Pawan Kalyan: నేను లెఫ్టిస్టూ కాదు.. రైటిస్టూ కాదు.. పుట్టుకతోనే దేశభక్తి రావాలి- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Andhra Pradesh News | లక్ష్మీ ముర్డేశ్వర్ పూరి రాసిన ఆమె సూర్యుడిని కబళించింది అనే పుస్తకాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. జర్నలిస్ట్ ఎ కృష్ణారావు పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు.

విజయవాడ: ‘స్త్రీ శక్తి అసమాన్యం. సూర్యుడిని సైతం మింగేయగలిగేంత అమోఘమైన శక్తి వారి సొంతం. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ధర్మం మహిళలకు అత్యున్నతమైన స్థానం ఇచ్చిందిని’ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. తనకు పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు అని, మొదటగా నాకు మా అమ్మ బుచ్చిబాబు రాసిన ‘చివరకు మిగిలేది’ అనే పుస్తకం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఆమె సూర్యుడిని కబళించింది అనే పుస్తకం రాసిన లక్ష్మీ ముర్డేశ్వర్ పురి అత్యున్నత పదవులు నిర్వహించి, మరో వైపు పుస్తకాలు రాయడం గొప్ప విషయం అని ప్రశంసించారు.
లక్ష్మీ ముర్డేశ్వర్ పురి లాంటి ఎందరో ఉన్నతమైన నారీమణుల ఆలోచన మహిళా సాధికారతకు అద్దంపడుతుందన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లివారి కళాక్షేత్రంలో జరిగిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన నవల తెలుగు అనువాద రూపం ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకాన్ని తెలుగులో సీనియర్ జర్నలిస్ట్ ఎ.కృష్ణారావు అనువదించారు.

ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... "పుస్తకాలు చదవడం వల్ల మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. విశాలమైన, విస్తృతమైన ఆలోచనల్ని పెంపొందిస్తుంది. మానసిక పరిపక్వత మనలో పెరగడానికి సామాజిక అంశాలపై మనదైన అవగాహన పెంచుకోవడానికి పుస్తకాలు చదవాలి. నేను విభిన్నమైన పుస్తకాలను చదువుతాను. ఇప్పుడు కారులో వస్తూ వనవాసి అనే పుస్తకాన్ని మరోసారి చదివాను. 1914, 1920ల కాలంలో కోల్‌కతాలోని పరిస్థితి సామాజిక అంశాలను వనవాసిలో చక్కగా వివరించారు. ఒక్కో పుస్తకంలో ఒక్కో రకమైన అంశం దాగి ఉంటుంది. మన మెదడు చురుకుగా పని చేయడానికి, కొత్తగా ఆలోచించడానికి పుస్తక పఠనం ఉపయోగపడుతుంది. లక్ష్మీ పురి రాసిన పుస్తకంలో స్త్రీని అత్యంత శక్తిమంతమైన మనిషిగా చూపడం ఆమె ఉన్నతికి నిదర్శనం.

నేను లెఫ్టిస్టూ కాదు.. రైటిస్టూ కాదు
‘నన్ను చాలా మంది లెఫ్ట్ భావాలు వదిలేసిన వ్యక్తిగా పేర్కొంటారు. కానీ నేనెప్పుడూ లెఫ్టిస్టు కాదు... అలాగనీ రైటిస్టూ కాదు.. నేను ఎప్పుడూ ఒకేలా ఉంటారు, ఒకేలా ఆలోచిస్తాను. వామపక్షవాదులు రాసిన పుస్తకాలు చదివాను, వారితో పరిచయాలు ఉన్నాయి. అలాగే జాతీయవాద భావాలు ఉన్న పుస్తకాలు సైతం చదువుతాను. భారతీయ సంస్కృతి, మన ధర్మం గురించి తెలుసుకుంటాను. దేశ భక్తి విషయంలో స్పష్టమైన అభిప్రాయం ఉంది. బయటకు వెళ్లినప్పుడు కూడా విభిన్న రకాల పుస్తకాలను వెతికి కొంటా. ఎందుకంటే ప్రతి పుస్తకం విలువైనదే. మనకు పుట్టుకతోనే దేశభక్తి రావాలని కోరుకునే వ్యక్తిని నేను’ అన్నారు పవన్ కళ్యాణ్.

భారత మహిళా శక్తికి ప్రతిరూపం ఈ పుస్తకం
లక్ష్మీ పురి రాసిన ఆమె సూర్యుడిని కబళించింది పుస్తకం భారతీయ మహిళల శక్తిని చాటి చెబుతుంది. ఈ పుస్తకంలో మాలతి అనే పాత్రను వర్ణించడం, ఆ పాత్రను బలంగా ముందుకు తీసుకువెళ్లడంలో శ్రీమతి లక్ష్మీ పురి గారి రచనా శక్తి గొప్పగా అనిపిస్తుంది. చదివించేలా ఆమె రచనా శైలి ఉంటుంది. అందరిలో ఉత్సుకతను రేపేలా పుస్తకానికి పేరు పెట్టడం విశేషం. భారత వ్యవస్థ పూర్తిగా మాతృస్వామ్య వ్యవస్థ. స్త్రీని గౌరవించుకోవడంలో, ఆమెను పూజించడాన్ని భారతీయులు గొప్పగా భావిస్తారు. పుస్తకం విషయానికి వస్తే పీకా అనే యువకుడు మాలతి, కమలలను ఏడిపిస్తూ ఉండడం, దానికి బలంగా మాలతి స్పందించడంతో మొదలై.. ఆమె శక్తి మరింత పెంపొందేలా పుస్తక రచనను తీసుకువెళ్లారు. ఇది ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం ‘ఆమె సూర్యుడిని కబళించింది’ అన్నారు.

దుర్గాదేవి ఆరాధకుడిని
అన్ని శక్తులకు మూలం దుర్గాదేవి అని, తాను దుర్గాదేవి ఆరాధకుడిని పవన్ కళ్యాణ్ తెలిపారు. మన దేశంలో స్త్రీకి ఎంతటి గౌరవం ఇస్తారంటే ప్రతి దేవుని పేరు ముందు అమ్మవారి పేరు ఉంటుంది. భాండాసురుడు అనే రాక్షసుడిని దేవతలెవరూ సంహరించలేని తరుణంలో శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా శక్తి స్వరూపిణిగా అవతరించి ఆ రాక్షసుడిని అంతమొందించిందన్నారు. జనసేన పార్టీ మహిళా విభాగానికి పేరు పెట్టాల్సి వచ్చినప్పుడు పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచే ఝాన్సీ లక్ష్మీ బాయి పేరు ఎంచుకున్నట్లు తెలిపారు. కేవలం రాజకీయల కోసమే కాకుండా, ప్రజల గురించి, పార్టీ గురించి పోరాడేందుకు ముందు వరుసలో మహిళలు ఉండాలనే స్ఫూర్తితోనే ఈ పేరు పెట్టానని గుర్తుచేసుకున్నారు. నాకు చిన్నప్పుడు ఏదైనా విషయంలో భయం వేసినప్పుడు అమ్మ చెప్పిన ధైర్యం ఎప్పటికీ గుర్తుంటుందని, సగటు భారతీయ సమాజంలో మహిళలు చెప్పే ధైర్యం ముందుకు నడిపించే ఆయుధంగా పని చేస్తుందన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.






















