(Source: ECI/ABP News/ABP Majha)
బిగ్ షాక్ - షో మధ్యలో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అరెస్ట్
‘బిగ్ బాస్’ షోలో ఫస్ట్ టైమ్ ఓ కంటెస్టెంట్ అరెస్టయ్యాడు. అక్రమంగా పులి గోరు లాకెట్ ధరించాడనే కారణంతో అటవీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
‘బిగ్ బాస్’ షోలో వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, సామాన్యులు పాల్గొంటారనే సంగతి తెలిసిందే. వీరిలో ఎక్కువ మంది బాగా పాపులర్ లేదా వివిధ వివాదాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితులైనవారే ఉంటారు. ఇటీవల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు కూడా ‘బిగ్ బాస్’లో ఛాన్స్ వస్తోంది. అయితే, ‘బిగ్ బాస్’ షోలో ఉన్న కంటెస్టెంట్ వివిధ కేసుల కోసం షో మధ్య నుంచి వెళ్లడం మనం చూశాం. గతంలో ‘బిగ్ బాస్’ తెలుగులో ముమైత్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ కోసం ‘బిగ్ బాస్’ను విడిచి వెళ్లింది. అయితే, కంటెస్టెంట్ అరెస్టు కావడం అనేది మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. తాజాగా కన్నడ ‘బిగ్ బాస్’లో ఆ ఘటన చోటుచేసుకుంది.
కన్నడ ‘బిగ్ బాస్’ సీజన్ 10లో పాల్గొన్న వర్థుర్ సంతోష్‌ను ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు. చట్టానికి వ్యతిరేకంగా అతడి పులి గోళ్లను సేకరించడం, వాటిని విక్రయించడం తదితర నేరాలకు గాను అధికారులు సంతోష్‌ను అరెస్టు చేశారు. చిత్రం ఏమిటంటే సంతోష్ బిగ్ బాస్ షో మొత్తం పులి గోరు కలిగిన లాకెట్‌ను ధరించే ఉన్నాడు. అదే అతడి కొంప ముంచింది. ఆ షోను చూసిన అధికారులు అతడిపై కేసు పెట్టడమే కాకుండా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆదివారం (అక్టోబర్ 22న) ‘బిగ్ బాస్’ హౌస్‌కు చేరుకున్న అధికారులు.. సంతోష్‌ను తమకు అప్పగించాలని నిర్వాహకులను కోరారు. దీంతో సంతోష్ ‘బిగ్ బాస్’ నుంచి బయటకు వచ్చారు. విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. అతడి మెడలో ఉన్న పులిగోరు నిజమైనదేనని నిర్ధరించుకున్నారు. అనంతరం సంతోష్‌ను తమకు అప్పగించాలని నిర్వాహకులను కోరారు. బిగ్ బాస్ నిర్వాహకుల ఆదేశాల మేరకు సంతోష్ హౌస్‌ను విడిచి బయటకు రాగానే అధికారులు అతడిని అరెస్టు చేశారు.
ఈ ఘటనపై డిప్యుటీ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ కేసు నమోదు చేశామని తెలిపారు. అనంతరం కొమఘట్టాలో ఉన్న ‘బిగ్ బాస్’ సెట్ దగ్గరకు వెళ్లామన్నారు. అనంతరం సంతోష్ మెడలో ఉన్న పులి గోరు లాకెట్‌ను తమకు ఇవ్వాలని నిర్వాహకులను కోరామన్నారు. కొన్ని గంటల తర్వాత వారు ఆ లాకెట్‌ను తమకు ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. అది నిజమైన పులి గోరు అని తెలుసుకున్న తర్వాతే సంతోష్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు.
సంతోష్ కూడా విచారణలో అది పులి గోరేనని అంగీకరించాడు. మూడేళ్ల కిందట హోసూర్‌లో దాన్ని తీసుకున్నట్లు తెలిపాడు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా పులిగోరు కలిగి ఉన్నందుకు అతడికి ఏడేళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. సంతోష్.. హల్లికర్ జాతి పశువుల పెంపకంతో పేరు గడించాడు. ప్రస్తుతం అతడు హల్లికర్ బ్రీడ్ కన్జర్వేషన్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు.