Perni Nani case: "పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు"- మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
Perni Nani case: స్టేషన్‌కు వచ్చి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని మాజీ మంత్రి పేర్ని నాని సహా 29 మందిపై కేసులు నమోదు చేశారు.

Perni Nani case: మచిలీపట్నం టౌన్ పీఎస్‌లో హడావుడి చేసిన వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు 29 మందిని కూడా కేసులో నిందితులుగా చేర్చారు. ఓ కేసు విషయంలో స్టేషన్‌కు వచ్చిన వీళ్లంతా పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఓ కేసు విషయంలో సుబ్బన్నను శుక్రవారం పోలీసులు విచారణ పిలిచారు. ఆయన్ని విచారణకు పిలిచి వేధిస్తున్నారని తన అనుచరులతో స్టేషన్‌కు వచ్చారు. వైసీపీ నేతలతో కలిసి వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిపై దుర్భాషలాడారు.
అప్పుడే దీన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నాని తీరు సరిగా లేదని కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ పేట సీఐపై పేర్ని నాని వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన నిరసన కేసులో కొంత మందికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా A8గా ఉన్న మేకల సుబ్బన్న అనే వ్యక్తిని కూడా స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నామని తెలిపారు. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో పేర్ని నాని గ్రూపుగా పోలీస్ స్టేషన్ కు వచ్చారని వివరించారు. SHO ఛాంబర్ లోకి వచ్చి విచారణ అధికారి అయిన సీఐని బెదిరించేలా పేర్ని నాని మాట్లాడారని అన్నారు.
పోలీస్ స్టేషన్లో సీఐ తో గొడవకు దిగిన @perni_nani గారు
— Krishnaveni Paleti (@KrishnaveniYCP) October 10, 2025
మెడికల్ కాలేజ్ ధర్నా కేసు లో రోజు స్టేషన్ కి పిలుస్తున్నారని వేధిస్తున్నారని ఆరోపణ.
నేను అధికారం లోకి రాగానే నేను అంటే ఏంటో Andhra Pradesh Police కి చూపిస్తా : పేర్ని నాని pic.twitter.com/r09OIRSnxG
దీన్ని జిల్లా పోలీస్ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. సీఐ విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని ఖండించారు. పోలీస్ స్టేషన్‌కు రావడం తప్పులేదని, ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చు, అంతేగానీ విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని విడిపించుకుని వెళ్లిపోతా అనడం సరికాదన్నారు. పోలీసులతో మాట్లాడేటప్పుడు గౌరవంగా ఉండాలని, అప్పుడు తాము కూడా అదే గౌరవంతో మాట్లాడుతామని అన్నారు. గ్రూపులుగా వచ్చి గలాటా సృష్టించడం సరైన పద్ధతి కాదని సూచించారు. దీనిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇలా హెచ్చరించిన తర్వాత పేర్ని నానితోపాటు 29 మందిపై కేసులు నమోదు చేశారు. స్టేషనకు వచ్చి గలాటా సృష్టించారని ఎఫ్‌ఐర్‌లో పేర్కొన్నారు.





















