Priyanka Mohan: 'OG' గంభీరను మలుపు తిప్పే రోల్ 'కణ్మని'... రియల్ హీరో పవన్ - హీరోయిన్ ప్రియాంక మోహన్ ఇంటర్వ్యూ
Priyanka Mohan Interview: 'ఓజీ'లో కణ్మని రోల్ తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని హీరోయిన్ ప్రియాంక మోహన్ అన్నారు. తాజా ప్రెస్ మీట్‌లో మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Actress Priyanka About OG Movie: పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్‌తో పాటు వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ 'OG'. 'సాహో' ఫేం సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది. మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆమె తాజాగా ప్రెస్ మీట్‌లో తన రోల్‌తో పాటు చిత్ర విశేషాలు పంచుకున్నారు.
'కణ్మని' రోల్ ఎప్పటికీ స్పెషల్
'OG'లో కణ్మని రోల్ తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని ప్రియాంక చెప్పారు. 'డైరెక్టర్ సుజీత్ కథ చెప్పిన వెంటనే నచ్చి ఓకే చెప్పేశాను. అందులోనూ పవన్ మూవీ నాక చాలా స్పెషల్. ఓజీతో నాది రెండున్నరేళ్ల ప్రయాణం. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో ఆయన రియల్ హీరో. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో కణ్మని రోల్‌కు నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది 1980-90లలో జరిగే కథ. కణ్మని ఒక ఇన్నోసెంట్ స్వీట్ గర్ల్. గంభీర పాత్రతో గాఢమైన ప్రేమలో ఉంటుంది. గంభీర జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర కణ్మని.' అని చెప్పారు.
ఫస్ట్ సాంగ్ 'సువ్వి సువ్వి'
'ఓజీలో మెలోడి సాంగ్ సువ్వి సువ్వి పాటనే ఫస్ట్ తమన్ స్వరపరిచారని ప్రియాంక చెప్పారు. 'తమన్ ప్రతి పాటకి వైవిధ్యమైన సంగీతం అందించారు. ఇందులో ఆయన స్వరపరిచిన మొదటి పాట 'సువ్వి సువ్వి'నే. ఈ పాటను అందరికీ వినిపించాలని ఎంతగానో ఎదురుచూశాను. విడుదల తర్వాత అందరికీ సాంగ్ నచ్చడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మిగిలిన పాటలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. బీజీఎం వేరే లెవల్‌లో ఉంది.' అని చెప్పారు.
Also Read: ఎవరీ మహికా శర్మ? - క్రికెటర్ హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఫేమస్ మోడల్... ఈ విషయాలు తెలుసా!
పవన్ సార్ చాలా సింపుల్
తాను ఊహించిన దాని కంటే పవన్ సార్ క్రేజ్ చాలా ఎక్కువని ప్రియాంక అన్నారు. 'నేను బెంగళూరులో ఉన్నప్పుడే ఆయన క్రేజ్ గురించి తెలుసు. అయితే ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు నేను ఊహించిన దాని కంటే ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంది. ఎంత క్రేజ్ ఉన్నా కూడా.. పవన్ చాలా సింపుల్‌గా ఉంటారు. సెట్‌లో బుక్స్ గురించే ఎక్కువ మాట్లాడతారు. ఆయన చదివిన కథలు, నవలల గురించి చెప్తారు.
అప్పుడప్పుడు సినిమాలు, రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ప్రజల గురించి ఎక్కువ మాట్లాడతారు. సీన్ షూట్ చేయడానికి ముందు డైరెక్టర్, యాక్టర్స్‌తో చర్చిస్తారు. సినిమాకి ఉపయోగపడే పలు గొప్ప సూచనలు ఇస్తుంటారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు.' అని చెప్పారు.
ఓజీ ఎలా ఉంటుందంటే?
'ఓజీ'లో యాక్షన్ ఓ పార్ట్ అని బలమైన స్టోరీ ఫ్యామిలీ డ్రామా కూడా ఉందని చెప్పారు ప్రియాంక. 'నా క్యారెక్టర్, లుక్ బాగున్నాయంటే అందుకు కారణం డైరెక్టర్ సుజీత్. నటీనటుల నుంచి ఎలా నటన రాబట్టుకోవాలని అనే దానిపై ఆయనకు పూర్తి స్పష్టత ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నాకు హోమ్ ప్రొడక్షన్‌లా మారిపోయింది. ఈ బ్యానర్‌లో వరుసగా రెండు మూవీస్ చేశాను. ముందు ఓజీనే అంగీకరించినా సరిపోదా శనివారం ఫస్ట్ రిలీజైంది. ప్రస్తుతం తెలుగులో కొన్న కథలు వింటున్నా ఇతర భాషల్లో మూవీస్ చేస్తున్నా.' అంటూ తెలిపారు.





















