Just Tickets : అల్లు అరవింద్ కుమారునికి ఏపీ ఆన్‌లైన్ టిక్కెట్ కాంట్రాక్ట్ ? ఎల్-1 గా నిలిచిన "జస్ట్ టిక్కెట్"
ఏపీలో ఆన్ లైన్ టిక్కెట్ల కాంట్రాక్ట్‌ను అల్లు అరవింద్ కుమారుడికి చెందిన జస్ట్ టిక్కెట్ సంస్థ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో ఎల్-1గా నిలిచింది.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏపీలో సినిమా టిక్కెట్లను ( AP Movie Tickets ) ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిన పోర్టల్ మాత్రమే అమ్మనుంది. ఇప్పటికే ప్రభుత్వమే సినిమా టిక్కెట్లు అన్నీ అమ్మేలా చట్టం చేశారు. ఏపీ ఫిల్మ్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆన్ లైన్ టిక్కెట్లు అమ్మనున్నారు. అయితే ఏపీఎఫ్‌డీసీ ( APFDC ) సొంత పోర్టల్ రూపొందించలేదు. ఇప్పటికే ఉన్న పోర్టళ్లకు అవకాశం ఇవ్వాలని టెండర్లు పిలిచింది. ఈ టెండర్ల ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఏ క్షణమైనా టెండర్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో జస్ట్ టిక్కెట్ ( Just Ticket ) అనే సంస్థ ఎల్ 1 గా నిలిచినట్లుగా తెలుస్తోంది.
జస్ట్ టిక్కెట్ సంస్థ చెన్నై కేంద్రంగా పని చేస్తోంది. ఈ సంస్థలో అల్లు అరవింద్ కుమారుడు అల్లు వెంకటేష్ ( Allu Venkatesh )ఓ డైరక్టర్. ఆన్ లైన్ టిక్కెటింగ్ బిజినెస్ ప్రారంభమైనప్పుడు జస్ట్ టిక్కెట్ ఏపీలో చాలా సినిమా ధియేటర్లలో టిక్కెట్లను బుక్ చేసేది. అయితే తర్వాత పేటీఎంతో పాటు బుక్ మై షో ( Book My Show ) లాంటి స్టార్టప్‌లు రావడంతో జస్ట్ టిక్కెట్ వెనుకబడిపోయింది. ఇప్పుడు ఏపీలో సినిమా టిక్కెట్ల కాంట్రాక్ట్‌ను పొందడం ద్వారా మరోసారి ఆ సంస్థ దూసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.
ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో జస్ట్ టిక్కెట్‌తో పాటు బుక్ మై షో కూడా పాల్గొంది. అయితే తక్కువ సర్వీస్ చార్జీ తీసుకునేందుకు జస్ట్ టికెట్ కొటేషన్ తీసుకుంది. ఎల్ 1గా నిలిచిన జస్ట్ టిక్కెట్‌కు ఏపీ ప్రభుత్వ అధికారిక టికెట్ బుకింగ్ గెట్‌వేగా కాంట్రాక్ట్ ఇస్తున్నట్లుగా ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఏపీలో ఎక్కడ సినిమా చూడాలన్నా జస్ట్ టిక్కెట్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ధియేటర్లలో బుకింగ్‌లు కూడా ఆ పోర్టల్ ద్వారానే చేయాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థను టాలీవుడ్ పెద్దలే కోరుకున్నారని ఏపీ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఆ మేరకు ఇప్పుడు టాలీవుడ్ బిగ్గీగా పేరు పొందిన అల్లు అరవింద్ కుమారుడికే కాంట్రాక్ట్ దక్కనుండటం ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఇక ఏప్రిల్ ఒకటి నుండి జస్ట్ టిక్కెట్ బ్రాండ్ ద్వారా మాత్రమే టిక్కెట్లు అమ్మనున్నారు. అంటే ఇక ఏపీలో బుక్ మై షో లాంటి పోర్టళ్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండదు.