JD Lakshmi Narayana : నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. జగన్ కేసులో ఆయన పేరు పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఆయన సినిమాల్లోకి వస్తున్నారు.
Bheemadevarapally Branch Movie Update : వి.వి. లక్ష్మీ నారాయణ అంటే ప్రజలు గుర్తు పట్టడం కష్టం. జేడీ లక్ష్మీ నారాయణ లేదంటే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ (JD Lakshmi Narayana) అని చెబితే ఠక్కున గుర్తు పడతారు. అప్పుడు ఆయనకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కేసులో ఆయన పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకంటే... నటుడిగా లక్ష్మీ నారాయణ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన ఒక సినిమాలో నటించారు.
రమేష్ చెప్పాల దర్శకత్వంలో ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్ పతాకాలపై బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మిస్తున్న సినిమా 'భీమదేవరపల్లి బ్రాంచి' (Bheemadevarapally Branch movie). ఇందులో సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ నటించారు. ఆయనతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఒక పాత్ర చేశారు. వాళ్ళిద్దరికీ తొలి చిత్రమిది.
''భీమదేవరపల్లి బ్రాంచి' చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయడం ప్రారంభించాం. ఈ బుధవారం కీలక సన్నివేశాలు షూటింగ్ చేశాం. అందులో లక్ష్మీ నారాయణ, నాగేశ్వర్ నటించారు. వాళ్ళిద్దరిపై తీసిన సన్నివేశాలతో సినిమా కంప్లీట్ అయ్యింది'' అని దర్శకులు రమేష్ చెప్పాల తెలిపారు. కథలో సహజత్వం తెరపై ప్రతిబింబించాలని, సీజనల్ ఆర్టిస్టులను కాకుండా వెతికి వెతికి మరీ అనేక మంది థియేటర్ ఆర్టిస్టులతో రమేష్ చెప్పాల సినిమా తీశారని... వాస్తవికత ఉట్టిపడేలా తీసిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని చిత్ర బృందం పేర్కొంది.
''ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఇంతకు ముందు ఎంతో మంది దర్శక - నిర్మాతలు తమ సినిమాల్లో నటించమని అడిగారు. రామ్ గోపాల్ వర్మ ఒకసారి స్వయంగా ఆయన్ను అడగటం జరిగింది. వాళ్ళిద్దరికీ ఆయన నో చెప్పారు. అటువంటి నాగేశ్వర్ గారు మా సినిమాలో నటించడం విశేషం. ఇటీవల దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన ఓ వాస్తవ ఘటన స్ఫూర్తితో దర్శకుడు రమేష్ చెప్పాల ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నియో రియలిజం ఉట్టిపడేలా 'స్లైస్ ఆఫ్ లైఫ్' జానర్ లో రూపొందిస్తున్న చిత్రమిది'' అని బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి చెప్పారు.
Also Read : 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?
అంజి బాబు, రాజవ్వ, సుధాకర్ రెడ్డి, కీర్తి లత, అభి, రూప శ్రీనివాస్, శుభోదయం సుబ్బారావు, సి.ఎస్.ఆర్. వివ రెడ్డి, బుర్ర శ్రీనివాస్ పద్మ, సాయి ప్రసన్న, మానుకోట ప్రసాద్, గడ్డం నవీన్, తాటి గీత మల్లికార్జున్, మహి, వాలి సత్య ప్రకాష్, 'మిమిక్రీ' మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : కె చిట్టి బాబు, సంగీతం : చరణ్ అర్జున్, సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ, కూర్పు : బొంతల నాగేశ్వర్ రెడ్డి, నిర్మాతలు : బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి, రచన - దర్శకత్వం : రమేశ్ చెప్పాల.
Also Read : తెలుగులో 'పొన్నియన్ సెల్వన్ 1' ఎన్ని కోట్లకు అమ్మారు? ఎన్ని కోట్లు రావాలి?