'గృహం' సీక్వెల్ రెడీ, అందుకే ‘బొమ్మరిల్లు-2’ తీయడం కష్టం: సిద్ధార్థ్
టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సిద్ధార్థ్ మళ్లీ చాలా గ్యాప్ తర్వాత 'టక్కర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
టాలీవుడ్ లో ఒకప్పుడు లవర్ బాయ్ గా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు హీరో సిద్ధార్థ్. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'ఓయ్' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్నాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి వెళ్ళిపోయాడు. అయితే మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు 'టక్కర్' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తోంది. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ తో తెగ బిజీ అయిపోయాడు సిద్ధార్థ్. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా హీరో సిద్ధార్థ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ముందుగా టక్కర్ సినిమా గురించి మాట్లాడుతూ.. "ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ చుట్టే ఈ సినిమా తిరుగుతుంది. సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య రిలేషన్షిప్ లో చాలా షేడ్స్ ఉంటాయి. డబ్బు సంపాదించాలనే కోరికతో హీరోని ఓ కిడ్నాపర్ గా మారేలా పరిస్థితులు ఎలా ప్రభావితం చేస్తాయి? అనేవి సినిమాలో కీలక అంశాలు' అని తెలిపారు. ఇక తెలుగులో రీ ఎంట్రీ గురించి చెప్తూ..' ఇతర భాషలతో పోలిస్తే తెలుగు సినిమా ఎంతో ప్రత్యేకతను చాటుకుంటుంది. అందుకు ఉదాహరణగా ఎస్.ఎస్ రాజమౌళి తనే ఓ బ్రాండ్ గా మారారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సినిమాకి బలమైన రచన తోడైతే కచ్చితంగా అది విజయం సాధిస్తుంది. గతంలో చూసుకుంటే డైరెక్టర్ వందలాది సినిమాలు తీసేవారు. కానీ ఇప్పుడు ఒక్క సినిమా తీయడానికి దాదాపు నాలుగేళ్ల సమయం పడుతుంది’’ అని అన్నారు
తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నిజానికి భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలు నేనెప్పుడూ రిజెక్ట్ చేయను. మన దేశంలో థియేటర్స్ లో ప్రదర్శించే సినిమాలపై తెలుగు ప్రేక్షకులకు అయితే మన ప్రేమ ఉంటుంది. ఇలాంటి ప్రేక్షకులు, అభిమానులు చాలా అరుదుగా ఉంటారు. అలా తెలుగు అభిమానులు నన్ను ఓ పక్కింటి అబ్బాయిల భావించి నన్ను ఎంతో ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చారు అని తెలిపారు.
కొత్త సినిమాల రచన గురించి చెప్తూ.. ‘‘ఇప్పటికే నేను 'గృహం' సీక్వెల్ ని రెడీ చేశాను. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. ఇక 'టక్కర్' సినిమాలో నా న్యూ లుక్ కి కారణం మా డైరెక్టర్ కార్తీక్ క్రిష్. న్యూ లుక్ లో కనిపించడానికి రీజన్ కూడా సినిమాలో ఓ సన్నివేశంలో చూపించబడుతుంది. నటుడిగా నన్ను నేను మర్చిపోయి, ఆ పాత్రలో లీనమై సినిమాకి పూర్తి న్యాయం చేశానని అనుకుంటున్నాను’’ తెలిపారు.
'బొమ్మరిల్లు 2' గురించి చెబుతూ.. ‘‘ఆ సినిమాకి నా హృదయంలో ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాలో చాలా లోతైన ఎమోషన్స్ ని చూపించాం. అలాంటి ఎమోషన్స్ ని మళ్ళీ రీ క్రియేట్ చేస్తూ బొమ్మరిల్లు సీక్వెల్ చేయడం చాలా కష్టమైన పని’’ అని చెప్పారు. ఇక టక్కర్ తర్వాత సొంత నిర్మాణ సంస్థలో 'చిన్నా' అనే సినిమా చేస్తున్నా. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నా. ఆపై మాధవన్, నయనతారతో 'టెస్ట్' అనే ఒక విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నా' అంటూ తెలిపారు.
Also Read: పెళ్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షాహిద్ కపూర్ - ఫైర్ అవుతున్న నెటిజన్లు!