Bigg Boss Non Stop: ‘బిగ్ బాస్’ ఓటీటీ ఫస్ట్ లుక్: కొత్త హౌస్ అదిరింది, ఈ తేదీ నుంచి ఇక ‘నాన్ స్టాప్’ వినోదం
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ప్రసారం కానున్న ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ తేదీ ఫిక్స్ అయ్యింది. కొత్త బిగ్ బాస్ హౌస్ కూడా అదిరింది.
Bigg Boss Telugu OTT | తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ఓటీటీ మొదటి సీజన్.. స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. 24x7 నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు ‘డిస్నీ హాట్ ప్లస్ హాట్‌స్టార్’ రెడీగా ఉంది. గతమెన్నడూ లేనంత రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా.. ఔరా అనిపించేలా ఈసారి బిగ్ బాస్ హౌస్ కనిపించనుంది. శుక్రవారం విడుదల చేసిన ‘బిగ్ బాస్’ ఫస్ట్ లుక్‌ను చూస్తే.. తప్పకుండా ఫిదా అయిపోతారు.
ముందుగా చెప్పినట్లే.. ‘బిగ్ బాస్’ సీజన్ 5 ముగించిన కేవలం రెండు నెలల వ్యవధిలోనే ‘బిగ్ బాస్’ ఓటీటీ మొదటి సీజన్‌ను సెట్ సిద్ధం చేయడం గమనార్హం. కోవిడ్ సమయంలో కూడా టెక్నీషియన్స్ రేయింబవళ్లు శ్రమించి సెట్‌ను అనుకున్న సమయానికి సిద్ధం చేశారు. అలాగే కంటెస్టెంట్ల ఎంపిక కూడా రహస్యంగా సాగిపోయింది. అయితే, ఇప్పటికే ఎవరెవరు హౌస్‌లోకి వెళ్లనున్నారనే విషయాన్ని విశ్వసనీయవర్గాలు లీక్ చేశాయి. కానీ ఎవరు వెళ్తున్నారనేది త్వరలోనే తేలిపోనుంది. ఇందుకు సరిగ్గా ఎనిమిది రోజులు మాత్రమే సమయం ఉంది. ఎందుకంటే.. ‘బిగ్ బాస్’ ఓటీటీ, ఈ నెల (ఫిబ్రవరి) 26 నుంచే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షూట్ కూడా మొదలైపోయింది. ఈ ఫస్ట్ లుక్ వీడియో చూస్తే.. తప్పకుండా మీరు ఫిదా అవుతారు.
‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ మొదటి సీజన్‌లో మొత్తం 18 మంది కంటెస్టెంట్లు పాల్గోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇదివరకే పలు సీజన్లలో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్లతోపాటు వివిధ సోషలో మీడియా వేదికలు, టీవీ చానళ్లలో పాపులరైన స్టార్స్‌ను కూడా హౌస్‌లోకి పంపుతున్నట్లు తెలిసింది. కరోనా వల్ల కొద్ది రోజులు వారందరినీ క్వారంటైన్లో ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సీజన్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్ షూటింగ్ సాగుతున్నట్లు తెలిసింది. బిగ్ బాస్ హౌస్‌తోపాటు కంటెస్టెంట్ల పరిచయం, డ్యాన్స్.. ఇవన్నీ పూర్తి చేయడానికి మరో నాలుగు రోజులు పడుతుంది. ఈ కార్యక్రమాలను ఫిబ్రవరి 26 సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం చేయనున్నారు. అప్పటి నుంచి నాన్ స్టాప్‌గా షో కొనసాగుతూనే ఉంటుంది. మరి, ఈ ప్రయోగం మన తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి. ఇన్నాళ్లు ఎడిటెడ్ వెర్షన్‌కు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులకు.. ‘నాన్ స్టాప్’ బిగ్ బాస్ కొత్త అనుభూతి అందించనుంది. దీనికి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. మీ ఇంటితోపాటు.. మా ఇంటిపై కూడా ‘నాన్ స్టాప్’గా కన్నేసి ఉంచండి అంటూ ఇటీవల నాగ్ ఓ ప్రోమోను కూడా వదిలారు. దీనికి ప్రేక్షకుల నుంచి మాంచి రెస్పాన్స్ వస్తోంది.