Anil Ravipudi on Chiranjeevi: బాస్‌తో మూవీ అంటే ఎటు వెళ్ళినా రిస్కే... మెగాస్టార్‌తో సినిమాపై అనిల్ రావిపూడి కామెంట్స్
Anil Ravipudi : డైరెక్టర్ అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చిరు మూవీ గురించి మాట్లాడారు.
టాలీవుడ్లో ఫెయిల్యూర్ ఎరగని డైరెక్టర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది రాజమౌళి పేరు. ఇక ఆ తర్వాత స్థానంలో ఉన్నది మాత్రం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటివరకు ఈ డైరెక్టర్ చేసిన డిఫరెంట్ స్టైల్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరోలలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం మాత్రమే కాదు, కామెడీ యాంగిల్ ని కూడా టచ్ చేస్తూ డిఫరెంట్ గా సినిమాలను తెరకెక్కించడం ఈ డైరెక్టర్ స్టైల్. ఇప్పటిదాకా అపజయం ఎరుగని డైరెక్టర్ గా ట్రాక్ రికార్డును మెయింటైన్ చేస్తున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాతో థియేటర్లలోకి రాబోతున్నాడు. అయితే ఆయన నెక్స్ట్ మూవీని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నారు. తాజాగా ఈ విషయంపై అనిల్ రావిపూడి స్పందిస్తూ, చిరంజీవితో సినిమా ఎలా ఉండబోతుందనే విషయాన్ని వెల్లడించారు.
చిరు పాత్ర ఎలా ఉండబోతోంది?
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కథ ఓకే కాగా, స్క్రిప్ కు సంబంధించిన పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరు పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
"వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నారా? లేదంటే ఏమైనా కొత్తగా ట్రై చేయబోతున్నారా?" అనే ప్రశ్నకు అనిల్ రావిపూడి స్పందిస్తూ "చిరంజీవిని చూపించడం అని కాదు గానీ ఆయన ఏమనుకుంటున్నారు? ఎలా చూపిస్తే బాగుంటుంది? అనే చర్చలు ఇంకా జరుగుతున్నాయి. ఆయన ఎలా కోరుకుంటే అలాగే చిరంజీవిని ప్రజెంట్ చేస్తాను. శ్రీకాంత్ ఓదెల స్టేట్మెంట్ ఇచ్చారు. చిరుని ఇప్పటిదాకా ఎవ్వరూ చూడని విధంగా చూపించబోతున్నాను అని ఆయన అన్నారంటే, అది కచ్చితంగా బిగ్ ఛాలెంజ్. ఆయన అనుకున్నాడు అంటే కచ్చితంగా దాన్ని డెలివరీ చేయగలరు కూడా. నేను ఏమనుకుంటానంటే చిరంజీవి గారిలో ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటో దాన్ని వాడుకుంటాను. అలాగే నా స్టైల్ ఆఫ్ సినిమా ప్రజెంటేషన్ ఒకటి ఉంటుంది. ఒక యాటిట్యూడ్‌తో కూడిన క్యారెక్టర్ క్రియేట్ చేసి నా స్టైల్ ఆఫ్ కామెడీ ఉండేలా చూస్తా" అన్నారు.
అటు వెళ్ళినా, ఇటు వెళ్ళినా రిస్కే
చిరుతో మూవీ రిస్క్ ఎలా ఉంటుందో కూడా అనిల్ రావిపూడి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ "నా దృష్టిలో ఒక చిరంజీవి గారు ఉన్నారు... అది వింటేజా ఇంకోటా అనేది నేను చెప్పలేను. నా దృష్టిలో ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యాక ఎంత మందికి రీచ్ అయ్యింది అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఏం చూపించాలి, ఏం చూపించకూడదు అనేదాన్ని నేను ఇప్పుడు ఫిక్స్ అవ్వలేదు. నేను ఎలా చూపించాలి అనుకుంటున్నాను అంటే నేను ఒక చిరంజీవి గారిని చూస్తున్నాను. నాకు కనబడుతున్న ఆయనను ఎలా చూపించాలి అనే విషయం ఇంకా వర్క్ స్టేజ్ లో ఉంది. కథ అంతా కంప్లీట్ చేశాక చిరంజీవి గారు ఇలా ఉండబోతున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది. స్క్రిప్ట్ అంతా పూర్తి చేశాక దాంట్లో చిరంజీవి గారి స్ట్రెంత్ ఏంటి? అనేదాన్ని బేస్ చేసుకుంటాము'' అని అన్నారు.
చిరు సినిమా గురించి అనిల్ రావిపూడి ఇంకా మాట్లాడుతూ... ''కంప్లీట్ గా అటు వెళ్లలేము, ఇటు వెళ్లలేము. ఎటు వెళ్లినా రిస్కే. అందుకే ఆ రెండింటి మధ్యలో ఏదో ఒకటి చేయాలని చూస్తాను నేను. కానీ ఖచ్చితంగా చిరంజీవి గారు ఎన్నో జనరేషన్స్ అడ్మిన్ చేసిన హీరో. ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూసిన హీరో. అలాగే ఇప్పటిదాకా ఎన్నో జానర్లలో సినిమాలు చేశారు. కాబట్టి ఛాలెంజింగ్ గానే ఉంటుంది. కానీ ఎక్సైట్మెంట్ తో చేస్తున్నాం. కాబట్టి మంచి సినిమానే డెలివరీ చేస్తాము. శ్రీకాంత్ ఓదెల చెప్పినట్టుగా ఆయన ఒకరకంగా ట్రై చేస్తున్నాడు. అప్పుడు ఇద్దరు చిరంజీవిలు కనిపిస్తారు. ఆయన చిరంజీవి ఒకలా, నా చిరంజీవి ఒకలా ఉంటారు. కానీ ఇద్దరు చిరంజీవిలు కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారు" అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా అనిల్ రావిపూడి తనదైన శైలిలో కామెడీ యాంగిల్ ని టచ్ చేస్తూ చిరంజీవిని చూపిస్తే మాత్రం థియేటర్లలో మెగా అభిమానులకు పూనకాలే.
Also Read: అమెరికాలో కన్ను మూసిన టాలీవుడ్ డైరెక్టర్... ఆవిడ తీసిన సినిమాలు ఏమిటో తెలుసా?