Bigg Boss Sivaji: ఇంటర్ ఫెయిల్, వారితో పరిచయం వల్ల జీవితంలో మలుపులు - ఇదీ శివాజీ జర్నీ
Shivaji: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అయిన శివాజీ.. ఒకప్పుడు సినిమాల్లో నటించేవాడు అని మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. కానీ తను అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడో చాలామందికి తెలియదు.
Sivaji: బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టిన అందరు కంటెస్టెంట్స్‌లో శివాజీ (Sivaji) గురించి ప్రేక్షకులకు ఎక్కువగా తెలుసు. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా ఆడియన్స్‌ను అలరించాడు శివాజీ. కొన్నాళ్లపాటు సినిమాల్లో కనిపించకుండా, అసలు ఎక్కడ ఉన్నాడో తెలియకుండా జీవించిన శివాజీ.. ఒక్కసారిగా బిగ్ బాస్ రియాలిటీ షోలో కనిపించగానే అందరూ షాక్ అయ్యారు. తను హీరోగా నటిస్తున్న రోజుల్లో అసలు శివాజీ పర్సనల్ లైఫ్ ఏంటి, ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు, కెరీర్ ఎలా మొదలుపెట్టాడు అనే విషయాలు ప్రేక్షకులకు తెలియదు. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తన జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతో తను గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి.
ఇంటర్ ఫెయిల్..
శివాజీ సొంటినేని.. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో 1968 జూన్ 30న జన్మించాడు. శివాజీ తండ్రికి ఒక చిన్న వ్యాపారం ఉండేది. ఆయన ధాన్యం, పత్తి, పెసళ్లు, మినుములు లాంటివి హోల్‌సేల్‌గా రైతుల నుంచి కొని రీటైల్‌గా అమ్మే వ్యాపారం చేసేవారు. ఇంటర్ వరకు శివాజీ చదువు మొత్తం నరసరావుపేటలోనే జరిగింది. ఇంటర్ సమయానికే శివాజీకి చదువుపై అంతగా ఆసక్తి లేదని తెలిసిపోయింది. అలా ఒకవైపు తను ఇంటర్ ఫెయిల్ అయ్యాడు.. మరోవైపు తన తండ్రి వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. అందుకే మళ్లీ చదువుకోవాలనుకున్నా కూడా ఫీజ్ కట్టడానికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుందాని, దాంతో పాటు చదువుకోవచ్చనే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లోని తన అక్క ఇంటికి వచ్చాడు శివాజీ.
ఉద్యోగంలో ఇబ్బందులు..
హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఉంటూ ఒక చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అది ఆయనకు నచ్చకపోయినా, ఇబ్బంది పడినా చదువుకు డబ్బులు కావాలనే కారణంతో అదే ఉద్యోగాన్ని కొనసాగించాడు. ఒకసారి తనను చూడడానికి తన తాతయ్య వచ్చారు. అదే సమయంలో ఉద్యోగంలో శివాజీ పడుతున్న కష్టాలను చూశారు. డిగ్రీ పూర్తిచేసే మంచి ఉద్యోగం ఇప్పిస్తానని తనకు చెప్పేసి వెళ్లారు. దీంతో డిగ్రీ చదవడానికి మళ్లీ గుంటూరు వెళ్లాడు శివాజీ. బీఏ పూర్తయ్యింది. ఎమ్‌ఏ కూడా చేస్తే బాగుంటుందని తండ్రి చెప్పడంతో లిటరేచర్ గ్రూప్ తీసుకొని అందులో జాయిన్ అయ్యాడు. కానీ ఫస్ట్ ఇయర్‌లోనే ఫెయిల్ అయ్యాడు. అందుకే డిగ్రీ సర్టిఫికెట్స్ పట్టుకొని మళ్లీ హైదరాబాద్ బాటపట్టాడు శివాజీ. తక్కువ జీవితం అయినా పరవాలేదని ఒక ఉద్యోగంలో చేరాడు. ఆ సమయంలోనే దూరదర్శన్ ఛానెల్‌లో పనిచేసే సుబ్బయ్య పరిచయమయ్యారు. అక్కడ నుంచి శివాజీ జీవితం మరో మలుపు తిరిగింది.
ఎడిటర్‌గా ప్రయాణం మొదలు..
తనకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టమనే విషయాన్ని సుబ్బయ్యతో పంచుకున్నారు శివాజీ. అప్పుడే తనను ఆర్ట్ డైరెక్టర్ విశ్వనాథ్‌ను శివాజీకి పరిచయం చేశాడు సుబ్బయ్య. వెంటనే విశ్వనాథ్ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాడు. అదే సమయంలో తనకు దూరదర్శన్‌లో పనిచేసే కిరణ్ పరిచయమయ్యారు. తన దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాడు. పని నేర్చుకున్న తర్వాత వేరే ఛానెల్‌లో అసిస్టెంట్ ఎడిటర్‌గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత జెమిని టీవీలో టెక్నికల్ ఎడిటర్ అయ్యాడు. అక్కడ షిండే అనే నిర్మాతకు శివాజీ మాటతీరు నచ్చడంతో.. ఇంటికి పిలిచి మరీ యాంకరింగ్ ఆఫర్ ఇచ్చాడు. ముందు శివాజీ ఒప్పుకోకపోయినా.. షిండే తనను ఒప్పించారు. యాంకరింగ్ చేస్తున్న సమయంలో ఒక సీరియల్‌లో చిన్న రోల్ చేసే అవకాశం వచ్చింది. దీంతో నటనపై పూర్తిగా దృష్టిపెట్టాలని అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ముందుగా ‘మాస్టర్’ చిత్రంలో చిన్న రోల్ దక్కించుకొని సినిమాల్లో తన జర్నీని ప్రారంభించాడు శివాజీ.
సినిమాల నుంచి రాజకీయాల్లోకి..
మొదట్లో తను చిన్న క్యారెక్టర్స్ ప్లే చేసిన మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అవ్వడంతో చాలా అవకాశాలు వస్తాయని శివాజీ ఆశపడ్డాడు. కానీ అలా జరగలేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నిర్వహించిన స్టార్ కాంటెస్ట్‌లో పాల్గొనడంతో శివాజీకి సినీ పరిశ్రమ నుంచి ఎన్నో పరిచయాలు ఏర్పడి లైఫ్ టర్న్ అయిపోయింది. 2010 వరకు వరుస సినిమాలతో శివాజీ కెరీర్ సాఫీగా సాగింది. కానీ ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి. సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ముందుగా బీజేపీలో చేరి.. ఆ తర్వాత టీడీపీకి షిఫ్ట్ అయ్యాడు. అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. టీడీపీతో కలిసి పనిచేస్తూ చంద్రబాబుకు మద్దతుగా నిలబడ్డాడు. కానీ ఉన్నట్టుండి రాజకీయాల్లో నుంచి మాయమయ్యాడు. సడెన్‌గా బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Also Read: శివాజీ విన్నర్ అవుతారా? ఆయన ప్లస్, మైనస్‌లు ఇవే - శిష్యుడే పోటీ!