నచ్చకపోతే సినిమా చూడటం మానేయండి? 'ఆదిపురుష్' ట్రోల్స్ పై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు!
'ఆదిపురుష్' సినిమాలో బ్రహ్మ పాత్రలో నటించిన బిజయ్ ఆనంద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'ఆదిపురుష్' పై వచ్చిన ట్రోల్స్ పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Bollywood Actor Bijay Anand About 'Adipurush' Trolls : బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన 'ఆదిపురుష్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా కనిపించారు. సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతోపాటు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. రామాయణం లాంటి మహాకావ్యాన్ని దర్శకుడు ఇష్టం వచ్చినట్టు మార్చేసాడని, సినిమాకి రూ.500 కోట్లు పెట్టి గ్రాఫిక్స్ కూడా సరిగ్గా చేయలేదని దేశవ్యాప్తంగా మూవీ టీం పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఇదే విషయమై బాలీవుడ్ నటుడు బిజయ్ ఆనంద్ స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బిజయ్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి
సినిమా నచ్చకపోతే చూడటం మానేయండి.. విమర్శించడానికి మీరెవరు?
బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన 'బడే మియా చోటే మియా' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న బిజయ్ ఆనంద్ 'ఆదిపురుష్' సినిమాపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించారు. ఈ మేరకు బిజయ్ ఆనంద్ మాట్లాడుతూ.. "కలని విమర్శించడం మంచి పద్ధతి కాదు. సినిమా నచ్చకపోతే చూడడం మానేయాలి, కానీ విమర్శించడానికి మీరెవరు? ఒక కళాకారుడు తనకు నచ్చినట్టు కలను రూపొందిస్తాడు. దానికోసం డబ్బు, సమయం, తన కష్టమంతా పెడతాడు. 600 కోట్లు ఖర్చు చేసి ఓం రౌత్ సినిమా తీశాడు అంటే అది అతని ఇష్టం. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడకండి. అంతేగాని.. అతన్ని విమర్శించడానికి మీరెవరు? కల మంచిదా, చెడ్డదా అని మీరు చెప్తే అయిపోదు" అని అన్నాడు.
కొంతమంది ఓం రౌత్ ని భయపెట్టారు
"కొంతమంది కళాకారులను భయపెడుతున్నారు. ఓం రౌత్‌ను కూడా అలాగే భయపెట్టారు. కానీ ఓం రౌత్ ఏమాత్రం భయపడకుండా, ట్రోల్స్ ని పట్టించుకోకుండా ఉన్నాడు. అందుకే అతనంటే నాకు ఇష్టం. నేను ఇక్కడ ఎవరి సైడ్ తీసుకొని మాట్లాడటం లేదు. కేవలం ఏకపక్ష వాదిగా మాట్లాడుతున్నా.. కళను గౌరవించినట్లు కళాకారులను కూడా గౌరవించాలి. కానీ భయపెట్టకూడదు" అని పేర్కొన్నారు. కాగా బిజయ్ ఆనంద్ 'ఆదిపురుష్' సినిమాలో బ్రహ్మ పాత్రలో కనిపించారు.
రామాయణాన్ని ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా ఆసక్తికరంగానే ఉంటుంది
"నేను బాలి, వియత్నాం.. ఇలా ఆసియా దేశాలన్నీ ప్రయాణించాను. ప్రతి ఒక్కరికి రామ్, సీతా లక్ష్మణులకు సంబంధించి వాళ్లకు సొంత వెర్షన్ ఉంది. ఓం రౌత్ కంటే ముందు చాలామంది రామాయణం గురించి చెప్పారు ఇదొక ఇతిహాసం. దీన్ని ఎంతమంది, ఎన్ని విధాలుగా చెప్పినా అది బాగుంటే ఎల్లప్పుడూ చూడ్డానికి ఆసక్తికరంగా ఉంటుంది" అని రామాయణం గురించి చెప్పుకొచ్చాడు.
Also Read : ప్రభాస్ 'రాజా సాబ్' కోసం మారుతి భారీ ప్లాన్ - ఫస్టటైం ఆ ప్రయోగం చేయబోతున్న డైరెక్టర్ !