Nivetha Pethuraj: రేసింగ్‌లో ఫ్రెండ్ షిప్... ఆ తర్వాత లవ్ - నిశ్చితార్థం, పెళ్లిపై హీరోయిన్ నివేదా పేతురాజ్ రియాక్షన్
Nivetha Love Story: తనకు ఇంకా ఎంగేజ్మెంట్ జరగలేదని హీరోయిన్ నివేదా పేతురాజ్ తెలిపారు. ఇటీవలే ఆమె తనకు కాబోయే వరున్ని పరిచయం చేయగా... సింపుల్‌గానే ఎంగేజ్మెంట్, పెళ్లి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.

Actress Nivetha Pethuraj About Her Wedding Plans: ప్రముఖ హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే వరున్ని పరిచయం చేశారు. ఆమె ప్రముఖ బిజినెస్ మ్యాన్ రజిత్ ఇబ్రాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. వినాయక చవితి రోజున ఆయనతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ సర్ప్రైజ్ ఇచ్చారు. వీటిని చూసిన నెటిజన్లు ఆమెకు నిశ్చితార్థం జరిగిపోయిందనే అనుకున్నారు. అయితే, తమకు ఇంకా ఎంగేజ్మెంట్ జరగలేదంటూ తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
పెళ్లి ఎప్పుడంటే?
ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టేశామని చెప్పిన నివేదా... అక్టోబరులో ఎంగేజ్మెంట్, వచ్చే ఏడాది జనవరిలో వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పారు. అయితే తేదీలు ఇంకా ఫైనల్ కాలేదని తెలిపారు. కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో సింపుల్‌గానే ఈ వేడుకలు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో నెటిజన్లు అందరూ ఆమెకు విషెష్ చెబుతున్నారు.
రేసింగ్‌లో పరిచయం
దుబాయ్‌లో ఐదేళ్ల క్రితం జరిగిన ఫార్ములా ఈ రేసింగ్‌లో రజిత్ ఇబ్రాన్‌తో తనకు పరిచయం ఏర్పడినట్లు నివేదా తెలిపారు. 'ఆ తర్వాత ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. మన బంధాన్ని పెళ్లి వరకూ ఎందుకు తీసుకెళ్లకూడదు? అని ఒకరినొకరం అనుకుని పెళ్లికి సిద్ధమయ్యాం. మా లవ్ సంగతి నాకు బాగా కావాల్సిన వారికి మాత్రమే తెలుసు. ఇండస్ట్రీలో ఎవరికీ చెప్పలేదు. అందుకే అనౌన్స్ చేయగానే కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారిలో మా మేనేజర్ ఒకరు. నాకు కాబోయే భర్త సినిమాలు ఎక్కువగా చూస్తారు. కెరీర్ పరంగా నాకు సపోర్ట్ చేస్తుంటారు.' అని వెల్లడించారు.
అసలెవరీ రజిత్ ఇబ్రాన్?
నివేదాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి రజిత్ ఇబ్రాన్ ప్రముఖ బిజినెస్ మ్యాన్. తమిళ్ ముస్లిం కుటుంబానికి చెందిన ఈయన... వ్యాపార పనుల నిమిత్తం పారిస్, న్యూయార్క్, హాంకాంగ్ అంటూ వివిధ దేశాలు తిరుగుతుంటారు. దుబాయ్‌లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఓవైపు మూవీస్‌లో నటిస్తూనే ఈయనతో ప్రేమలో పడ్డారు. క్రీడలపై ఆమెకు ఆసక్తి ఎక్కువగా ఉండగా... రేసింగ్, బ్యాడ్మింటన్‌లోనూ ప్రావీణ్యం పొందారు. అలా... దుబాయ్‌లో జరిగిన ఫార్ములా రేసింగ్‌లో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. దాదాపు ఐదేళ్లు వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువైపులా పెద్దలను ఒప్పించిన వీరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
ఇక నివేదా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె చేతిలో ప్రాజెక్టులేమీ లేవు. 2016లో ఓ తమిళ మూవీతో ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీవిష్ణు హీరోగా నటించిన 'మెంటల్ మదిలో' మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నారు. సాయిదుర్గా తేజ్ 'చిత్ర లహరి', 'బ్రోచేవారెవరురా', రామ్ పోతినేని 'రెడ్', విశ్వక్ సేన్ 'పాగల్', రానా 'విరాటపర్వం', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' మూవీస్‌లో నటించి మెప్పించారు.





















