Operation Sindoor: 'ఆపరేషన్ సింధూర్'పై కామెంట్స్ - పాక్ యాక్టర్స్‌పై బ్యాన్!
Pakistan Artistes: 'ఆపరేషన్ సింధూర్'కు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన పాక్ యాక్టర్స్‌పై ఆల్ ఇండియా సినీ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని పూర్తిగా బ్యాన్ చేయాలని పిలుపునిచ్చింది.

All India Cine Workers Association Seeks Ban On Pakistani Actors: 'పహల్గాం' ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సింధూర్' (Operation Sindoor) పేరిట ఆర్మీ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్ ఆక్రమికత కశ్మీర్‌లో 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ చర్యను ప్రతీ భారతీయుడు స్వాగతించాడు. అయితే.. కొందరు పాక్ నటులు 'ఆపరేషన్ సింధూర్' తప్పుబట్టారు. ఇది పిరికి చర్యగా అభివర్ణించారు.
వారిని వెంటనే బ్యాన్ చేయాలి
'ఆపరేషన్ సింధూర్'పై కామెంట్స్ చేసిన పాక్ యాక్టర్స్ మహీరా ఖాన్ (Mahira Khan), హనియా అమీర్ (Hania Aamir), ఫవాద్ ఖాన్ (Fawad Khan), అలీ జాఫర్‌లను బ్యాన్ చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. వారిని వెంటనే చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని.. కళల పేరుతో 'ఆపరేషన్ సింధూర్'కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఇలాంటి వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వొద్దని కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
పాక్ యాక్టర్స్ కామెంట్స్ మన దేశాన్ని అగౌరవపరిచేలా ఉన్నాయని.. అంతే కాకుండా ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయకులను, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులను కూడా అవమానించేలా ఉన్నాయని సినీ అసోసియేషన్ తెలిపింది. 'మన చిత్ర పరిశ్రమలో వర్క్ చేసే పాకిస్థానీ యాక్టర్స్, చిత్ర నిర్మాతలపై కూడా పూర్తిగా బ్యాన్ విధించాలి. భారతీయులెవరూ వీరిని అభిమానించొద్దు. కళల పేరుతో ఇలాంటి వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వడం జాతీయ గౌరవాన్ని అగౌరవపరచడమేనని చిత్ర పరిశ్రమ అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం ఐక్యంగా నిలబడదాం. జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇండియన్ సింగర్స్ ఎవరకూ పాక్ సింగర్స్‌తో వేదికలు పంచుకోవద్దు.' అని సూచించింది.
Also Read: నిర్మాతగా 'సమంత' హిట్ కొట్టారా? - 'శుభం' మూవీ మెప్పించిందా?.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
పాకిస్తాన్‌లోని పాపులర్ హీరోయిన్లలో మహీరా ఖాన్ (Mahira Khan), హనియా అమీర్ ఉన్నారు. వీరు 'ఆపరేషన్ సింధూర్'ను సోషల్ మీడియా వేదికగా తప్పుబట్టారు. 'ఆపరేషన్ సింధూర్' తర్వాత పాక్ రచయిత్రి ఫాతిమా భుట్టో చేసిన ట్వీట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసిన మహీరా.. 'ఇది నిజంగా పిరికి చర్య.. మన దేశాన్ని (పాకిస్తాన్‌ను) అల్లా రక్షించుగాక' అని పేర్కొన్నారు. ఈమె బాలీవుడ్ బాద్ షా షారుక్ నటించిన 'రయీస్'లో నటించారు. మరో నటి నటి హనియా అమీర్ కూడా 'ఆపరేషన్ సింధూర్'ను 'Cowardly' (పిరికితనంతో చేసిన చర్య)గా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అటు నటుడు ఫవాద్ ఖాన్ కూడా 'ఆపరేషన్ సిందూర్'ను ఖండించారు.
పహల్గా దాడి తర్వాత పాక్ యాక్టర్స్ మూవీస్, సోషల్ మీడియా అకౌంట్స్, యూట్యూబ్ ఛానళ్లపై భారత ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ క్రమంలో ఫవాద్ ఖాన్ లేటెస్ట్ బాలీవుడ్ మూవీ 'అబీర్ గులాల్' పైనా నిషేధం విధించారు. ఇప్పుడు 'ఆపరేషన్ సింధూర్'కు వ్యతిరేకంగా పాక్ యాక్టర్స్ పోస్టులు పెట్టడంతో వారిని పూర్తిగా బ్యాన్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.





















