు' వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత నవీన్ పోలిశెట్టి చేస్తున్న సినిమా ఇదే. సీనియర్ హీరోయిన్ - యంగ్ హీరో కలిసి నటించిన ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.
Also Read: 'విరూపాక్ష' బ్యూటీ చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్ - ఈసారి నిఖిల్‌తో రొమాన్స్ చేయనున్న సంయుక్త?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial