Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌పై రతిక చెత్త కామెంట్స్
నాలుగో పవర్ అస్త్రా కోసం పోటీకి శుభశ్రీ, యావర్, పల్లవి ప్రశాంత్ ఎంపికయ్యారు. ఇదే క్రమంలో అమర్, రతిక కలిసి ప్రశాంత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగో పవర్ అస్త్రా కోసం కంటెస్టెంట్స్ అంతా పోటాపోటీగా కష్టపడ్డారు. దానికోసం గొడవలు జరిగాయి, వాగ్వాదాలు జరిగాయి. కొందరికి అయితే గాయాలు కూడా అయ్యాయి. అంత కష్టపడిన తర్వాత ఈ పవర్ అస్త్రాను దక్కించుకునే అవకాశం ముగ్గురికి మాత్రమే దక్కింది. నాలుగో పవర్ అస్త్రా కోసం అందరితో పోటీపడి కంటెండర్స్‌గా నిలిచారు ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శుభశ్రీ. ఈ ముగ్గురిలో కేవలం ఇద్దరు మాత్రమే ఫైనల్ లెవెల్‌కు చేరుకుంటారు. అందుకోసమే బిగ్ బాస్.. వారికి మరో టాస్క్‌ను ఇచ్చారు. ఆ టాస్కులో ఈ ముగ్గురిని డైవర్ట్ చేయడానికి ఇతర కంటెస్టెంట్స్ విశ్వప్రయత్నాలు చేశారు. నాలుగో పవర్ అస్త్రా కోసం జరిగిన పోటీకి సంబంధించి బిగ్ బాస్ తాజాగా మరో ప్రోమోను విడుదల చేశారు.
ముగ్గురు కంటెండర్స్ మధ్య పోటీ
ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శుభశ్రీ.. నాలుగో పవర్ అస్త్రా కోసం పోటీకి సిద్ధమయ్యారు. దానికోసమే బిగ్ బాస్.. వారికి ముందుగా ‘పట్టు వదలకు డింబకా’ అనే టాస్క్‌ను ఇచ్చారు. ఈ టాస్క్ కోసం యావర్, శుభశ్రీ, ప్రశాంత్‌లకు పవర్ అస్త్రాను ఇచ్చారు బిగ్ బాస్. ఎవరైతే ఆ పవర్ అస్త్రాను చివరివరకు పట్టుకుంటారో వారే ఫైనల్ టాస్కులో పోటీపడతారని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ముగ్గురు పవర్ అస్త్రాను పట్టుకోగానే.. మిగతా కంటెస్టెంట్స్ అంతా వారిని రెచ్చగొట్టి.. ఆ పవర్ అస్త్రాను వదిలేసేలా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అమర్‌దీప్, రతిక అయితే పల్లవి ప్రశాంత్‌నే ఎక్కువగా టార్గెట్ చేశారు.
సిగ్గు లేదా నీకు
పవర్ అస్త్రాను పట్టుకున్న తర్వాత పల్లవి ప్రశాంత్ దగ్గరికి వచ్చిన అమర్‌దీప్.. రతికకు ఏదో డౌట్ ఉందంట అంటూ మొదలుపెట్టాడు. ‘‘నిన్ను అక్క అని ఎందుకు అన్నాడు’’ అంటూ ప్రశాంత్ ముందే రతికను ప్రశ్నించాడు. దానికి రతిక.. ‘‘ఆయనకు బుర్ర లేదు. అక్కడ మన్ను మశానం ఉంది’’ అని చెప్తూ నవ్వడం మొదలుపెట్టింది. ‘‘ప్రశాంత్ నీకు ప్రాబ్లెమ్ ఉందా’’ అని అమర్ ప్రశ్నించగా దానికి ప్రశాంత్ అవును అన్నట్టుగా తల ఊపాడు. ఏం ప్రాబ్లెమ్ అని అడగగా.. మొత్తం ప్రాబ్లెమే అంటూ రతిక నవ్వుకుంది. ‘‘సిగ్గు లేదా నీకు, ఇలానేనా నిన్ను ఇంట్లో పెంచింది’’ అంటూ ప్రశాంత్‌ను ఉద్దేశిస్తూ రతిక వ్యాఖ్యలు చేసింది. అమర్‌దీప్, రతిక చేస్తున్న పనులకు ప్రశాంత్‌కు పీకల్లోతు కోపం వస్తున్నా కూడా పవర్ అస్త్రాను మాత్రం వదలలేదు.
ఏడుపును అడ్డం పెట్టుకొని
పవర్ అస్త్రా విషయంలో ముగ్గురు కంటెండర్స్.. అస్త్రాను చాలాసేపు పట్టుకొని ఉన్నారు. దీంతో బిగ్ బాస్.. ఒక కంటెస్టెంట్ కోసం మిగతా ఇద్దరు కంటెస్టెంట్స్ పవర్ అస్త్రాను వదిలేసేలా ఒప్పించవచ్చని చెప్పాడు. దీంతో ఎవరికి వారు పవర్ అస్త్రా తమకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. ‘‘తమ్ముడిలాగా నువ్వు నాకు ఛాన్స్ ఇస్తావా’’ అంటూ ప్రశాంత్‌తో సెంటిమెంట్ డైలాగులు కొట్టాడు యావర్. ఇదే క్రమంలో శుభశ్రీ ఎమోషనల్ కూడా అయ్యింది. ఇది చూసి ‘‘ఏడుపు అడ్డం పెట్టుకొని చేస్తే వర్కవుట్ అవ్వదు’’ అంటూ రతిక వ్యాఖ్యలు చేసింది. తన ఉద్దేశంలో క్రయింగ్ స్టార్ ప్రశాంత్.. పవర్ అస్త్రాను వదిలేస్తే బాగుంటుందని తేజతో చెప్పింది రతిక. ఇంత జరుగుతున్నా ముగ్గురు కంటెండర్స్.. పవర్ అస్త్రాను వదలడానికి సిద్ధంగా లేరు కాబట్టి బిగ్ బాస్ వారికి మరో టాస్క్‌ను ఇచ్చారు. అదే ‘కదలకురా.. వదలకురా’. ఈ ఛాలెంజ్‌లో ఒక స్టిక్‌పై పవర్ అస్త్రాను నిలబెట్టి దానిని పట్టుకొని నిలబడాలి కంటెండర్స్. ఎవరైతే ఎక్కువసేపు పట్టుకోలేక వదిలేస్తారో వారు ఓడిపోతారు.
Also Read: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు- చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial