Allu Arjun: ఆ మూవీలో గెస్ట్ రోల్ కోసం అసలు బన్నీని ఎవరూ సంప్రదించలేదా?
బాలీవుడ్ మూవీలో అల్లు అర్జున్ నటిస్తున్నారనే వార్తలపై క్లారిటీ వచ్చేసింది. 'జవాన్' మూవీలో బన్నీ అతిథి పాత్ర పోషిస్తున్నారనే దానిపై క్రేజీ అప్డేట్ మీ కోసం...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నార్త్ సర్క్యూట్స్ లో ఈ మూవీ ఎవరూ ఊహించని రీతిలో విజయం సాధించడంతో, హిందీ చిత్ర వర్గాల్లోనూ బన్నీ క్రేజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆయనతో వర్క్ చేయడానికి పలువురు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి టైంలో 'జవాన్' సినిమాలో గెస్ట్ రోల్ కోసం బన్నీని సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది.
'పఠాన్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమా 'జవాన్'. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అతిధి పాత్ర చేయనున్నట్లు టాక్ రావడంతో, అందరిలో ఆసక్తి రెట్టింపు అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం, షారుఖ్ సినిమాలో బన్నీ భాగం కావడం లేదు.
'జవాన్' లో అతిథి పాత్ర కోసం అసలు బన్నీని ఎప్పుడూ సంప్రదించలేదని బాలీవుడ్ మీడియాలో నివేదికలు పేర్కొన్నాయి. షారుక్ ఖాన్ మూవీలో అల్లు అర్జున్ కనిపిస్తాడనేది కేవలం రూమర్ మాత్రమే, నిజానికి అతిధి పాత్ర కోసం అతన్ని సంప్రదించలేదని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాలో సీనియర్ నటుడు సంజయ్ దత్ మాత్రమే గెస్ట్ రోల్ లో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి.
ఇటీవల అల్లు అర్జున్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు సైతం ఇదే విషయం మీద స్పందించారు. 'జవాన్' సినిమాలో అల్లు అర్జున్ నటించడం లేదని తెలిపారు. కాకపొతే బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయని.. ఇటీవల 'ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ' యూనిట్ సంప్రదించినట్లుగా వెల్లడించారు. అయితే వాళ్లకు ఇంకా ఓకే చెప్పలేదని, కానీ బన్నీ ఈ సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు. ఈ యేడాది డిసెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని టీమ్ అనుకుంటోందని బన్నీ వాసు తెలిపారు. 'పుష్ప 2' తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే బన్నీ ఒక సినిమా చేస్తారని వెల్లడించాడు. ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉండే అవకాశం వుందని టాక్ నడుస్తోంది.
ఇకపోతే 'పుష్ప' పాన్ ఇండియా సక్సెస్ ను దృష్టిలో 'పుష్ప 2' చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పుష్పరాజ్ గా బన్నీ అలరించనున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ లో ఈ సినిమా రూపొందుతోంది. బన్నీ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.