Akshay Kumar: నన్ను వాళ్లు మోసం చేశారు, నేను మాట్లాడ్డం మానేశాను - అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సినీ కెరీర్ లో చాలా మంది నిర్మాతలు మోసం చేశారని చెప్పారు. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారని వెల్లడించారు.
Akshay Kumar About Producers Cheating: గత కొంత కాలంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు అస్సలు కలిసి రావడం లేదు. ఆయన నటించిన సినిమాలు వరుసగా పరాజయం పాలవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర కనీసం సత్తా చాటలేకపోతున్నాయి. అక్షయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సర్ఫిరా’ మూవీ రీసెంట్ గా థియేటర్లలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు. తన కెరీర్ లోని పరాజయాలతో పాటు జరిగిన మోసాల గురించి ప్రస్తావించారు. తనను పలువురు నిర్మాతలు మోసం చేశారని, ఇస్తానని చెప్పిన రెమ్యునరేషన్ ఇవ్వలేని చెప్పుకొచ్చారు.
ఇంతకీ అక్షయ్ ఏం చెప్పారంటే?
తనను వ్యక్తిగత జీవితంతో పాటు సినీ కెరీర్ లోనూ పలువురు మోసం చేశారని అక్షయ్ వెల్లడించారు. “వ్యక్తిగత జీవితంతో పాటు, సినీ కెరీర్ లోనూ చాలా మంది నన్ను మోసం చేశారు. అన్ని రంగాల్లో మోసం చేసే వాళ్లు ఉంటారు. సినిమా పరిశ్రమలోనూ అలాంటి వారున్నారు. మోస పోయిన వాళ్లలో నేను కూడా ఉన్నాను. కొంత మంది నన్ను చీట్ చేశారు. నన్ను మోసం చేశారనే విషయం తెలిసిన తర్వాత వారికి దూరంగా ఉండటం మొదలుపెట్టాను. వాళ్లతో కనీసం మాట్లాడను. కొంత మంది నిర్మాతలు నాకు ఇస్తానని చెప్పిన రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. నా దృష్టిలో ఆడిన మాట తప్పడం అనేది కూడా మోసం కిందికే వస్తుంది” అని వెల్లడించారు.
వరుస పరాజయాలతో సతమతం అవుతున్న అక్షయ్
అక్షయ్ కుమార్ గత కొంత కాలంగా నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. రీసెంట్ గా టైగర్ ష్రాఫ్, ఆయన కలిసి నటించిన ‘బడే మియా ఛోటే మియా’ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. జులై 12న విడుదలైన ‘సర్ఫిరా’ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది. సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు కనీసం రూ. 30 కోట్లు కూడా వసూళు చేయలేకపోయింది. ఇక ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ మూవీ విడుదలకు రెడీ అవుతోంది. మరోవైపు ‘స్కైఫోర్స్’, ‘సింగమ్ ఎగైన్’, ‘వెల్‌కమ్ టు ది జంగిల్’, ‘కన్నప’, ‘హేరా ఫేరి 3’ మూవీస్ చేస్తున్నారు.
‘ఖేల్ ఖేల్ మే’ సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా.. ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను, వాణి కపూర్, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘స్త్రీ 2’ కూడా అదే రోజున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.
Read Also: పిచ్చోడా చచ్చిపోతావ్ అన్నారు - డాక్టర్లే షాకయ్యారు: నటుడు సురేష్
Also Read: ‘డెడ్‌పూల్ 3’ టీజర్: మార్వెల్‌కు మహారాజు తానేనట - ‘వోల్వరైన్’తో పెట్టుకున్నాడు, ఏమైపోతాడో!