సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న బన్నీ, చరణ్ - కారణం అదేనా?
అల్లు అర్జున్ 'పుష్ప 2', రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' రిలీజ్ డేట్స్ పై ఇంకా క్లారిటీ రాలేదు. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలవుతాయని మొన్నటి వరకు వార్తలు వచ్చిన సమ్మర్ రేస్ నుంచి తప్పకుందని తాజా సమాచారం.
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. ఇక ఈ ఏడాది మరో మూడు నెలలతో ముగిసిపోతుంది. ఈ ఏడాది చివర్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ముందు మన తెలుగు హీరోల్లో ప్రభాస్ ఒక్కడే 'సలార్' తో సందడి చేయబోతున్నాడు. నిజానికి సెప్టెంబర్ 28న 'సలార్' విడుదల అవ్వాల్సింది. కానీ అనుకోని విధంగా వాయిదా పడింది. ఇక వచ్చే ఏడాది 2024 మాత్రం దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలన్నీ విడుదలకు ముస్తాబవుతున్నాయి. మహేష్ బాబు నుంచి మొదలుకొని పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా అందరి హీరోల సినిమాలు వరుసగా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.
అయితే ఈ అగ్ర హీరోల్లో అల్లు అర్జున్ 'పుష్ప 2', రాంచరణ్ 'గేమ్ చేంజర్' విడుదల తేదీలపై సందిగ్ధత నెలకొంది. నిజానికి ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని మొన్నటి వరకు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో రూపొందిన పుష్ప 2 ను సమ్మర్ కన్నా ముందే అంటే మార్చి చివరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అదేవిధంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ పై కూడా సస్పెన్స్ నెలకొంది. 'గేమ్ చేంజర్' షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
అయితే ‘గేమ్ ఛేంజర్’తో పాటు కమలహాసన్ 'ఇండియన్ 2' ని కూడా ఒకే సమయంలో షూటింగ్ చేస్తుండటంతో 'గేమ్ చేంజర్' పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవుతుంది. 'ఇండియన్ 2' వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఈ మూవీ రిలీజ్ అయ్యాకే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ అనుకుంటుందట. ఈ లెక్కన గేమ్ చేంజర్ కూడా వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే వచ్చే ఏడాది సమ్మర్ రేస్ లో బన్నీ, చరణ్ ఉండకపోవచ్చు. 'పుష్ప 2' షూటింగ్ విషయానికొస్తే ప్రస్తుతానికి షెడ్యూల్స్ కాస్త ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఫస్ట్ పార్ట్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి సుకుమార్ పార్ట్ 2 ను మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. కాస్త ఆలస్యమైన పర్లేదు కానీ ఎక్కడ రాజీ పడకుండా సినిమాను చిత్రీకరిస్తున్నారట. ఇప్పటికే 75 శాతానికి పైగా చిత్రీకరణ జరిగినట్లు సమాచారం. మిగతా భాగం చిత్రీకరణ పూర్తి చేసుకోవడానికి మేకర్స్ ఇంకా ఎంత సమయం తీసుకుంటారో చూడాలి. ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. ఈ మూవీ షూటింగ్ ఎంతవరకు కంప్లీట్ అయిందో ఎటువంటి వివరాలు తెలియలేదు. ఆ మధ్య దిల్ రాజుని అడిగితే తనకేం సంబంధం లేదని, అంతా డైరెక్టర్ గారు చూసుకుంటున్నారని చెప్పారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ తప్ప ఇప్పటి వరకు మరో అప్డేట్ ఇవ్వలేదు.
Also Read : 'పెదకాపు' ట్రైలర్ - మీకే అంతుంటే మాకెంతుడాలిరా - ఆత్మ గౌరవమా? కొవ్వా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial