(Source: ECI/ABP News/ABP Majha)
Vadlamani Srinivas: జాయింట్ కలెక్టర్ జాబ్ వదిలేసి, సినిమాల్లో కోట్లు సంపాదిస్తున్న నటుడు!
టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీ క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న వడ్లమాని శ్రీనివాస్, గతంలో జాయిన్ కలెక్టర్ గా పని చేసారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
సినిమాల మీద ఇష్టంతో మంచి మంచి ఉద్యోగాలను వదిలేసిన ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారున్నారు. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెప్పేవాళ్ళని కూడా మన చూస్తుంటాం. అయితే నటన మీద ఆసక్తితో ఏకంగా జాయింట్ కలెక్టర్ జాబ్ నే వదిలేసిన నటుడు ఒకరు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. అతనెవరో కాదు వడ్లమాని శ్రీనివాస్.
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రల్లో తన సహజమైన నటనతో ప్రశంసలు అందుకుంటున్న నటుడు వడ్లమాని శ్రీనివాస్. ఓవైపు కామెడీ వేషాలు వేస్తూనే మరోవైపు కన్నింగ్ విలనీ పాత్రల్లో మెప్పిస్తూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. అయితే ఆయన సినిమాల్లోకి రాకముందు వైజాగ్ జాయింట్ కలెక్టర్ హోదాలో పని చేశారనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు.
శ్రీనివాస్ పూర్తి పేరు వడ్లమాని సత్య సాయి శ్రీనివాస్. చిన్నతనం నుంచే సినిమాలు, సాహిత్యం మీద ఆయనకు మక్కువ ఉండేది. కానీ ఉన్నత చదువులు చదువుకొని జాయింట్ కలెక్టర్ అయ్యాడే తప్ప, నటుడు అవ్వాలని అనుకోలేదు. అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చారు. అయితే ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో ఒక చిన్న పాత్ర వేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెంటనే దర్శకుడు మారుతి 'మహానుభావుడు' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.
జాయింట్ కలెక్టర్ గా చేస్తూనే 'గీత గోవిందం', 'ప్రతిరోజూ పండగే', 'ఎఫ్-2' లాంటి పలు చిత్రాల్లో సహాయ నటుడి పాత్రల్లో నటించారు శ్రీనివాస్. ఈ సినిమాలు హిట్ అవ్వడం, ఆయన పాత్రలకు మంచి పేరు రావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. దీంతో గవర్నమెంట్ జాబ్ వదిలేసి పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. అనతి కాలంలోనే సుమారు 70 చిత్రాల్లో నటించారు. అయితే సినిమా కష్టాలు ఏమీ లేకుండా, ఇంత తక్కువ సమయంలో వడ్లమానికి అన్ని ఆఫర్స్ రావడంపై ఇండస్ట్రీలో పలు రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిపై శ్రీనివాస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎవరికో ఏదో చేస్తే సినిమాల్లో వేషాలు ఇవ్వరని అన్నారు.
Also Read: ఓవైపు యాక్షన్, మరోవైపు డైరెక్షన్ - యాక్టర్స్‌గా రాణిస్తున్న డైరెక్టర్స్ వీరే!
తిరుపతి ప్రయాణం ఏర్పాటు చెయ్యగలను, షూటింగ్స్ కోసం పోలీసులకు ఒక మాట చెప్పించగలను అంతకుమించి నేనేం సహాయం చెయ్యగలనని శ్రీనివాస్ అన్నారు. ఇలాంటి హెల్ప్స్ చేస్తే స్నేహం ఏర్పడుతుండే తప్ప, సినిమాల్లో వేషాలు రావన్నారు. కాకపోతే ఇలాంటి సాయం చెయ్యడం వల్ల నటుడిగా ఒక యాక్సెస్ దొరుకుతుందని, ఈజీగా పెద్ద దర్శకులను కలిసే అవకాశం లభిస్తుందని, అదే తనకు జరిగిన మేలని తెలిపారు. ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వచ్చిన తనకు ఇప్పుడు వరుస అవకాశాలు, దానికి తగ్గట్టుగా మంచి రెమ్యునరేషన్, ఇన్కమ్ వస్తున్నాయని చెప్పారు. ఏడాదికి కోటి రూపాయలు సంపాదించే స్థాయికి వచ్చానని, ఎంతోమంది దర్శక నిర్మాతలు మేలు చేస్తేనే తాను ఇండస్ట్రీలో స్థిరపడగలిగానని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగిగా 23 ఏళ్ళు సర్వీస్ చేసినప్పుడు ఉన్న రెస్పెక్ట్, సినీ ఇండస్ట్రీలో ఉండదని శ్రీనివాస్ చెప్పారు. డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హోదా తనకు బాగా ఉపయోగపడిందని.. అందుకే అవమానకరమైన ఘటనలు ఎదురుకాలేదన్నారు. పరిశ్రమలో ఉత్సాహకారమైన వాతావరణం, సపోర్ట్ చేసే వాతావరణం ఉండటంతో నటుడిగా కొనసాగాలనే కోరిక పెరుగుతూ వచ్చిందన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసే సమయానికి తనతో పాటుగా తన భార్యా కూతురికి ప్రభుత్వ వాహనాలు ఉండేవని, ఇంట్లో పది మంది పనివారు ఉండేవారని చెప్పారు. అలాంటి హోదాని వదులుకొని సినిమాల్లోకి రావడం కొంచం ఇబ్బందేనని, ఇక్కడ మంచి గురింపు రావడంతో మెల్లిగా ఈ ఇండిపెండెంట్ లైఫ్ కి అలవాటు పడిపోయాయని తెలిపారు.
'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాకు గాను తొలిసారిగా 10 వేల రెమ్యునరేషన్ అందుకున్నానని వడ్లమాని శ్రీనివాస్ వెల్లడించారు. 'శైలజా రెడ్డి అల్లుడు' అప్పుడు రోజుకు 30 వేలు ఇచ్చారని.. ఇప్పుడు రోజుకి 50 నుంచి 60 వేల వరకూ తీసుకుంటున్నాని తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్-మారుతి సినిమా, 'నా సామి రంగా'తో సహా పాతిక వరకూ ప్రాజెక్ట్స్ తన చేతిలో ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే శత చిత్రాల నటుడు అనిపించుకొబోతున్నానన్నారు. వడ్లమాని శ్రీనివాస్ చివరగా 'భగవంత్ కేసరి' సినిమాలో కనిపించారు. 'పెదకాపు 1' చిత్రంలో ఆయన పోషించిన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు మంచి పేరొచ్చింది.
Also Read: ఏంటి 'బ్రో'.. పవన్ కల్యాణ్ సినిమాకి మరీ ఇంత తక్కువ టీఆర్పీనా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial