Bastar Teaser: జవాన్లను చంపితే JNUలో సంబరాలా? ‘బస్తర్’ టీజర్‌లో నిప్పులు చెరిగిన ఆదాశర్మ
Bastar - The Naxal Story Teaser: ‘ది కేరళ స్టోరీ’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేపథ్యంలో అదే కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోంది.
‘Bastar- The Naxal Story Teaser Out: ఆదాశర్మ ప్రధాన పాత్రలో సుదీప్తో సేన్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఈ చిత్రం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. కేరళ, తమిళనాడులో ఈ సినిమాను నిషేధించాలంటూ అధికార, విపక్ష పార్టీలు పోటీపడి ఆందోళనలు చేశాయి. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. వసూళ్లపరంగానూ సత్తా చాటింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లోనే మరో కాంట్రవర్శియల్ మూవీ తెరకెక్కుతోంది. నక్సల్స్ సమస్యల కథాంశంతో ‘బస్తర్’ అనే సినిమాను చేస్తున్నారు. ఈ మూవీలో ఆదాశర్మ నీర్జా మాధవన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నది. రీమాసేన్, యశ్పాల్ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. ఇందులో ఆదాశర్మ మాత్రమే కనిపించింది. నక్సల్స్ సమస్యతో పాటు దేశంలోని కుహానా మేధావుల తీరును ఆమె తీవ్రంగా విమర్శించింది.
పవర్ ఫుల్ డైలాగులతో ఆకట్టుకున్న ఆదాశర్మ
‘బస్తర్’ టీజర్ లో ఆదాశర్మ చెప్పిన మాటలు అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి. నక్సలైట్లతో జరిగిన పోరాటంలో కన్నుమూసిన జవానుల గురించి ఆవేదనతో అదే సమయంలో ఆగ్రహంతో పలికిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. భారత్, పాక్ సరిహద్దుల్లో శత్రుసైన్యంతో పోరాడుతూ కన్నుమూసిన జవాన్ల కంటే నక్సలైట్లతో పోరులో చనిపోయిన జవాన్ల సంఖ్య ఎక్కువని అని చెప్తుంది. బస్తర్‌లో 76 మంది జవానులను నక్సలైట్లు చంపితే, JNUలో విద్యార్ధులు సంబరాలు జరుపుకున్నారని విమర్శించింది. నక్సలిజాన్ని టార్గెట్ చేసుకుని ఆదాశర్మ చెప్పిన డైలాగులు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
పవర్ ఫుల్ ఐపీఎస్ పాత్రలో ఆదాశర్మ
‘ది కేరళ స్టోరీ’ ఫేమ్ సుదీప్తో సేన్ ‘బస్తర్’ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తీయడానికి ముందుకు ఆయన నక్సల్స్ సమస్య మీద చాలా పరిశోధన చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ పాత్రలో ఆదాశర్మ నటిస్తోంది. ఆమె కెరీర్ లో పూర్తి స్థాయిలో సీరియస్ క్యారెక్టర్ చేయబోతుంది ఆదా శర్మ. అంతేకాదు, ‘బస్తర్’ మూవీకి గతంలో ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు పని చేసిన సాంకేతిక బృందమే పని చేస్తోంది. ‘ది కేరళ స్టోరీ’ సినిమాను నిర్మించిన అమృత్ లాల్ షానే ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు.
మార్చి 15న ‘బస్తర్’ మూవీ విడుదల
సుదీప్తో సేన్ తెరకెక్కిస్తున్న ‘బస్తర్’ మూవీ మార్చి 15న పాన్ ఇండియన్ రేంజిలో విడుదల కాబోతోంది. హిందీ సహా పలు భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో పలు వివాదాస్పద విషయాలను చూపించబోతున్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆదాశర్మ, సుదీప్తో సేన్ కాంబినేషన్‌లో రూపొందిన ‘ది కేరళ స్టోరీ’ అప్పట్లో కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. రూ. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ, ఏకంగా రూ. 300 కోట్లను రాబట్టింది.
Read Also: ‘యానిమల్‘లో అండర్‌వేర్ యాక్షన్ సీన్ - సందీప్ రెడ్డి భార్య, కొడుకు రియాక్షన్ ఇదే!