(Source: ECI/ABP News/ABP Majha)
Dhanya Balakrishna: రజనీ 'లాల్ సలాం' టీం, తమిళ ప్రజలకు ధన్య బాలకృష్ణ క్షమాపణలు - ఆ పోస్ట్‌తో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న నటి
Dhanya Balakrishna: 12 ఏళ్ల క్రితం తమిళనాడుపై ధన్య బాలకృష్ణ చేసిన కామెంట్స్ తాజాగా వివాదస్పదం అయ్యాయి. దీంతో ఆమెపై తమిళనాట వ్యతిరేకత మొదలైంది.
Dhanya Balakrishna Sorry to Lal Salaam Team: సినీ నటి ధన్య బాలకృష్ణ తాజాగా 'లాల్ సలాం' మూవీ టీం, తమిళ ఆడియన్స్‌ని క్షమాపణలు కోరింది. 12 ఏళ్ల క్రితం తమిళనాడుపై ఆమె చేసిన కామెంట్స్ తాజాగా వివాదస్పదం అయ్యాయి. దీంతో ఆమెపై తమిళనాట వ్యతిరేకత మొదలైంది. దీని ప్రభావం ఇప్పుడు లాల్ సలాం సినిమాపై పడటంతో దిగొచ్చిన ధన్య ధన్య బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా తమిళనాడు ప్రజలకు క్షమాపణలు చెప్పింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సలాం. రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలకు రెడీ అవుతుంది. ఇందులో ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తుంది.
తమిళనాడును కించపరిచేలా పోస్ట్
ఇటీవల మూవీ ఆడియో ఫంక్షన్ చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే ఈ వెంట్ ఐశ్వర్య చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు తాజాగా ధన్య వివాదం తెరపైకి వచ్చింది. 12 ఏళ్ల క్రితం ధన్య తమిళనాడును ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ చేసింది. అందులో తమిళనాడు ప్రజలను కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో ఆ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది చూసి కొందరు 'తమిళ ప్రజలను కించపరిచేల ఆమాట్లాడిన ధన్య బాలకృష్ణను సినిమాలో ఎలా తీసుకున్నారు' అంటూ ఐశ్వర్యను ప్రశ్నిస్తున్నారు. 'ధన్య నటించిన లాల్ సలాం సినిమా మేము చూడం' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నన్ను క్షమించండి..
అంతేకాదు ఆమెపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే ఆమెపై నెగిటివిటీ సినిమాపై ప్రభావం చూపేలా ఉన్నాయి. దీంతో తాజాగా ఆ స్క్రీన్ షాట్‌పై స్పందించిన ధన్య ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఆమె తమిళంలో ఓ నోట్ షేర్ చేసింది. "కొద్ది రోజులుగా నా పేరుపై వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ నాది కాదు. నేను తమిళనాడును ఉద్దేశించి అభ్యంతర వ్యాఖ్యలు చేసినట్టుగా అందులో ఉంది. అది నేను పెట్టింది కాదు. ఎవరో నా పేరుపై ఏడిట్ చేసి దాన్ని వైరల్ చేస్తున్నారు. ఇది నిజం. నాకు తిండి పెడుతున్న సినీ పరిశ్రమపై ప్రమాణం చేసి చెబుతున్నా. నన్ను ట్రోల్ చేయడానికి కొందరు కావాలనే దాన్ని సృష్టించారు. ఎవరో నాపై కావాలని చేస్తున్న కుట్ర ఇది. 12 ఏళ్ల క్రితమే దీనిపై నేను క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నా.
ఇంతకాలం దీనిపై మౌనంగా ఉండటానికి కారణం ఉంది. అప్పట్లో ఈ విషయమై నా కుటుంబాన్ని బెదిరించారు. వారిని కాపాడుకోవడం నా బాధ్యత కాబట్టి నేను దీనిపై ఇంతకాలం పెదవి విప్పలేదు" అంటూ వివరణ ఇచ్చింది. అలాగే "తమిళ సినిమాతోనే నా సినిమా కెరీర్ మొదలైంది. అలాంటి ఇండస్ట్రీపై, ఇక్కడి ప్రజలపై నాకు ఎనలేని గౌరవం ఉంది. ఇక్కడ నాకున్న అభిమానుల ప్రేమ వెలకట్టలేనిది. అందుకే ఈ రాష్ట్రం గురించి ఎప్పుడు నేను తప్పుగా మాట్లాడలేదు. ఒక నటిగా, మహిళగా నేను ఎప్పుడూ ఒకరిని నొప్పించేలా వ్యవహరించలేదు. తమిళంలో నేను మూడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేశాను. కానీ ఎక్కడా కూడా ఆ పోస్ట్ ప్రస్తావన రాలేదు. ఎందుకంటే అది నేను చేసింది కాదు కాబట్టే. కానీ, ఆ స్క్రిట్ షాట్ వల్ల తమిళ ప్రజలు ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి" అంటూ తమిళంలో రాసుకొచ్చింది.
View this post on Instagram
ఆ పోస్ట్‌లో ఏముందంటే..
అంతేకాదు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న 'లాల్ సలాం' టీంకు హీరో రజనీకాంత్‌కు, డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్‌కు కూడా ఆమె సారీ చెప్పింది. ఈ స్క్రీట్ షాట్‌లో ఉంది తన కామెంట్స్ కాదని, దానిని నిరూపించుకునేందుకు కూడా తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ఆమె స్పష్టం చేసింది. కాగా ధన్య పేరుపై వైరల్ అవుతున్న ఆ స్క్రీన్ షాట్‌లో ఇలా ఉంది. డియర్ చెన్నై, మీరు నీళ్లు అడుక్కున్నారు.. మేము ఇచ్చాం. కరెంటు కూడా అడుక్కున్నారు.. అదీ ఇచ్చాం. మీ ప్రజలు వచ్చిన మా అందమైన సిటీ ఆక్రమించినా.. ఊరుకున్నాం. ఇప్పుడు మీరు ప్లే ఆఫ్‌లకు వెళ్లేందుకు మా దయతో ఉన్నారు" అని ఉంది. లాల్ సలాం రిలీజ్ నేపథ్యంలో ప్రస్తుతం ఇదే స్క్రీన్ షాట్ సంచలనంగా మారింది. ధన్య వివరణతో మరి ఈ వివాదం సద్దుమనుగుతుందా? లేదా ఇంకా కొనసాగుతుందా? చూడాలి.