Kriti Sanon - Adipurush Movie : సీతా నవమి - కృతి - రామ్ సియా రామ్
ఈ రోజు సీతా నవమి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'ఆదిపురుష్' చిత్ర బృందం కృతి సనన్ కొత్త పోస్టర్ విడుదల చేసింది.
శ్రీరాముని పాత్రలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సినిమా 'ఆదిపురుష్' (Adipurush Movie ). ఇందులో జానకి అలియాస్ సీత దేవిగా కృతి సనన్ నటించిన సంగతి తెలిసిన విషయమే.
సీతా నవమికి కృతి కొత్త పోస్టర్!
నేడు (ఏప్రిల్ 29న) సీతా నవమి. ఈ సందర్భంగా సినిమాలో శ్రీరాముని పత్ని జానకిగా నటించిన కృతి సనన్ కొత్త పోస్టర్లు రెండు విడుదల చేశారు. సీత వెనుక రాముడు ఉన్న ఓ పోస్టర్ ఒకటి. సీతా దేవి పోస్టర్ మరొకటి.
సీత కళ్ళల్లో చెమ్మ స్పష్టంగా కనబడుతోంది. శ్రీరాముని తలపులో సీత ఆలోచనల్లో పడిన సందర్భంలో స్టిల్ ఏమో!? ఇంకా 'రామ్ సియా రామ్' (Ram Siya Ram) సాంగ్ ఆడియో టీజర్ కూడా విడుదల చేశారు.
Also Read : 'ఏజెంట్' సినిమా రివ్యూ : అయ్యగారు అఖిల్‌ని నంబర్ వన్ చేసేలా ఉందా? లేదా?
View this post on Instagram
ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు. హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ (Rajesh Nair)తో కలిసి ప్రభాస్ హోమ్ బ్యానర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రమిది. జూన్ 16న థియేటర్లలో విడుదల కానుంది.
Also Read : 'వ్యవస్థ' రివ్యూ : దీన్ని కోర్టు రూమ్ డ్రామా అంటారా? ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
విల్లు చేతబట్టిన శ్రీరాముడు
రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' (Adipurush Movie) రూపొందుతోన్న విషయం విదితమే. శ్రీరాముని పాత్రలో ప్రభాస్ లుక్ ఆల్రెడీ విడుదల చేశారు. అక్షయ తృతీయ సందర్భంగా విల్లు చేతబట్టిన శ్రీరాముని రూపాన్ని చూపించారు.
ఐదు భాషల్లో జైశ్రీరాం పాట!
'ఆదిపురుష్' సినిమా కోసం సంగీత దర్శక ద్వయం అజయ్ - అతుల్ స్వరపరిచిన 'జైశ్రీరాం' సాంగ్ మోషన్ పోస్టర్ సైతం ఈ రోజు ఆవిష్కరించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ... మొత్తం ఐదు భాషల్లో పాటను విడుదల చేశారు. ఒక్క నిమిషం పాట మాత్రమే ఇప్పుడు విడుదలైంది. త్వరలో పూర్తి పాట విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
''నీ సాయం...
సదా మేమున్నాం!
సిద్ధం...
సర్వ సైన్యం!
సహచరులై...
పదా వస్తున్నాం!
సఫలం...
స్వామి కార్యం!
మా బలం ఏదంటే...
నీపై నమ్మకమే!
తలపున నువ్వుంటే...
సకలం మంగళమే!
మహిమాన్విత మంత్రం నీ నామం
జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం రాజారాం!'' అంటూ సాగిన ఈ గీతాన్ని సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రి రాశారు. సుమారు 20 మంది ఈ పాటకు కోరస్ అందించారు.
ట్రిబెకా చిత్రోత్సవాల్లో 'ఆదిపురుష్'
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది పలు చలన చిత్రోత్సవాలు జరుగుతాయి. వాటిలో ప్రతిష్టాత్మకంగా భావించేవి కొన్ని ఉంటాయి. అందులో ట్రిబెకా ఫెస్టివల్ (Tribeca Film Festival 2023) ఒకటి. అందులో ప్రదర్శనకు 'ఆదిపురుష్' సినిమా ఎంపిక అయ్యింది. దర్శకుడు ఓం రౌత్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
ఈ ఏడాది జూన్ 7 నుంచి 18వ తేదీ వరకు ట్రిబెకా చలన చిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. అందులో జూన్ 13వ తేదీన 'ఆదిపురుష్' ప్రీమియర్ షోకి ఏర్పాట్లు చేశారు. దాంతో సినిమా షోలు మొదలు అవుతాయని చెప్పవచ్చు.