Dejavu - Repeat : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్
Repeat Movie Review : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో త్వరలో నవీన్ చంద్ర 'రిపీట్' రిలీజ్ కానుంది. ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉన్న 'డెజావు'ను ఆడియన్స్ చూస్తున్నారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే
నవీన్ చంద్ర (Naveen Chandra) కథానాయకుడిగా నటించిన సినిమా 'రిపీట్' (Repeat Movie). డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీని రిలీజుకు ముందు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోని 'డెజావు' సినిమాకు క్లిక్స్ పెరిగాయి. ఆ సినిమాకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... ఆసక్తికరమైన విషయం ఒకటి వెల్లడింది. అది ఏమిటంటే...
తమిళంలో అరుళ్ నిధి, సీనియర్ హీరోయిన్ మధు షా (మధుబాల), కన్నడ నటుడు అచ్యుత్ కుమార్, స్మృతి వెంకట్, 'కాళీ' వెంకట్, మైమ్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'డెజావు'. ఇదొక మిస్టరీ థ్రిల్లర్. ఈ ఏడాది జూలై 22న థియేటర్లలో విడుదల అయ్యింది. అక్కడి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఆ సినిమా విడుదల అయ్యింది. తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విడుదల చేశారు. ఆ సినిమాకు, నవీన్ చంద్ర 'రిపీట్'కు సంబంధం ఏంటంటే... రెండు కథలు ఒక్కటే!
'డెజావు'కు రీమేక్ 'రిపీట్'
'డెజావు'కు తెలుగు రీమేక్ 'రిపీట్'. తమిళంలో నటించిన మధుబాల, అచ్యుత్ కుమార్... తెలుగు సినిమాలో కూడా నటించారు. అక్కడ అరుళ్ నిధి పోషించిన పాత్రను తెలుగులో నవీన్ చంద్ర చేశారు. ఈ రెండు సినిమా కథలు ఒక్కటేనని, ఆ 'డెజావు'కు 'రిపీట్' రీమేక్ అని తెలియడంతో... జనాలు 'డెజావు'ను చూడటం మొదలు పెట్టారు. కంటెంట్ కూడా బావుండటంతో మంచి ఆదరణ లభిస్తోంది.
Also Read : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన 'డెజావు' మిస్టరీ థ్రిల్లర్ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విశేషం ఏమిటంటే... తమిళ సినిమా 'డెజావు'కు దర్శకత్వం వహించిన అరవింద్ శ్రీనివాసన్, తెలుగు వెర్షన్ 'రిపీట్'కు కూడా దర్శకత్వం వహించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. గ్రిప్పింగ్ ట్విస్ట్‌లు, ఊహించని మలుపులతో అరవింద్ శ్రీనివాసన్ సినిమా తెరకెక్కించారని ప్రశంసలు అందుకున్నారు. ఇందులో నవీన్ చంద్రది పోలీస్ ఆఫీసర్ రోల్. పీజీ ముత్తయ్య సినిమాటోగ్రఫీ అందించడంతో పాటు నిర్మాతలలో ఒకరిగా వ్యవహరించారు. భవాని డీవీడీ ఇంక్ పై రాజశేఖర్ అన్నభీమోజు తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
'డెజావు' కథ ఏమిటి?
ఓ నవల రచయిత ఊహించిన పాత్రలు సజీవంగా అతని ముందుకు వచ్చి బెదిరిస్తే? అప్పుడు ఏం జరుగుతుంది? అభూత కల్పన అనేది భయానక వాస్తవంగా మారినప్పుడు ఏం జరుగుతుంది? అనేది 'డెజావు' చిత్రకథ. ఈ కథలో పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం... వరుస హత్యలు... వంటి విషయాలతో చివరి వరకు సస్పెన్స్‌తో దర్శకుడు చిత్రాన్ని నడిపించారు.
ఇప్పుడు నవీన్ చంద్ర 'రిపీట్'కు... తమిళ 'డెజావు'కు కంపేరిజన్స్ రావడం కామన్. రెండు సినిమాలు చూసిన ఆడియన్స్ ఏం అంటారో చూడాలి. కొంత మంది అయితే 'రిపీట్'ను ఆలస్యంగా విడుదల చేస్తున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీని విమర్శిస్తూ... యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు.