Telangana BC Reservation: బీసీ రిజర్వేషన్ అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంలో సవాల్- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana BC Reservation: బీసీ రిజర్వేషన్ అంశంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేయలాని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు కీలక సూచనలు చేసింది.

Telangana BC Reservation: తెలంగాణలో బీసీల రిజర్వేషన్‌లు 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలపై హైకోర్టు స్టే విధించింది. దీంతో స్థానిక సంస్థలక బ్రేక్ పడింది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆర్డర్ కాపీ శుక్రవారం అర్థరాత్రి వచ్చినందు వల్ల దాన్ని పూర్తి స్టడీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చిస్తారు.
ఏ పరిస్థితుల్లో ఏ ప్రాతిపదికన, ఎలా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చామో స్పష్టంగా తెలియజేస్తూనే గతంలో వివిధ సందర్భాల్లో వచ్చిన తీర్పులను స్టడీ చేసి ఆ దిశగా సుప్రీంకోర్టు వాదనలు వినిపించనున్నారు. హైకోర్టు స్టే ఎత్తివేసి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. ముఖ్యమంత్రి సూచనలు తీసుకున్న అధికారులు సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనున్నారు.
కొత్తగా తీసుకొచ్చిన రిజర్వేషన్‌తో ఎన్నికల నోటిఫికేషన్ రావడం, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైందని సుప్రీంకోర్టులో వాదించనున్నారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరికాదని తెలియజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి అన్ని పార్టీలతో మాట్లాడి అసెంబ్లీ చర్చించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించామని వివరిస్తారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57 శాతానికిపైగా ఉందని అందుకే 42 శాతం రిజర్వేషన్ కల్పించడం సబబనే ఉద్దేశంతో జీవో నెంబర్ 9 విడుదల చేశామని వాదించనున్నారు.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం కచ్చితంగా సుప్రీంకోర్టు తలుపు తడుతుందని గ్రహించిన పిటిషనర్లు జాగ్రత్త పడ్డారు. జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తులే సుప్రీంకోర్టులో కేవియట్ వేశారు. ఈ రిజర్వేషన్ అంశంలో ఎలాంటి ఆదేశాలు ఇచ్చే ముందు తమ వాదన వినాలని అభ్యర్థించారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసినా.. వారు కూడా వాదనలు వినిపిస్తారు.
తెలంగాణలో రాజకీయంగా బీసీలకు ఉన్న రిజర్వేషన్‌ను 42 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు జీవో నెంబర్ 9ను విడుదల చేసింది. అయితే అసెంబ్లీలో ఆమోదించిన రిజర్వేషన్ పెంపు బిల్లు ఇంకా గవర్నర్ వద్దే ఉంది. ఆయన ఆమోదం పొందలేదు. ఇంతలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతారా లేదా అని హైకోర్టు వేరే కేసులో ప్రశ్నించే సరికి ప్రభుత్వం జీవో నెంబర్ 9 తీసుకొచ్చి బీసీల రిజర్వేషన్‌లను 42 శాతానికి పెంచింది. హైకోర్టు ఇచ్చిన గడువు కంటే ఒక రోజు ముందు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. రెండు రోజుల క్రితం తొలి విడత నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
అయితే 42 శాతం రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ కొందరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 9 పై స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అయితే కొత్త రిజర్వేషన్ల ప్రకారం కాకండా పాత పద్ధతిలోనే వెళ్లాలని చెప్పేసింది. హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉండటంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టబోతోంది.





















