Baazigar: ‘బాజీగర్’లో శిల్పాశెట్టి డెత్ సీన్, పగలబడి నవ్విన కాజోల్ - చివరికి ఆ మాట చెప్పి ఏడిపించారట!
Baazigar: 30 ఏళ్ల క్రితం విడుదలయిన ‘బాజీగర్’ సినిమా కాజోల్, శిల్పా శెట్టి, షారుఖ్ ఖాన్ కెరీర్లలో లాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోయింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు దర్శకులు
Baazigar Movie: హీరో అంటే ఫైట్లు చేయాలి, ఆడియన్స్‌ను మెప్పించే మంచితనం ఉండాలి అని ప్రేక్షకులు ఫీలయ్యే రోజుల్లోనే ‘బాజీగర్’ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని తెరకెక్కించారు దర్శకులు అబ్బాస్, ముస్తాన్. ఇప్పటికీ ఇది షారుఖ్ ఖాన్, కాజోల్, శిల్పా శెట్టి కెరీర్లలో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిపోయింది. ఈ ముగ్గురు అప్పుడూ ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టారు. అలాంటి వారికి ‘బాజీగర్’ చిత్రం ఒక టర్నింగ్ పాయింట్‌గా మారింది. షారుఖ్ ఖాన్, కాజోల్‌కు ఇది ఒక లాండ్ మార్క్ చిత్రంగా మిగిలిపోగా.. ‘బాజీగర్’తోనే హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది శిల్పా శెట్టి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు దర్శకులు.
ఏడవకుండా నవ్వింది..
‘బాజీగర్’ చిత్రంలో ప్రియా అనే క్యారెక్టర్‌లో కనిపించింది కాజోల్. ఇక తన చెల్లెలు సీమా చోప్రా పాత్రలో శిల్పా శెట్టి అలరించింది. ఈ సినిమా సైన్ చేస్తున్న సమయానికి కాజోల్, శిల్పా శెట్టిల వయసు 17 కూడా ఉండి ఉండదని గుర్తుచేసుకున్నారు అబ్బాస్, ముస్తాన్. అంతే కాకుండా సినిమా షూటింగ్ సమయంలోని జ్ఞాపకాలను కూడా గుర్తుచేసుకున్నారు. ‘‘ఒక సీన్‌లో శిల్పా శెట్టి బిల్డింగ్ పైనుండి పడిపోయి చనిపోతుంది. అప్పుడు కాజోల్ ఏడవాలి. షారుఖ్ వచ్చి ఓదార్చి తనను తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాలి. కానీ శిల్పా నేలపై పడి ఉండడం చూసిన కాజోల్ ఏడవకుండా.. నవ్వడం మొదలుపెట్టింది’’ అంటూ కాజోల్ అల్లరి గురించి చెప్పుకొచ్చారు దర్శకులు.
ఒక్కటే టేక్..
‘‘కాజోల్‌కు అప్పుడు 17 ఏళ్లే కాబట్టి తనకు సీన్ అర్థం కాలేదని అనుకున్నాం. కానీ అది పూర్తిగా తన వయసు వల్ల అని కూడా అనుకోము. శిల్పా అలా కళ్లు తెరిచి నేలపై పడి ఉండడం చూసి కాజోల్ తన నవ్వును కంట్రోల్ చేసుకోలేకపోయింది. తను చనిపోయి ఉండాలి కానీ కళ్లు తెరిచే ఉన్నాయి, నా ఎమోషన్ బయటికి ఎలా వస్తుంది అని కాజోల్ మమ్మల్ని అడిగింది. అందుకే మేము తనను పిలిచి నేల మీద పడుంది నీ చెల్లెలు తనీషా అనుకో అన్నాము. నిజంగానే మీ చెల్లి అలా రక్తంలో పడి ఉండడం చూస్తే నువ్వేం చేస్తాం? అని అడగగానే తను ఏడవడం మొదలుపెట్టింది. ఆ సీన్‌లో కారులో కూర్చున్న తర్వాత కూడా తను ఏడుస్తూనే ఉంది. కేవలం ఒక్క టేక్‌లో సీన్ ఓకే అయిపోయింది. ఆ సీన్‌లో తను చేసిందంతా చాలా నేచురల్‌గా ఉంటుంది’’ అంటూ కాజోల్‌ను ఏడిపించిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు అబ్బాస్, ముస్తాన్.
ఇద్దరూ మైనర్లే..
‘‘కాజోల్, శిల్పా లాంటి వారే ఆ పాత్రలకు కావాలని మేము అనుకున్నాం. మేము కాజోల్‌ను ఈ సినిమాకు సైన్ చేసే సమయానికి బేఖుదీ సినిమా ఇంకా విడుదల అవ్వలేదు. అప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది. ఆ మూవీ షూటింగ్ తనను చూసినప్పుడు ఇంకా చిన్నపిల్లలాగానే ఉంది అనుకున్నాం. తను చాలా నేచురల్‌గా నటించేది. సెట్స్‌లో ఎవరినీ పెద్దగా ఇబ్బంది పెట్టేది కాదు. తనతో పాటు ఒక కొత్త నటి కావాలి అనుకున్నాం అలా శిల్పా శెట్టి ఆ పాత్రకు సరిగ్గా సరిపోయింది. కానీ అప్పటికీ ఆ అమ్మాయిలకు 17 ఏళ్లే, అంటే వాళ్లు మైనర్లే. కాబట్టి వాళ్ల తరపున వాళ్ల తల్లిదండ్రులే కాంట్రాక్ట్‌పై సంతకం పెట్టారు’’ అంటూ ‘బాజీగర్’ షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్నారు దర్శకులు అబ్బాస్, ముస్తాన్.
Also Read: శ్యామల బెట్టింగ్ రాణి, ప్రజలు ఛీ అంటున్నారు.. పోసానికి ఇదే నా ఛాలెంజ్ - పృథ్విరాజ్