Prince Yawar: నాకు వచ్చింది రూ.15 లక్షలు కాదు - షాకింగ్ విషయాలు బయట పెట్టిన 'బిగ్ బాస్' యావర్
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7లో యావర్. రూ.15 లక్షల సూట్‌కేసును తీసుకొని తను ఆట నుండి తప్పుకున్నాడు. కానీ ఆ క్యాష్ ప్రైజ్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు యావర్.
Bigg Boss 7 Telugu: తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 తాజాగా పూర్తయ్యింది. ఇందులో రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో హౌజ్‌లోకి ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. ఓటింగ్ ప్రకారం ప్రిన్స్ యావర్‌కు ఏ స్థానం వచ్చిందో తెలియదు కానీ క్యాష్ ప్రైజ్ తీసుకొని షో నుండి తప్పుకోవచ్చు అన్నప్పుడు యావర్.. ఆ క్యాష్‌ను యాక్సెప్ట్ చేశాడు. సూట్‌కేసులో రూ.15 లక్షలను ఆఫర్ చేయగా.. అది తీసుకొని తప్పుకోమని యావర్ కుటుంబ సభ్యులు చెప్పారు. వారి చెప్పినట్టుగానే ఆ సూట్‌కేసును తీసుకొని బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 4వ స్థానంగా నిలిచాడు యావర్. అయితే తనకు వచ్చిన క్యాష్ ప్రైజ్ గురించి తాజాగా కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టాడు ఈ కంటెస్టెంట్.
గిఫ్ట్ ట్యాక్స్ కట్..
పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వగా ఆ తరువాతి స్థానంలో రన్నరప్‌గా నిలిచాడు అమర్‌దీప్. ఇక ఎవరూ ఊహించని విధంగా శివాజీ మూడో స్థానంలో నిలిచాడు. మామూలుగా విన్నర్‌కు రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఉండాలి. కానీ అందులో నుండి రూ.15 లక్షలను ప్రిన్స్ యావర్ తీసుకున్నాడు. అయితే వారు ఇచ్చిన ప్రైజ్ మనీ నుండి గిఫ్ట్ ట్యాక్స్ కట్ అవుతుందని యావర్ బయటపెట్టాడు. 35 శాతం కట్ అయిన తర్వాత ఫైనల్‌గా చేతికి దాదాపు రూ.10 లక్షలు వస్తాయేమో అని, ఇంకా రాలేదని అన్నాడు. ఇక కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ విషయంలో కూడా అలాంటి ట్యాక్స్ ఏమైనా కట్ అవుతుందా అని బిగ్ బాస్ ప్రేక్షకులకు అనుమానాలు మొదలయ్యాయి.
‘స్పై’ బ్యాచ్ ఓట్లతో ఫైనల్స్‌కు..
బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన చాలామంది సెలబ్రిటీలు ప్రేక్షకులకు తెలుసు. కానీ పల్లవి ప్రశాంత్, యావర్‌ను మాత్రమే ఎవ్వరూ ఎప్పుడూ బుల్లితెరపై చూడలేదు. అందుకే వీరిద్దరిలో ఒకరు విన్నర్ అవ్వాలని శివాజీ ఎప్పుడూ అంటుండేవారు. కామన్ మ్యాన్ విన్నర్ అయితే బాగుంటుందని శివాజీ ఆశపడేవాడు. అందుకే హౌజ్‌లో ఉన్నంతకాలం ఎక్కువగా వీరిద్దరికే సపోర్ట్ చేసేవాడు. అలా మంచి సపోర్ట్‌తో పల్లవి ప్రశాంత్, యావర్ టాప్ స్థానాల వరకు చేరుకున్నారు. శివాజీతో కలిసి ఈ ఇద్దరు ఏర్పాటు చేసిన ‘స్పై’ అనే బ్యాచ్‌కు బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. పైగా ప్రిన్స్ యావర్ తన ఇంట్లో పరిస్థితులను, తన ఆర్థిక స్థోమతను బయటపెట్టిన తర్వాత చాలామంది ఆడియన్స్ తనపై జాలితో ఓట్లు వేయడం మొదలుపెట్టారు. అంతే కాకుండా గేమ్‌లో కూడా యావర్ యాక్టివ్‌గా ఉండడం వల్ల తను ఫైనల్స్ వరకు చేరుకోగలిగాడు.
ఫైనల్‌గా స్పందించిన యావర్..
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయిన వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన గొడవ వల్ల పోలీసులు.. పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ‘స్పై’ బ్యాచ్ మాత్రం ఏ విధంగా కూడా రియాక్ట్ అవ్వడానికి ఇష్టపడలేదు. ఫైనల్‌గా యావర్ మాత్రం ఒక వీడియోను విడుదల చేసి ప్రశాంత్‌కు సపోర్ట్ చేయమని కోరాడు. ఇక తను విడుదలయ్యి బయటికి వచ్చిన తర్వాత యావర్, ప్రశాంత్, శివాజీ కలిసి భోలే ఇంట్లో కలిశారు. దానికి సంబంధించిన వీడియోను షూట్ చేసి తమ తమ యూట్యూబ్ ఛానెళ్లలో అప్లోడ్ చేశారు టేస్టీ తేజ, శుభశ్రీ. ఇక సీజన్ పూర్తయ్యి హౌజ్ నుండి బయటికి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ అంతా ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయిపోయారు.
Also Read: 'మిస్ పర్ఫెక్ట్'గా మెగా కోడలు లావణ్య - పెళ్లైన తర్వాత కుమారిగా