Andhra Pradesh : నకిలీ మద్యం కేసులో జనార్దనరావును రహస్య ప్రదేశంలో విచారిస్తున్న అధికారులు
Addepalli Janardhan Rao: ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావును అధికారులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందుతుడు అద్దేపల్లి జనార్దనరావును పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇవాళ ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆయన విచారణలో మరిన్ని కీలకాంశాలు బయటపడతాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఉన్న మరిన్ని కోణాలు చూడాల్సి ఉంటుందని అంటున్నారు. నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం జనార్దనరావును అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేస్తోంది. టీడీపీకి చెందిన నేతలే ఈ కేసులో ఉండటంతో వారిపై చర్యలు తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయినా కూటమి నేతలపై విమర్శలు ఆగడం లేదు. అందుకే దీన్ని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా విదేశాల్లో ఉన్న అద్దేపల్లి జనార్దనరావు స్వదేశానికి వచ్చీరాగానే అరెస్టు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దనరావు గత నెలలోనే విదేశాలకు వెళ్లారు. వారం రోజుల క్రితం రాష్ట్రానికి రావాల్సి ఉంది. కానీ ఇంతలో నకిలీ మద్యం కేసు వెలుగు చూసింది. దీంతో ఆయన ఇన్ని రోజులు అక్కడే ఉండిపోయారు. ఆరోగ్యం బాగా లేదని వీడియోలు రిలీజ్ చేశారు. తనను కావాలనే ఇరికించారని ఆరోపణలు చేశారు.
విదేశాల్లో ఉంటూ వీడియోలు రిలీజ్ చేస్తూ కేసులో తన పాత్ర లేదని చెబుతూ వచ్చిన జనార్దనరావు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వెంటనే అధికారులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి రహస్య ప్రాంతంలోకి తీసుకెళ్లి విచారిస్తున్నారు.
నకిలీ మద్యం దందాలో మొత్తం 36 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో జనార్దనరావు A1గా, సోదరడు జగన్మోహనరావు ఏ2గా ఉన్నారు. ఇద్దర్నీ అధికారులు అరెస్టు చేశారు. మరికొందర్ని కూడా అరెస్టు చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు కేసును ముందుకు తీసుకెళ్తున్నారు. నకిలీ మద్యం వ్యాపారంతో వచ్చిన డబ్బులను ఎటు మళ్లించారు. ఇప్పుడు దొరికిన వారంతా కేవలం సూత్రధారులా పాత్రధారులా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అందుకే అన్నదమ్ములను ఒకచోట విచారిస్తే మరిన్ని కీలకాంశాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.





















